కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు కొనసాగేది ఎన్నాళ్లు?

  • ఇమ్రాన్ ఖురేషీ
  • కర్ణాటక నుంచి, బీబీసీ కోసం
సిద్ధ రామయ్య, కుమార స్వామి

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీనే అని పందాలు కట్టిన పందెంరాయుళ్లకు నష్టం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఎన్నాళ్లు కొనసాగుతుందో! అని వాళ్లు పందాలు కడుతున్నారు.

పందెంరాయుళ్లే కాదు, సాధారణ జనం కూడా కర్ణాటక రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలూ గత 33 ఏళ్ల రాజకీయాల్లో అత్యంత కఠినంగా నిలిచిన ఎన్నికల్లో పోటీచేయడమే కాదు, ఎన్నికల పోరాటంలో ఎన్నో చేదు అనుభవాలనూ రుచిచూశాయి.

అయితే, ఈ రెండు పార్టీలూ పొత్తుకు సిద్ధమవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఇందులో మొదటి విషయం. జేడీఎస్ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఆ పార్టీకి తమ ఉనికి కాపాడుకోవడం ప్రశ్నార్థకం అయ్యింది. రెండు పార్టీలకూ బీజేపీని అడ్డుకోవడం తప్పనిసరి అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images

రెండు పార్టీల పొత్తు ఎన్నాళ్లు?

రాజకీయ విశ్లేషకులు ఎంకే భాస్కర్ రావు మాట్లాడుతూ.. "ఈ ఏడాది 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ ఇవి ఒకటిగా కలిసి ఉంటాయి. అయితే, ఇప్పుడు కూడా వారి మధ్య మంత్రి పదవుల పంపకం, పరిపాలనకు సంబంధించిన విషయాలు, ప్రజాస్వామ్య సంబంధిత మిగతా విషయాలు ఉన్నాయి" అని చెప్పారు.

"మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవగౌడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలతో అలాంటి అంశాలపై మాట్లాడరు. ఇలాంటి విషయాల గురించి ఆయన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాత్రమే మాట్లాడుతారు. ఆయన రాహుల్ గాంధీతో కూడా మాట్లాడరు" అని రావు చెప్పారు.

ఇక ప్రొఫెసర్ ముజఫర్ అసాదీ బీబీసీతో మాట్లాడుతూ "ఇది ఒక అసహజ కూటమి. అయితే, దీన్ని అపవిత్ర కూటమి అనలేం. ఇది దేశ రాజకీయాల్లో విజయవంతమైన మిగతా కూటమిల్లాగే నడుస్తుంది. ఇది ఒక ప్రయోగం లాంటిది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలా ఇది కూడా కొనసాగవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, EPA

సీట్ల పంపకంలో తేడాలొచ్చే అవకాశం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కటైన ఈ రెండు పార్టీలను వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో దగ్గరగా చూడవలసి ఉంటుంది. ఎందుకంటే రెండు పార్టీలూ ఆ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే కోరుకుంటాయి.

అయితే, 1996 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం కావడం మాత్రం జరగదు. అప్పుడు జేడీఎస్ 28 స్థానాల్లో 16 గెలుచుకుని కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది.

ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. జేడీఎస్‌కు మద్దతు ఇచ్చారని భావిస్తున్న వొక్కళిగ కులం వారందరూ ఒక్కటై చాముండేశ్వరి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యను ఓడించడంతో వారం క్రితం వరకూ కాంగ్రెస్, జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని ఎవరూ ఊహించలేదు.

మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ చొరవ చూపగానే దేవగౌడ, కుమార స్వామి వైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది.

రాజకీయాల్లో ఎంతో సీనియర్ నేత అయిన దేవగౌడ, 1991లో కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్‌కు ఎదురైన పరిస్థితి మళ్లీ రాకూడదని భావిస్తున్నారు.

ఆ సమయంలో ఒక రోజు మఫ్టీలో ఉన్న పోలీసులు కొందరు రాజీవ్ గాంధీ ఇంటి పరిసరాల్లోకి వెళ్లి నిఘా పెట్టడంతో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది.

ఫొటో సోర్స్, AFP

ఎక్కువ సీట్లు ఉన్నా జూనియర్ పార్ట్‌నర్‌గా కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ దేవగౌడ ప్రతిపాదనకు సిద్ధమైంది. 78 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ, 37 స్థానాలు మాత్రమే ఉన్న జేడీఎస్‌తో కలిసిపోయి ఒక జూనియర్ పార్ట్‌నర్‌లా ఉండేందుకు కూడా సిద్ధమైంది.

వచ్చే వారం కుమారస్వామి విశ్వాస పరీక్షలో గెలవగలిగితే ఒక విధంగా వారికి ఊరట లభిస్తుందనేది సుస్పష్టం.

కానీ "ఈ రెండు పార్టీలూ తమ మధ్య అభిప్రాయ బేధాలను దూరం చేసుకోడానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాయా? కనీస భాగస్వామ్య కార్యక్రమంపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? అనే అంశాలను ప్రొఫెసర్ అసాదీ గమనిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ఈ కూటమి ఒక ఉదాహరణ’

ఇలాంటి కమిటీ వ్యక్తిగత స్థాయిలో అసౌకర్యాలను దూరం చేస్తుందని ప్రొఫెసర్ అసాదీ భావిస్తున్నారు.

సమన్వయ కమిటీ ఏర్పాటు ఈ కూటమి ఎప్పటికీ చురుకుగా ఉండేందుకు సాయం చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ 104 మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు బలమైన స్థితిలో ఉంది.

బహుశా ఈ కూటమిని కలిపి ఉంచగలిగేది ఇదే. ఎందుకంటే వారికి "ఈ కూటమి ముక్కలైతే భవిష్యత్తులో ఎప్పటికీ అధికారంలోకి రాలేం" అని లోలోపల ఒక భయం ఉంటుంది.

ఇది చాలా కీలకం. ఎందుకంటే ఈ కూటమి దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ఒక ఉదాహరణ అవుతుంది. దీని ఆధారంగా వచ్చే ఏడాది మోదీ-అమిత్ షా జంటను ఎదుర్కునేందుకు సన్నాహాలు కూడా మొదలవుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)