‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’

న్యూడ్ మోడల్, ధనలక్ష్మి మణిముదలియార్, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్

ఫొటో సోర్స్, BBC/PRASHANT NANAWARE

న్యూడ్ మోడల్ ధనలక్ష్మి మణి ముదలియార్ జీవితకథ ఆధారంగా మరాఠీ సినిమా 'న్యూడ్' తీశారు. ధనలక్ష్మి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో న్యూడ్ మోడల్‌గా పని చేస్తున్నారు. ఆమె బీబీసీ మరాఠీ ప్రతినిది ప్రశాంత్ నానావరెతో న్యూడ్ మోడల్‌గా తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు.. ఆమె మాటల్లోనే..

నాకు ఐదేళ్ల వయసు ఉన్నపుడు నేను చెన్నై నుంచి ముంబై వచ్చాను. మేం మొత్తం ఆరుగురు పిల్లలం. మేం ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉండేవాళ్లం.

మా తల్లిదండ్రులు చెత్తను ఏరుకోవడంలాంటి చిన్నచిన్న పనులు చేసేవారు. కొన్నిసార్లు వాళ్లు నన్ను బిచ్చమెత్తుకునేందుకు కూడా పంపేవారు.

కొన్ని రోజులయ్యాక మేం ధారవి మురికివాడకు మారాం. మేం దుర్భర దారిద్ర్యంలో జీవించేవాళ్లం. నేను కొన్ని రోజులు మాతుంగ లేబర్ క్యాంపులోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూలుకు వెళ్లా. కానీ కొద్ది రోజుల తర్వాత పేదరికం కారణంగా చదువు ఆపేయాల్సి వచ్చింది.

మా అమ్మ నన్ను కొన్ని ఇళ్లల్లో పనికి కుదిర్చింది. మేం అన్నం, కూరలు, ఎండుచేపలు వండి వాటిని గ్రాంట్ రోడ్ ప్రాంతంలోని నిషా మూవీ థియేటర్ బయట అమ్మేవాళ్లం. అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. నేను చూసిన మొదటి సినిమా షోలే.

నాకన్నా 10-12 ఏళ్లు పెద్దవాడైన మణి అనే వ్యక్తితో మా వాళ్లు నా పెళ్లి చేశారు. నా పెళ్లి సమయానికి నా వయసు 14 ఏళ్లు.

ఈలోగా నా సోదరుల్లో ఒకరు మద్యానికి బానిసై మరణించాడు. మరొకరు రైలు ప్రమాదంలో మరణించాడు. నా సోదరి ఒకరు తన పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆ పిల్లలందర్నీ నేనే చూసుకునేదాన్ని. ఇది నా భర్తకు ఇష్టం లేకపోయింది. దాంతో అతను నన్ను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. నా దగ్గర్నుంచి డబ్బులు తీసుకుని, మద్యం సేవించడం ప్రారంభించాడు. ఈలోగా మా నాన్న పెట్టే బాధలు భరించలేక మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది.

ఫొటో సోర్స్, BBC/PRASHANT NANAWARE

అదోలా చూసేవాళ్లు...

నా పెద్ద కుమారుడికి ఆరేళ్ల వయసు వచ్చినపుడు, నేను రెండోసారి గర్భవతిని అయ్యాను. సరిగ్గా అదే సమయంలో నా భర్త మరణించాడు. దాంతో నేను చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారాను.

అప్పుడు నేను ఏం పని చేయాలా అని ఆలోచించేదాణ్ని. నేను ఆకర్షణీయంగా ఉండేదాన్ని. అందరూ నా వైపు దురుద్దేశంతో చూసేవాళ్లు. చాలా మంది నాకు పని ఇస్తామన్నారు కానీ దాని వెనుక ఉద్దేశం వేరు. అందువల్ల నేను ఒప్పుకోలేదు.

