బుధవారం నాడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం: కుమారస్వామి

 • 19 మే 2018
కుమారస్వామి Image copyright MANJUNATH KIRAN/GettyImages

కర్ణాటక సంక్షోభానికి ప్రస్తుతానికి తెరపడింది. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు.

గతంలో 2007లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కూడా యడ్యూరప్ప ఇలాగే వారం రోజుల్లోగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత, 2008 నుంచి 2011 వరకు దాదాపు మూడేళ్ల పాటు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు.

బీజేపీకి సభలో మెజారిటీకి 7 సీట్లు తక్కువైన స్థితిలో శాసనసభ్యుల కొనుగోళ్లకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం... మరెన్నో నాటకీయ పరిణామాల అనంతరం చివరకు యడ్యూరప్ప రాజీనామా చేశారు.


7.52 సోమవారం ప్రమాణస్వీకారం: కుమారస్వామి

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తమను గవర్నర్ ఆహ్వానించారని జేడీ(ఎస్) నేత కుమార స్వామి మీడియాకు తెలిపారు.

బుధవారం తాను కంఠీరవ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన వెల్లడించారు.

మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య జరిగే ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా హాజరవుతారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్‌పీ నేత మాయావతిలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నానని ఆయన చెప్పారు.


Image copyright Twitter/SitaramYechuri

7.19 కర్ణాటక గవర్నర్ రాజీనామా చేయాలి: ఏచూరి

కర్ణాటక వ్యవహారాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి స్పందించారు.

"ప్రజాస్వామ్య నిర్మాణాలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారు. నల్ల ధనాన్ని, నేరస్థులను ఉపయోగించుకొని ప్రజాభీష్టానికి భిన్నంగా మోదీ, షాలు వ్యవహరిస్తున్నారు" అని ఆయన ట్వీట్ చేశారు.

కర్ణాటక గవర్నర్‌ రాజీనామా చేయాలని ఏచూరి ట్వీట్ చేశారు. "బెంగళూరులో తిష్టవేసి అవినీతికర పద్ధతులకు పాల్పడ్డ కేంద్ర మంత్రులు కూడా దోషులే" అని ఆయన ట్వీట్ చేశారు.


5.37 'ప్రజాస్వామ్యం విజయం'

యడ్యూరప్ప రాజీనామా తర్వాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా పలు ట్వీట్లు చేశారు.

"కర్ణాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది. రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకోవాలని బీజేపీ చేసిన కుట్ర విఫలమైంది" అన ఆయన తొలి ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను ఆయన హిట్లర్, గోబెల్స్‌లతో పోల్చారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగాం" అని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.

Image copyright Twitter/NCBN

4.05 యడ్యూరప్ప రాజీనామా

అసెంబ్లీలో దాదాపు 20 నిమిషాల పాటు భావోద్వేగపూరితంగా సాగిన ప్రసంగం తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

"ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి 104 స్థానాల్లో గెలిపించారు. గత రెండేళ్లుగా నేను రాష్ట్రమంతా తిరిగాను. ప్రజల ముఖాల్లోని ఆవేదన చూశాను. ప్రజలు నాపట్ల చూపిన ప్రేమను మరచిపోలేను" అంటూ ఆయన ప్రసంగం సాగింది.

"మమ్మల్ని ప్రజలు 104 కాకుండా 113 స్థానాల్లో గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని స్వర్గంలా తీర్చిదిద్దేవాళ్లం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లోనూ గెలుపు సాధిస్తాం. ఇప్పుడు పదవిని త్యజించడం ద్వారా నేను కోల్పోయేది ఏమీ లేదు. ప్రజల కోసమే నా జీవితం" అని యడ్యూరప్ప పేర్కొన్నారు.

ప్రసంగం ముగిశాక యడ్యూరప్ప రాజభవన్‌కు బయలుదేరారు.


3.50 ఆడియో క్లిప్ కలకలం

తమ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌ను ప్రలోభపెట్టేందుకు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, శ్రీరాములు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ పార్టీ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది.

