ఈ దీవిలో 12 ఏళ్ల తర్వాత పాప పుట్టింది

ఫెర్నాండో ద్వీపం

ఫొటో సోర్స్, AFP

బ్రెజిల్ ప్రధాన భూభాగానికి సుదూరంగా ఉన్న ద్వీపం అది. అక్కడ ప్రజలంతా సంబరాలు జరుపుకొంటున్నారు. ఎందుకో తెలుసా?

పన్నెండేళ్ల తరువాత తొలిసారిగా ఆ ద్వీపంలో ఒక పాపాయి పుట్టింది.

అవును.. బ్రెజిల్‌లోని నాటల్‌ నగరానికి సుమారు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'ఫెర్నాండో డి నోరాన్యాలో సుమారు 3 వేల మంది జనాభా ఉన్నారు.

అక్కడ పిల్లలకు జన్మనివ్వడంపై నిషేధం ఉంది. దాంతో గర్భవతులంతా ప్రసవ సమయానికి ఆ ద్వీపాన్ని వీడి బ్రెజిల్ ప్రధాన ప్రాంతాలకు వెళ్లిపోతారు.

అయితే.. ఇటీవల 22ఏళ్ల ఓ మహిళ మాత్రం అక్కడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

నిషేధం ఎందుకు?

ఫెర్నాండో డి నోరాన్యా సుందరమైన సముద్ర తీరాలకు ప్రసిద్ధి.

సముద్రపు తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగలాలు అక్కడి సముద్రంలో కనిపిస్తాయి. అంతేకాదు.. ఆ ద్వీపంలో ఎన్నో అరుదైన పక్షిజాతులున్నాయి.

దీంతో.. సముద్ర, వన్య ప్రాణి సంరక్షణార్థం అక్కడ జనాభా నియంత్రణ విషయంలో కఠిన ఆదేశాలున్నాయి.

ఆ ద్వీపంలో ఎవరూ పిల్లలు కనరాదన్నది కూడా ఒక నియమం. దీంతో ద్వీపవాసులెవరైనా గర్భవతులైతే ప్రసవ సమయానికి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

కానీ, ఈ 22 ఏళ్ల మహిళ మాత్రం బిడ్డ పుట్టేవరకు తాను గర్భవతిననే తెలియదని, అందుకే ద్వీపంలోనే ఉండిపోయానని అమాయకంగా చెప్తోంది.

బిడ్డ పుట్టగానే పాప తండ్రి వచ్చి ఎత్తుకుని చూపించారని.. దాంతో తనకు నోట మాట రాలేదని చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)