‘కన్నతండ్రి వదిలేశాడు.. ఓ హిజ్రా పెంచి పెద్ద చేసింది’

  • భార్గవ్ పరీఖ్
  • బీబీసీ ప్రతినిధి
మాను, గోపాల్

ఫొటో సోర్స్, Dileep Thakar

గోపాల్‌కు ఇప్పుడు 14ఏళ్లు. కానీ ఆ పిల్లాడికి 10రోజుల వయసున్నప్పుడే కుటుంబం అతడిని వదిలేసింది. దాంతో పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ అబ్బాయిని మాను మాసి అనే ఓ హిజ్రా దత్తత తీసుకుంది.

ఓ మామూలు కుర్రాడు హిజ్రాల మధ్య ఓ 'సాధారణ' వ్యక్తిగా ఎలా పెరిగి పెద్దయ్యాడో చెప్పే కథ ఇది.

గోపాల్ స్వస్థలం గుజరాత్‌లోని కర్చోలియా గ్రామం. అతడు పుట్టగానే తల్లి చనిపోయింది. దాంతో తండ్రి ఆ పిల్లాడిని నష్టజాతకుడిగా భావించాడు. తల్లి మరణానికి ఆ పిల్లాడే కారణం అనుకునేవాడు.

తండ్రి కుటుంబ సభ్యులు ఆ పిల్లాడిని అనాథ శరణాలయంలో వదిలేసి అతడికి మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. ఈ విషయం అహ్మదాబాద్‌లో ఉండే మాను అనే ఓ హిజ్రాకు తెలిసింది.

చనిపోయిన ఆ పిల్లాడి తల్లి మానుకు దూరపు బంధువు. ఆ పిల్లాడిని అనాథ శరణాలయంలో వదిలేస్తారని తెలిసి మాను తట్టుకోలేకపోయింది. దాంతో పంచాయతీ పెద్దల్ని ఒప్పించి ఆ బిడ్డను తానే దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది.

పోలీసులు, ప్రభుత్వాధికారుల సాయంతో అధికారికంగానే ఆ పిల్లాడిని దత్తత తీసుకొని తనతో పాటు తీసుకెళ్లిపోయింది. గోపాల్ అని ఆ అబ్బాయికి పేరు కూడా పెట్టింది.

ఫొటో సోర్స్, Dileep Thakar

''నేను హిజ్రాను. పిల్లల్ని పెంచే పద్ధతిపైన నాకు ఏమాత్రం అవగాహన లేదు. కానీ నెమ్మదిగా ఇతరుల్ని చూసి గోపాల్‌ను కూడా అలానే పెంచడం మొదలుపెట్టాను. మా వర్గంలో అంతా నన్ను 'గురు' అని పిలుస్తారు. నాకు 80మంది శిష్యురాళ్లున్నారు. నేనేది చెబితే వాళ్లదే చేస్తారు'' అని మాను బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

సాధారణంగా హిజ్రాలు పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు వెళ్లి ఆడీపాడీ డబ్బులు సేకరిస్తుంటారు. కానీ గోపాల్ కోసం ఆ పని మానేసినట్టు మాను చెప్పారు.

''నేను చేసే పనుల ప్రభావం గోపాల్‌పైన ఏమాత్రం పడకూడదని ముందే నిర్ణయించుకున్నాను. అందుకే పెళ్లిళ్లకు వెళ్లి డబ్బులు అడగడం మానేశాను. పెద్దయ్యాక వాడికి ఈ విషయం తెలిస్తే చిన్నబుచ్చుకుంటాడేమో అనే భయంతోనే ఆ పని చేశాను. నా పనిలో భాగంగా గోపాల్‌ను ఎప్పుడూ బయటకు తీసుకెళ్లలేదు. మొదట్లో మా ప్రభావం వాడిపైన పడకుండా పెంచడం కాస్త కష్టమైంది. కానీ గోపాల్‌ను మామూలు కుర్రాడిలా పెంచడంలో నా తోటి హిజ్రాలు కూడా సాయంగా నిలిచారు.’’

ఫొటో సోర్స్, Dileep Thakar

‘‘వాడికి నాలుగేళ్ల వయసప్పుడు స్కూల్లో చేర్పించా. అక్కడ అప్లికేషన్లో తండ్రి స్థానంలో నా పేరే రాశా. ఇతర పిల్లల తండ్రుల్ని చూశాక వాడు కూడా తన తండ్రి ఎక్కడని అడిగేవాడు. పదేపదే అలా అడుగుతుండటంతో ఉండబట్టలేక వాడిని వాళ్ల నాన్న దగ్గరకు తీసుకెళ్లా. కానీ అప్పటికీ ఆ తండ్రి మనసు మారలేదు. మమ్మల్ని చాలా అవమానకరంగా చూశాడు. 'ఆ నష్టజాతకుడిని మళ్లీ నా ఇంటికి తీసుకురాకు' అని గెంటేశాడు. ఆయన మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ రోజు నుంచీ మళ్లీ గోపాల్‌ను ఆ ఊరికి తీసుకెళ్లలేదు'' అంటూ మాను నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

మాను స్నేహితులంతా గోపాల్‌ను ఇంజినీర్‌గా లేదా వ్యాపారవేత్తగా చూడాలనుకుంటున్నారు. గోపాల్ మాత్రం డాక్టరై పేదలకు సేవ చేయాలనుందని చెబుతున్నాడు.

ఏదేమైనా అందరి కోరికా, గోపాల్ బాగా చదువుకొని ఇతర కుర్రాళ్లలా జీవితంలో స్థిరపడాలనే.

ఫొటో సోర్స్, Dileep Thakar

‘'వాడు ఏం కావాలంటే అది చేయొచ్చు. వాడి చదువుకోసం నేను డబ్బు దాచిపెట్టాను. పెళ్లి, ఇల్లు.. ఇలా అన్ని అవసరాలకూ డబ్బును పొదుపు చేస్తున్నాను. భవిష్యత్తులో గోపాల్‌కు వ్యాపారం చేయాలనిపిస్తే దానికోసం కూడా డబ్బు సమకూర్చడానికి నేను సిద్ధం'’ అన్నారు మాను, గోపాల్ భవిష్యత్తు గురించి తన ప్రణాళికను వివరిస్తూ.

గోపాల్‌కు పెళ్లి వయసు వచ్చేసరికి తాను అతడి పక్కన ఉంటానో లేదోననే విచారాన్ని మాను వ్యక్తం చేశారు.

గోపాల్ మాత్రం.. ‘'నేనెప్పుడూ అమ్మతోనే ఉంటాను. ఆమె కోసమే కష్టపడి చదువుతున్నాను. వచ్చే సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఆమెను సంతోషపెడతాను. నాకోసం ఇన్ని చేసిన అమ్మ కోసం నేను ఏం చేసినా తక్కువే'’ అంటాడు, వాళ్ల 'అమ్మ'ను దగ్గరికి తీసుకుంటూ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)