'పదహారేళ్ల' అబ్బాయితో 28 ఏళ్ల అమ్మాయి పెళ్లిపై వివాదం

  • 20 మే 2018
జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో వధూవరులు Image copyright dl narasimha
చిత్రం శీర్షిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో

కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో పదహారేళ్ల వయసుందని చెబుతున్న ఒక అబ్బాయికీ, 28 ఏళ్ల అమ్మాయికీ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే చట్ట ప్రకారం పెళ్లికి పురుషుడి కనీస వయసు 21 ఏళ్లుండాలి.

నిజానికి దేశంలో ఎన్నో యేళ్లుగా బాల్యవివాహాలపై నిషేధం ఉంది. వాటిని అడ్డుకునేందుకు కఠిన చట్టాలూ ఉన్నాయి. బాల్యవివాహం జరిగినట్టు గుర్తిస్తే తల్లిదండ్రులకు లక్ష రూపాయల దాకా జరిమానా, రెండు సంవత్సరాల దాకా జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ మైనర్ల పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి.

నెల రోజుల కిందట జరిగిన ఈ వివాహం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును చూస్తే అసలు బాల్యవివాహాలను అరికట్టడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

వివాహాల్లో సాధారణంగా పెళ్లికొడుకు వయసు ఎక్కువ, వధువు వయసు తక్కువగా ఉంటుంది. బాల్య వివాహాల్లో ఒకరు లేదా ఇద్దరూ మైనర్లే అయి ఉంటారు.

కానీ ఈ వివాహం ఇందుకు భిన్నంగా ఉండడంతో... అంటే వధువు వయసు ఎక్కువ ఉండడం వల్ల కూడా జనం వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

జిల్లాలోని కౌతాళం మండలం పరిధిలోని ఉప్పరహాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు, కర్ణాటక సరిహద్దులోని బాణికనూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువతి ఏప్రిల్ 27న వివాహం చేసుకున్నారు.

'కురవ' కులానికి చెందిన వీరిద్దరూ నిజానికి దూరపు బంధువులే. ఈ ప్రాంతంలో కొన్ని కులాల్లో బాల్యవివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయి.

ఈ పెళ్లి ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలోనే జరిగింది. పదిరోజుల తరువాత ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివాహం చేసుకున్న బాలుడి తండ్రి తాగుడుకు బానిసయ్యారు, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో తనకేదైనా జరిగితే తన ముగ్గురు పిల్లలు రోడ్డున పడతారన్న ఆలోచనతో పెద్దకొడుకైన ఈ బాలుడి తల్లే ముందుండి ఈ వివాహం జరిపించినట్లుగా స్థానిక పత్రికలు రాశాయి.

Image copyright dl narasimha

విషయం జిల్లా అధికారుల దృష్టికి చేరింది. దాంతో రెండవ జాయింట్ కలెక్టర్ రామస్వామి రెవెన్యూ, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఉప్పరహాల్ గ్రామానికి వెళ్లారు.

విషయాన్ని పసిగట్టిన ఇరు కుటుంబాల వారు అధికారులు రావడానికి ముందే గ్రామం నుంచి వెళ్లిపోయారు.

దాంతో అధికారులు బాల్యవివాహం చేసుకున్నవారి బంధువులను, గ్రామ పెద్దలను విచారించారు. చట్టరీత్యా బాల్య వివాహం చెల్లుబాటు కాదని, వధూవరులతోపాటు ఇరు కుటుంబాలవారిని కలెక్టర్ ముందు హాజరు పరచాలని.. లేదంటే ఇరు కుటుంబాల పెద్దలపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రెండు రోజుల తరువాత వధూవరులతోపాటు ఇరు కుటుంబాల పెద్దలు స్థానిక అధికారుల ద్వారా కలెక్టర్ ముందు హాజరయ్యారు. వారికి కలెక్టర్, రెండవ జాయింట్ కలెక్టర్ , మహిళ, శిశు సంక్షేమ శాఖ ఏపీడీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

Image copyright dl narasimha
చిత్రం శీర్షిక మహిళ, శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్(ఏపీడీ)

'ఆరేళ్ల పాటు వాళ్లు విడిగా ఉండాలి'

కౌన్సిలింగ్‌లో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపీడీ) విజయను బీబీసీ సంప్రదించింది.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ -

"21 సంవత్సరాల లోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవటం నేరమని ఈ వివాహం చెల్లదని కలెక్టర్, మేమూ వారికి వివరించాం.

ఆధార్ ప్రకారం ఈ అబ్బాయికి పదహారేళ్లున్నాయి. కానీ చూస్తే అలా కనిపించటంలేదు. అతడి వయసు పది, పన్నెండేళ్లకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. అందుకే అతన్ని బాలల గృహంలో ఉంచాలని చెప్పాం.

కానీ, పెళ్లైన అబ్బాయే సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, అతన్ని తీసుకెళ్తే ఆ కుటుంబ పోషణ కష్టమవుతుందని, ఆ పని చేయొద్దని గ్రామ పెద్దలు ప్రాధేయపడ్డారు.