నాకు తెలిసిన రాజమ్మ అనే మహిళ 'జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్'లో పని చేసేది. ఒకసారి నేను ఆమెను కలవడానికి జేజే స్కూల్‌కు వెళ్లాను. అక్కడ ఆమె కోసం వెదుకుతూ, ఒక గదిలోనికి తొంగి చూస్తే రాజమ్మ కాళ్లు కనిపించాయి. హఠాత్తుగా ఒక విద్యార్థి నా ఎదుటికి వచ్చి, ఏం కావాలన్నాడు. నేను రాజమ్మను కలవడానికి వచ్చానని చెప్పాను. అతను నన్ను గదిలోకి తీసుకెళ్లగానే, నా ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నేను షాక్ తిన్నాను.

అక్కడ రాజమ్మ పూర్తి నగ్నంగా ఉంది.

నన్ను చూసి, ''నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?'' అని అరిచింది.

''నేను పని కోసం వచ్చాను. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?'' అని అడిగాను.

''ఎలాగూ నేను చేసే పని ఏంటో చూశావు కాబట్టి, నువ్వు కూడా ఈ పని చేయొచ్చు. ఆకలితో చచ్చే బదులు, ఈ పని చేయడం మేలు'' అంది. కానీ నేను దానికి అంగీకరించలేదు.

మేం మాట్లాడుతుండగానే, ఇద్దరు ఉపాధ్యాయులు ఆ గదిలోకి వచ్చారు. వాళ్లు రాజమ్మతో, నేను కూడా ఆమెలాగే మోడలింగ్ చేయగలనా అని ప్రశ్నించారు.

రాజమ్మ 'చేస్తుంది' అని సమాధానం ఇచ్చింది. 'నువ్వు పని చేస్తున్నావ్, అంతే' అని ఆదేశించింది.

నేను ఆలోచించడం ప్రారంభించాను.

రాజమ్మ నాతో, ''మొదట పని చేసి, ఆ తర్వాత ఆలోచించు. ఇక్కడ నగ్నంగా కూర్చున్నందుకు నీకు రోజుకు 60 రూపాయలు ఇస్తారు. అదే దుస్తులు వేసుకుని కూర్చుంటే 50 రూపాయలు. నీ రూపం కూడా బాగుంది కాబట్టి నీకు ప్రతి రోజూ పని దొరుకుతుంది'' అని చెప్పింది.

నేను అదే రోజు నుంచి పని చేయడం ప్రారంభించాను.

ఫొటో సోర్స్, BBC/PRASHANT NANAWARE

నగ్నంగా మారడంలో నా మొదటి అనుభవం

ఒక విద్యార్థి టేబుల్ తెచ్చి గది మధ్యలో వేశాడు.

నేను సందేహిస్తూ ''ఇక్కడేమీ పార్టిషన్ లేదా?'' అని అడిగాను.

రాజమ్మ ''పార్టిషన్ ఎందుకు? ఎక్కువగా ఆలోచించకు. బట్టలు తీసేసి, వాటిని కుర్చీ మీద పెట్టు'' అంది.

నేను ఏడవడం ప్రారంభించాను. అప్పుటికి నాకు రెండేళ్ల వయసున్న కొడుకున్నాడు. నేను వాడికి పాలు పట్టేదాన్ని. అందువల్ల నా పాలిండ్లు పెద్దగా ఉండేవి. నాకు చాలా సిగ్గనిపించింది. కానీ విద్యార్థులు ఏం ఫర్వాలేదని నన్ను సముదాయించారు. నన్ను రిలాక్స్ కమ్మని అన్నారు.

చివరికి ఎలాగోలా నేను బట్టలు తీసేసి కూర్చున్నాను. విద్యార్థులు నా బొమ్మను గీస్తుంటే నా పాలిండ్ల నుంచి పాలు కారడం ప్రారంభించాయి. నేను కారుతున్న పాలను తుడుచుకుంటుంటే నా సమస్యను అర్థం చేసుకున్న విద్యార్థులు ఆ రోజుకు చాలించి, మరుసటి రోజు రమ్మన్నారు.