"వర్రీ అవ్వకండి. ఎలాంటి ఓటింగూ ఉండదు. మేం మా స్పీకర్‌నే ఎన్నుకుని మెజార్టీ చూపించుకుంటాం. మీరు ఎంత డబ్బు అడుగుతున్నారో చెప్పండి? మీరు 10 నుంచి 15 మందిని తీసుకురండి. వారికి మంత్రి పదవులు ఇస్తాం. ఆంధ్రా, తెలంగాణలో లాగానే ఇక్కడ కూడా సభ్యత్వాలను రద్దు చేయడం ఉండదు" అంటూ వారు తమ బీసీ పాటిల్‌ను ప్రలోభపెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


2.52 బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది!

కర్ణాటక విషయంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో ఆయన పత్రికలవారితో మాట్లాడారు.

"కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉంది. జేడీ(ఎస్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బయటకు వెళ్లనీయకుండా వారికి విమానాలు లేకుండా చేయడం దారుణం. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించలేదు. మెజార్టీ లేకపోయినా సాంప్రదాయానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి నేరుగా డబ్బులు ఆశచూపి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో బేరసారాలు చేయడం దేనికి సంకేతం?" అని చంద్రబాబు అన్నారు. "ప్రధాని మోదీ, అమిత్ షాలను నేను ఆడుగుతున్నాను.. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? తమిళనాడుని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు కర్ణాటకను భ్రష్టుపట్టిస్తున్నారు. ఇక మన రాష్ట్రం మీద పడే పరిస్థితికి వచ్చారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


02.34 మా వాళ్లను హోటల్‌లో బంధించారు!

తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బెంగళూరులోని గోల్డ్‌ఫించ్ హోటల్‌లో బందీలుగా ఉంచారని కాంగ్రెస్ ఆరోపించింది. "ఆ హోటల్ ముందు భారీ పోలీసు బందోబస్తు ఉంది" అని బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ్ తెలిపారు.

"మా ఇద్దరు ఎమ్మెల్యేలు రాకపోయినా బలపరీక్షలో యడ్యూరప్ప ఓటమి ఒప్పుకోక తప్పదు. ఆయనకు రాజీనామా చేయడం తప్ప వేరే దారి లేదు" అని జేడీఎస్ ప్రధాన కార్యదర్శి దానిష్ అలీ అన్నారు.

మరోవైపు, యడ్యూరప్ప పేరుతో కాంగ్రెస్ నకిలీ ఆడియో విడుదల చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.

కాగా, కాంగ్రెస్ తమ అధికారిక ట్విటర్ హాండిల్‌లో ఒక ఆడియో ట్వీట్ చేసింది. ఈ ఆడియోలో గొంతు యడ్యూరప్పదే అని చెబుతున్న ఆ పార్టీ ఆయన తమ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

ఎమ్మెల్యేల భార్యలకు ఫోన్ చేస్తున్నారని, యడ్యూరప్పకు మద్దతివ్వాలని చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ ఆరోపించారు.


01.37 - కర్ణాటక అసెంబ్లీ 3.30 గంటల వరకు వాయిదా

01.30 - కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మల్యేల పదవీ ప్రమాణం పూర్తి

1.29- బీజేపీ బేరసారాలు జరుపుతోందని పేర్కొంటూ ఓ ఆడియో క్లిప్‌ను ట్వీట్ చేసిన కాంగ్రెస్


ప్రొటెం స్పీకర్ బోపయ్య.. ఇంతకీ ఎవరాయన?

కర్ణాటకలో సాయంత్రం జరగనున్న బలపరీక్షకు ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమించిన కేజీ బోపయ్య గతంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకరుగా కూడా పనిచేశారు.

బీజేపీకి చెందిన బోపయ్య 1955లో జన్మించారు.

న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన బోయయ్య చిన్ననాటి నుంచి సంఘ్ పరివార్, ఆరెస్సెస్‌లతో కలిసి పనిచేశారు.

ఏబీవీపీలో క్రియాశీల సభ్యుడిగా ఉండేవారు. దేశంలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.

తర్వాత 1990లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2004లో మడికేరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2008లో విరాజ్‌పేట్ నుంచి గెలిచిన బోపయ్య అప్పట్లో ప్రొటెం స్పీకరుగా వ్యవహరించారు.

