భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?

  • దలీప్ సింగ్
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

భగత్ సింగ్ ఉపయోగించిన పిస్టల్

ఆంగ్లేయుల పాలనపై పోరాటం చేసిన భగత్ సింగ్‌పై ఎన్నో పుస్తకాలు వచ్చాయి, సినిమాలు తీశారు. రకరకాల ఐడియాలజీ ఉన్న ఎంతోమంది ఆయన సాహసాన్ని తమదైన శైలిలో వర్ణించారు.

భగత్ సింగ్‌పై తీసిన సినిమాల్లో మీరు తరచూ ఒక సీన్ చూసే ఉంటారు. అందులో ఆయన పాత్ర పోషించిన నటుడు.. ఆంగ్లేయ అధికారి జాన్ సాండర్స్‌ను తుపాకీతో కాల్చి చంపుతారు.

భగత్ సింగ్ ఆయన సహచరులకు సంబంధించిన వస్తువుల ప్రదర్శన కూడా చాలామంది చూసే ఉంటారు.

కానీ భగత్ సింగ్‌కు సంబంధించిన ప్రత్యేక వస్తువు ఒకటుంది. అది తెరమీద, కార్లు, గోడలపై ఉన్న ఆయన చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది.

అదే ఆయన ఉపయోగించిన పిస్టల్.

భగత్ సింగ్ పిస్టల్

భగత్ సింగ్‌కు ఉరిశిక్ష వేశాక ఆయన ఉపయోగించిన పిస్టల్ ఏమయ్యింది? 20వ శతాబ్దంలో ఉపయోగించిన పిస్టల్, ఇన్నేళ్లూ ఎక్కడ ఉండిపోయింది? అది 21వ శతాబ్దంలో ప్రజల ముందుకు ఎలా వచ్చింది?

అప్పుడు జరిగిన మొత్తం ఘటనపై ఒక పుస్తకం రాస్తున్న జర్నలిస్ట్ జుపిందర్ సింగ్, భగత్ సింగ్ పిస్టల్‌ను ఇప్పుడు ప్రపంచం ముందుకు తెచ్చారు. పిస్టల్ అన్వేషణ గురించి ఆయన బీబీసీకి వివరంగా చెప్పారు.

అమెరికాలో తయారైన పాయింట్ 32 బోర్ కోల్ట్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌తో ఆంగ్లేయ అధికారి సాండర్స్ ను హత్య చేశాడని భగత్ సింగ్‌పై ఆరోపణ ఉంది.

ఫొటో క్యాప్షన్,

'డిస్కవరీ ఆఫ్ భగత్ సింగ్ పిస్టల్’ పుస్తక రచయిత, పాత్రికేయుడు జుపిందర్జీత్ సింగ్

పిస్టల్ అన్వేషణ

చంద్రశేఖర్ ఆజాద్ ఉపయోగించిన ఆయుధం గురించి అందరూ మాట్లాడుకోవడం, దానితో సెల్ఫీ తీసుకోవడం గురించి కూడా జుపిందర్ సింగ్ విన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచింది.

చాలా ఏళ్ల క్రితం "భగత్ సింగ్ ఉపయోగించిన పిస్టల్ ఏమయ్యుంటుంది అనే ఆలోచన తన మనసులో వచ్చిందని, అది ఎక్కడికెళ్లింది, ఎవరి దగ్గర ఉంది" అనుకున్నానని జుపిందర్ చెప్పారు.

"2016లో పిస్టల్ కోసం వెతకడం ప్రారంభించా" అని ఆయన చెప్పారు.

అన్వేషణలో భగత్ సింగ్‌ను ఉరితీసిన తర్వాత పిస్టల్‌ను ఎక్కడికి పంపించారో ఆయన చాలా కష్టపడి తెలుసుకోగలిగారు.

ఫొటో క్యాప్షన్,

1944లో పంజాబ్‌లోని ఫిలౌర్ ట్రెయినింగ్ అకాడమీ నుంచి లాహోర్‌కు తరలించిన ఆయుధాలకు సంబంధించిన పత్రాలు

ఫిల్లోర్ పోలీస్ అకాడమీకి పిస్టల్

2016లో పిస్టల్ నంబర్ దొరకడంతో ఆయనకు మొదటి విజయం లభించింది.

భగత్ సింగ్ ఉపయోగించిన ఆ పాయింట్ 32 బోర్ కోల్ట్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్ నంబర్-168896

పిస్టల్ పత్రాలు, తన అన్వేషణ ఆధారంగా "1931లో లాహోర్ హైకోర్టు ఆ పిస్టల్‌ను పంజాబ్‌లో ఉన్న ఫిల్లోర్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి పంపించాలని ఆదేశించిందని ఆయన చెప్పారు. ఆ పిస్టల్ ఇక్కడికి చేరుకోడానికి 13 ఏళ్లు పట్టిందనేది తర్వాత విషయం, 1944లో భగత్ సింగ్ పిస్టల్‌ను ఫిల్లోర్ తీసుకొచ్చారు" అన్నారు.