చట్టం ప్రకారం ఈ వివాహం చెల్లదు కాబట్టి మరో వివాహం చేసుకోవాలని అమ్మాయికి చెప్పాం. కానీ వారిద్దరూ వినడంలేదు. పెళ్లికి ముందే తాము ప్రేమించుకున్నామని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని చెప్పారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడపిల్లను ఇంకెవరూ చేసుకోరని, కాబట్టి పెద్దమనసుతో ఈ విషయాన్ని వదిలేయాలని గ్రామ పెద్దలు పట్టుబట్టారు. మేం ఎంత చెప్పినా వాళ్లు వినలేదు.

దాంతో చివరిగా 6 సంవత్సరాల పాటు అబ్బాయి, అమ్మాయి ఎవరి తల్లిదండ్రుల వద్ద వారుండాలని.. ఆ తరువాత కలిసి జీవించొచ్చని కలెక్టర్ చెప్పారు. అందుకు ఇరుకుటుంబాల వారు, గ్రామ పెద్దలు అంగీకరించారు.

ప్రతి నెలా మెుదటి శనివారం అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల ముందు హాజరుకావాలని కూడా కలెక్టర్ షరతు విధించారు. అందుకు అంగీకరించాక ఎవరి ఇంటికి వారిని పంపించేశాం" అని తెలిపారు.

చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా.. "అలా అయితే అబ్బాయిని జువెనైల్ హోం లేదా చిల్డ్రన్స్ హోంకు పంపాలి. ఇద్దరి తల్లిదండ్రులు, పురోహితుడు, పెళ్లికి హాజరైన వారందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కానీ అన్నిచోట్లా చట్ట ప్రకారం చేయటానికి వీలుకాదు. ఇక్కడ మానవతా కోణంలో ఆలోచించి కొన్ని షరతులు విధించి పంపాం" అని ఆమె చెప్పారు.

Image copyright dl narasimha
చిత్రం శీర్షిక కర్నూలు ఎన్జీవో నెట్వర్క్ కన్వీనర్ మద్దిలేటి

ఇలాగైతే బాల్య వివాహాలు ఆగేదెలా?

అయితే, ఈ కేసులో అధికారులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషిచేస్తోన్న కర్నూలు ఎన్జీవో నెట్‌వర్క్ కన్వీనర్ మద్దిలేటి ఆక్షేపించారు.

అబ్బాయిని బాలల గృహంలో ఉంచి ఏదైనా పనిలో శిక్షణ ఇప్పించి, వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక భరోసా కల్పించాల్సి ఉండేదన్నారు.

కలెక్టర్ కార్యాలయంలో అబ్బాయి, అమ్మాయికి మధ్య విధించిన షరతులు అక్కడికే పరిమితమవుతాయి, గ్రామానికి వెళ్లిన తరువాత ఇద్దరూ యథావిధిగా కలిసిపోతారు.

మైనర్ బాలుడిపై అమ్మానాన్న, తమ్ముడు చెల్లితోపాటు ఇప్పుడు భార్యను కూడా పోషించాల్సిన భారం పడుతుందన్నారు.

భవిష్యత్తులో అతడు అనేక శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశముంటుందని తెలిపారు.

వధూవరులు అంగీకరించలేదనో.. తల్లిదండ్రులు, గ్రామపెద్దలు ఒప్పుకోలేదనో చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించకపోతే బాల్య వివాహాలను అరికట్టడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

బాల్య వివాహాల్లో ఏపీది 5వ స్థానం

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో ఉంది.

బాల్యవివాహాల జాతీయ సగటు 24.9 శాతం కాగా, రాష్ట్రంలో 32.3 శాతంగా ఉంది.

దేశవ్యాప్త గణాంకాలను చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో బాల్యవివాహాలు ప్రమాదకర స్థాయిలో జరుగుతున్నాయి. ఈ విషయంలో యూనిసెఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేసింది.

రాష్ట్రంలో బాల్యవివాహాలు జరుగుతున్న జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.

విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జిల్లాలు వరుసగా రెండు, మూడు, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: 6,00,000 దాటిన పాజిటివ్ కేసులు, ఏపీలో 19, తెలంగాణలో 65మంది బాధితులు

కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు పెద్ద నటుల సహాయ హస్తం

కరోనావైరస్: పాకిస్తాన్‌ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు

కరోనావైరస్: ఇటలీలో పెరుగుతున్న భయాలు... దక్షిణ ప్రాంతాలపై కోవిడ్-19 విరుచుకుపడితే పరిస్థితి ఏంటి...

కరోనావైరస్: మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు జరిగే మేలు ఎంత

కరోనావైరస్: కమల్‌ హాసన్ ఇంటికి ఐసొలేషన్ స్టిక్కర్.. తప్పుగా అతికించామని తొలగించిన అధికారులు

కరోనావైరస్: ఆర్‌బీఐ నిర్ణయాలతో మీ ఈఎమ్ఐ‌పై పడే ప్రభావం ఏంటో తెలుసా

కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎందుకంత నిశ్చింతగా ఉన్నారు

కరోనావైరస్ గ్రామాలకు పాకితే భారత్ పరిస్థితి ఏంటి