డిప్యూటీ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బోపయ్య, తర్వాత కాలంలో స్పీకర్ జగదీష్ షెట్టర్ రాజీనామా చేయడంతో స్పీకర్ అయ్యారు.

2010 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పపై తిరుగుబాటు చేసిన 11మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుని, ప్రభుత్వాన్ని నిలబెట్టింది బోపయ్యే. కర్ణాటక హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించినా, సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తప్పుబట్టింది.


Image copyright Getty Images

1.08 బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేత చిదంబరం. బల పరీక్షలో గెలిచేందుకు బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తుందని వరుస ప్రశ్నలు.

‘మొదట 15 రోజుల గడువుకు వినతి, రెండో సారి ఆంగ్లో ఇండియన్ సభ్యుడు, మూడోసారి రహస్య బాలెట్, నాలుగోసారి ప్రొటెం స్పీకర్, అయిదోది కనిపెడుతున్నారు..’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.

1.00 మరో మూడు గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్ష


అంతకు ముందు సుప్రీం కోర్టులో ఏం జరిగింది?

12.50 బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్య కర్ణాటక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా కొనసాగనున్నారు. ప్రోటెం స్పీకర్ నియామకం చెల్లదన్న కాంగ్రెస్, జేడీఎస్ వాదనలను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టు నిర్ణయంతో కేజీ బోపయ్య అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించడానికి అడ్డంకులు తొలగిపోయాయి. అసెంబ్లీలో నిర్వహించే విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బల పరీక్షలో పారదర్శకత ఉండాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును కోరింది.

కాంగ్రెస్ నేత, కోర్టులో పార్టీ తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ప్రస్తుత స్పీకర్‌కు నోటీసులు ఇస్తే అసెంబ్లీలో ఈరోజు బలపరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

అందుకే మేం ఆ విషయాన్ని పక్కన పెట్టాలనుకున్నాం. ప్రత్యక్ష ప్రసారం విషయానికి వస్తే, మేం మా డిమాండ్లపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదు. మాకు బలపరీక్షలో పారదర్శకత ముఖ్యం. అందుకే ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విషయానికి అంగీకరించాం అని కపిల్ తెలిపారు

కాంగ్రెస్ వాదనలు అన్నిటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని బీజేపీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది, మోదీ ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అన్నారు.


Image copyright Getty Images

12.30: అసెంబ్లీ నియమాల ప్రకారం బల పరీక్ష జరుగుతుంది. నియమాల ప్రకారం పార్టీల వారీగా ఓట్ల విభజన కూడా జరుగుతుంది. - కపిల్ సిబల్

12.25: అసెంబ్లీలో బల పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం కోర్టు చెప్పడంతో ప్రొటెం స్పీక‌ర్‌ని తొలగించాలన్న వాదనను పక్కనపెట్టాం - కపిల్ సిబల్


యడ్యూరప్ప సీఎంగా కొనసాగాలంటే..

 • యడ్యూరప్ప సీఎంగా కొనసాగాలంటే విశ్వాస పరీక్షలో విజయం సాధించడం తప్పనిసరి.
 • కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నప్పటికీ రెండిటికి ఎన్నికలు జరగలేదు. దీంతో 222 సీట్లకు గాను బీజేపీ 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌ 37 స్థానాల్లో గెలిచాయి.
 • జేడీఎస్‌లో కుమారస్వామి రెండు స్థానాల నుంచి గెలవడంతో ఆ పార్టీ నుంచి విశ్వాస పరీక్షలో పాల్గొనేది గరిష్ఠంగా 36 మంది మాత్రమే అవుతారు. మరోవైపు ప్రోటెం స్పీకర్‌ను బీజేపీ నుంచి నియమించడంతో ఆ పార్టీ సభ్యుల లెక్కా 103 అవుతుంది.
 • అంటే.. ప్రోటెం స్పీకరును, కుమారస్వామి ఒక స్థానాన్ని మినహాయిస్తే విశ్వాస పరీక్షకు గరిష్ఠంగా 220 మంది మాత్రమే హాజరయ్యే వీలుంటుంది.
 • వీరంతా ఓటింగులో పాల్గొంటే, బీజేపీ 110 మంది మద్దతు పొందగలిగితే.. అప్పుడు బీజేపీకే చెందిన ప్రోటెం స్పీకరు ఓటుతో యడ్యూరప్ప గట్టెక్కగలరు.
 • ఆ లెక్కన బీజేపీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం ఉందన్న మాట.
Image copyright Getty Images

ఈ పరీక్షలో యడ్యూరప్ప గెలవలేకపోతే..