పిస్టల్ నంబర్ తెలుసు, తర్వాత పోలీసులు దాన్ని ఎక్కడ పెట్టారో కూడా తెలిసింది.

"కొందరు సీనియర్ అధికారుల సాయంతో పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో పిస్టల్ వెతకడం ప్రారంభించాను" అని జుపిందర్ సింగ్ తెలిపారు.

1968లో పిస్టల్ మధ్యప్రదేశ్ చేరింది

"ఫిల్లోర్‌లో అది అంత సులభంగా దొరకలేదు. రికార్డుల్లో వెతికిన తర్వాత లాహోర్ నుంచి వచ్చిన వాటిలో 8 ఆయుధాలను 1968లో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్‌కు పంపించారనే విషయం తెలిసింది" అని ఆయన చెప్పారు.

ఇది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పడిన సమయంలో జరిగింది. ఇండోర్‌లో బీఎస్ఎఫ్ ట్రైనింగ్ అకాడమీ పెట్టారు.

ఆ సమయంలో ఆయుధాల కోసం రాష్ట్రపతి అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాశారు. అకాడమీలో ట్రైనింగ్ కోసం ఆయా రాష్ట్రాలు తమ దగ్గరున్న ఆయుధాలను ఇండోర్ పంపించాలని కోరారు.

పంజాబ్ నుంచి అకాడమీకి వచ్చిన 8 ఆయుధాల్లో భగత్ సింగ్ ఉపయోగించిన పిస్టల్ కూడా ఉంది.

పిస్టల్ పెయింట్ తీసి నంబర్ వెతికారు

"ఇండోర్‌లో కూడా పిస్టల్ వివరాలు తెలుసుకోవడం చాలా కష్టమైంది" అని జుపిందర్ జిత్ చెప్పారు.

"నేను చాలా కష్టపడి బీఎస్ఎఫ్ ఐజీ పంకజ్‌ను కలవగలిగాను. ఆయన ఆ ఆయుధాల గురించి వివరాలు ఇవ్వవచ్చు" అన్నారు.

ఆయుధాలకు తుప్పు పట్టకుండా ఉంచేందుకు వాటికి పెయింట్ వేసి ఉంచేవారు

"ఐజీ పంకజ్, పంజాబ్ నుంచి వచ్చిన ఆయుధాల లిస్ట్ తీసుకున్నారు. ఆ లిస్టులో ఉన్న ఆయుధాలపై పెయింట్ గీకడం మొదలు పెట్టారు. మూడో పిస్టల్‌కు ఉన్న పెయింట్ తీయగానే మేం వెతుకుతున్న పిస్టల్ అదే అని తెలిసింది. భగత్ సింగ్ పిస్టల్ నంబర్ ఆ పిస్టల్ నంబర్‌తో మ్యాచ్ అయ్యింది" అని జుపిందర్ చెప్పారు.

"తర్వాత ఆ పిస్టల్‌ను పంజాబ్ ఎలా తీసుకెళ్లాలా అనే సమస్య ఎదురైంది"

"పిస్టల్ పత్రాల ఆధారంగా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. అందులో పిస్టల్‌పై అసలు హక్కు పంజాబ్‌కే దక్కుతుందని చెప్పాం. అందుకే దీన్ని పంజాబ్‌ స్వాధీనం చేయాలని కోరాం"

ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి, కోర్టులో పిటిషన్ వేయడంతో పిస్టల్‌ను పంజాబ్ పంపించడానికి అడ్డంకులు తొలగిపోయాయి.

పంజాబ్ హుస్సేనీవాలాలో పిస్టల్

భగత్ సింగ్ ఉపయోగించిన ఈ పిస్టల్‌ను ఇప్పుడు పంజాబ్‌లోని హుస్సేనీవాలా మ్యూజియంలో భద్రపరిచారు.

హుస్సేనీవాలా సరిహద్దు దగ్గరకు ప్రతి రోజూ జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. వారందరూ దాన్ని చూడాలనే భగత్ సింగ్ స్వగ్రామం ఖట్‌కర్ కలాన్‌ మ్యూజియంలో ఈ పిస్టల్‌ను పెట్టలేదు.

అమెరికాలో తయారైన ఈ పిస్టల్ భగత్ సింగ్‌కు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారనే ఆధారాలు లభించలేదు. జుపిందర్ ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

భగత్ సింగ్ జైలు డైరీని వెలుగులోకి తెచ్చిన ప్రొఫెసర్ మాలవిందర్‌జిత్ సింగ్ వడాచ్ కూడా జుపిందర్ జిత్ అన్వేషణకు పుస్తక రూపం ఇచ్చేందుకు సాయం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)