ఫొటో సోర్స్, BBC/PRASHANT NANAWARE

రూ.60 నుంచి రూ.1000 వరకు..

రాజమ్మను జేజే స్కూల్‌లో చాలా గౌరవించేవాళ్లు. విద్యార్థులు ఆమె పాదాలను తాకేవారు.

కొన్ని రోజులు పోయాక, అక్కడి విద్యార్థులు నాకు అలవాటయ్యారు. నేను గత 25 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను.

ప్రస్తుతం నాకు న్యూడ్ పెయింటింగ్‌కు వెయ్యి రూపాయలు, అదే దుస్తులతో కూర్చుంటే రూ.400 ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూడా కొత్త మోడల్స్‌ను తీసుకువస్తున్నాను. వాళ్లకు శిక్షణ ఇవ్వడం నా బాధ్యత.

ఇప్పుడు విద్యార్థులు నా కాళ్లకు కూడా నమస్కరిస్తారు. ఏ ఒక్క విద్యార్థీ నా వంక దురుద్దేశంతో చూడడు.

మరాఠీ సినిమా 'న్యూడ్' నా కథ. దాని దర్శకులు రవి జాదవ్, నటి కల్యాణి మూలే చాలా మంచి వాళ్లు.

పోయిన నెల కల్యాణి జేజే స్కూల్‌కు వచ్చినపుడు, ఆమె కంటే నాకే ఎక్కువ మంది చప్పట్లు చరిచారు. అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం.

ఆ సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి. చాలా మంది ఈ సినిమాతో నాకు చాలా డబ్బు వచ్చిందనుకుంటారు కానీ, దానిలో నటించినందుకు నాకిచ్చింది కేవలం ఒక చీర, రూ.20,000.

ఫొటో సోర్స్, sirjjschoolofart

'పిల్లలు నన్ను చూసి గర్విస్తారు'

నేను న్యూడ్ మోడల్‌గా పని చేస్తున్నట్లు పిల్లలకు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఒక ప్రొఫెసర్ వద్ద ఇంటి పని, వంట పని చేస్తానని చెప్పాను. కానీ న్యూడ్ సినిమా విడుదలకు ముందు అది నా జీవిత కథ ఆధారంగా తీసారని వాళ్లకు చెప్పాను. కానీ నేను తమాషాకు చెబుతున్నానని వాళ్లు అనుకున్నారు.

సినిమా విడుదల తర్వాత నేను వాళ్లకు న్యూడ్ మోడల్‌గా పని చేస్తున్నట్లు వెల్లడించాను. మొదట వాళ్లకు చాలా కోపం వచ్చింది కానీ తర్వాత అర్థం చేసుకున్నారు.

జేజే స్కూల్‌లో నాకు జరిగిన సన్మానం టీవీలో వచ్చినపుడు వాళ్లు దాన్ని చూసి చాలా ఆనందించారు. ఇప్పుడు వాళ్లు నన్ను చూసి గర్వపడుతున్నారు.

ఇన్నేళ్లుగా పని చేస్తున్నా, నేను పెద్దగా సంపాదించుకోలేదు. ఇప్పటికీ నేను కుర్లాలో బాడుగ ఇంట్లో నివసిన్తున్నాను. నా పిల్లలకు మంచి చదువు కూడా చదివించుకోలేకపోయాను. వాళ్లు ఏవేవో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆర్ట్ స్కూల్‌కు సెలవులు. అందువల్ల నేను ఒక లేడీస్ టాయిలెట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాను. నాకు రోజుకు రూ.200 ఇస్తారు.

నేను వితంతువును, అయినా నాకు పింఛన్ రాదు. మాలాంటి వారి కోసం ఎలాంటి ప్రభుత్వ పథకాలూ లేవు. నా శారీరక రూపు బాగున్నంత వరకు ఈ పనిలో ఉంటాను. కానీ తర్వాత? ఈ ప్రశ్న నన్ను నిరంతరం వెంటాడుతుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)