 • బలపరీక్షలో యడ్యూరప్ప విజయం సాధిస్తే ఆయన సీఎం కుర్చీకి ఢోకా ఉండదు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగిస్తారు.
 • ఒకవేళ ఆయన విశ్వాస పరీక్షలో విజయం సాధించలేకపోతే మాత్రం వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
 • ఆ తరువాత గవర్నరు వాజూభాయ్ వాలా జేడీఎస్, కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అప్పుడు వారు కూడా మళ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలి.
 • లేదంటే, గవర్నరు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేయొచ్చు. మళ్లీ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
 • ఒకవేళ గవర్నరు జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి అవకాశమిచ్చినా వారూ విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోతే రాష్ట్రపతి పాలనకే అది దారి తీస్తుంది.

11.55: అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ బోపయ్య

11.54: అసెంబ్లీకి హాజరుకాని ముగ్గురు ఎమ్మెల్యేలు వీరిలో ఒకరు కాంగ్రెస్, తక్కిన ఇద్దరు జేడీఎస్


ఇకపై ఏం జరుగుతుంది?

 • ఎంపిక చేసిన వ్యక్తి బోపయ్య పేరును ప్రొటెం స్పీకర్‌గా సూచిస్తూ శాసససభ కార్యదర్శి గవర్నర్‌కు సిఫార్సు చేస్తారు. తర్వాత గవర్నర్ ఆ సీనియర్ ఎమ్మెల్యేతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
 • కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీని సమావేశపర్చమని ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తారు.
 • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి - 1) ప్రొటెం స్పీకర్‌ విశ్వాస పరీక్ష చేపట్టవచ్చు. లేదా 2) కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవచ్చు.
 • ఒకవేళ బలపరీక్షను చేపడితే మొదట వాయిస్ ఓటు నిర్వహిస్తారు. ఆ తర్వాత డివిజన్‌ చేపడతారు. కోరమ్ బెల్ మోగుతుంది. అసెంబ్లీ తలుపులు మూసేస్తారు. సభ్యులందరూ నిలబడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపున్నారో లెక్కిస్తారు.
 • ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను స్పీకర్ ప్రకటిస్తారు.

11.33 ఆర్వీ దేశ్‌పాండేను ప్రొటెం స్పీకర్ చేయాలని కాంగ్రెస్ కోరింది - బీజేపీ న్యాయవాది ముకుల్ రోహత్గీ

11.33 కాంగ్రెస్ చేసిన అన్ని వాదనలనూ సుప్రీం కోర్టు తోసి పుచ్చింది - బీజేపీ న్యాయవాది ముకుల్ రోహత్గీ

11.28 అసెంబ్లీలో బల పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బల పరీక్ష సమయంలో అన్ని నియమాలనూ పాటించాలని సూచించింది.

11.28 సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం.. బోపయ్యే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు.


Image copyright Reuters

11.19 కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

11.13- విధాన సభలో యడ్యూరప్ప ప్రమాణం

11.12- ప్రొటెం స్పీకర్ చరిత్ర అంత మంచిది కాదు - కపిల్ సిబల్

11.11- కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం

11.10- కర్ణాటక అసెంబ్లీలో కార్యకలాపాలు ప్రారంభం

11.09- సుప్రీంకోర్టు ప్రోటెం స్పీకరుకు నోటీసు ఇస్తే, ఈరోజు విశ్వాస పరీక్ష ఆలస్యమయ్యే అవకాశం

11.02- ప్రోటెం స్పీకర్ నియామకంలో చట్టబద్ధతపై కొనసాగుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ

11.00- కర్ణాటక అసెంబ్లీకి ఎమ్మెల్యేల రాక


Image copyright Getty Images

బీజేపీకి ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఉన్న 5 మార్గాలు

 1. బలపరీక్ష సమయంలో 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ అసెంబ్లీకి గైర్హాజరు అయ్యేలా చేయగలిగితే, సభలో హాజరైన ఎమ్మెల్యేల మొత్తం సంఖ్య 208 అవుతుంది.బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం సాధారణ మెజారిటీకి ఈ ఎమ్మెల్యేల సంఖ్య సరిపోతుంది. ఇలా బీజేపీ తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవచ్చు.
 2. జేడీఎస్ లేదా కాంగ్రెస్ కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ విప్ ధిక్కరించి బీఎస్ యడ్యూరప్పకు మద్దతు ఇస్తే, లేదా వీరు సభకు రాజీనామా చేస్తే బీజేపీ ప్రభుత్వం గట్టున పడుతుంది. రెండు విషయాల్లో ఈ ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.
 3. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు హంగామా సృష్టిస్తే, సభాధ్యక్షుడు ఆ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశిస్తే, సభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ అవుతుంది. అలా యడ్యూరప్ప తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు.
 4. కాంగ్రెస్‌లో 12 మందికి పైగా లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కాబట్టి వారంతా ఆయనకు బలపరీక్షలో మద్దతు ఇవ్వాలని లింగాయత్ మఠాధిపతులు ఆదేశించవచ్చు. వీరశైవ సమాజం ద్వారా లింగాయత్‌ల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వాదించవచ్చు.
 5. విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కేందుకు రహస్య బ్యాలెట్ పద్ధతి ఉపయోగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అలా ఎమ్మెల్యేల గుర్తింపు బయటపడకుండా ఉంటుందని భావిస్తోంది. అలా చేసినా యడ్యూరప్ప తన సీఎం కుర్చీని కాపాడుకోవచ్చు.

10.54- మోదీ, అమిత్ షా యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి వదులుకోమని చెప్పాలి- వీరప్ప మొయిలీ

10.52- కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది. అందుకే బీజేపీ అధికారం నుంచి తప్పుకోవాలి- వీరప్ప మొయిలీ

10.49- కర్ణాటక అసెంబ్లీలో కార్యకలాపాలు ప్రారంభం

10.44- సుప్రీంకోర్టులో కాంగ్రెస్ వాదనలు- అందరి కంటే సీనియర్ ఎమ్మెల్యే మాత్రమే ప్రోటెం స్పీకర్ కాగలరు

10.42- సుప్రీంకోర్టులో విచారణలు ప్రారంభం అయ్యాయి. కపిల్ సిబల్ కాంగ్రెస్ వాదనలను వినిపిస్తున్నారు.

11 గంటల నుంచి కర్ణాటక అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో ఓటింగ్ ప్రారంభం

10.41- 2011లో జరిగిన దానిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ సమయంలో బోపయ్య 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. దీంతో యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.

10.38- కర్ణాటక అసెంబ్లీలో ఆర్వీ దేశ్‌పాండే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రోటెం స్పీకర్ పదవిని దేశ్ పాండేకు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Image copyright Getty Images

10.36- కర్ణాటక అసెంబ్లీలో పార్టీల వారీగా స్థానాలు

బీజేపీ - 104, కాంగ్రెస్-78, జనతాదళ్ సెక్యులర్-37, బహుజన్ సమాజ్ పార్టీ-1, స్వతంత్రులు-1, కేపీజేపీ-1


కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో బోపయ్య నియామకాన్ని సవాలు చేశాయి. సంప్రదాయం ప్రకారం ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేగా ఎన్నికైన వారినే ఎంపిక చేయాలని వాదించారు. కానీ గవర్నర్ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీకి చెందిన బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడంతో ఏర్పడిన అనిశ్చితి శనివారం సాయంత్రం వరకూ కొనసాగనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో శనివారం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

యడ్యూరప్ప నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో 222 మంది ఎమ్మెల్యేలకు 104 మంది మాత్రమే ఉన్నారు. సాధారణ మెజారిటీ కంటే ఆయనకు 8 మంది తక్కువ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు