కేరళను వణికిస్తున్న నిపా వైరస్

గబ్బిలం

ఫొటో సోర్స్, AFP/gettyimages

ఫొటో క్యాప్షన్,

గబ్బిలాల ద్వారా నిపా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

నిపా వైరస్ కేరళలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు అక్కడ తొమ్మిది మంది మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

ఇటీవల మరణించిన ముగ్గురికి నిపా వైరస్ సోకినట్టు పరీక్షల్లో బయటపడింది.

మిగతా ఆరుగురికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కోజికోడ్‌లో మరో 25 మంది ఈ వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ వైరస్ బాధితులకు వైద్యం చేసిన ఓ నర్సు కూడా మరణించారని కేరళ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్ సదానందన్ బీబీసీకి చెప్పారు.

"నిపా వైరస్ సోకినట్టు లక్షణాలు ఉన్నవారి రక్తం, శరీర ద్రవాల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాం. మృతుల్లో ముగ్గురు ఈ వైరస్ కారణంగానే చనిపోయినట్టు నిర్ధరణ అయ్యింది" అని ఆయన తెలిపారు.

దీనికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేనందున, ఈ వైరస్ వ్యాప్తిని నివారించే చర్యలపై దృష్టిపెట్టామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నిపా వైరస్‌ నివారణకు టీకా లేదు

టీకాలేని మొండి వైరస్

నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. దీని నివారణకు ఎలాంటి టీకా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ఈ వైరస్ బారిన పడిన వారిలో 70 శాతం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాప్ 10 వ్యాధుల జాబితాలో నిపా వైరస్ ఒకటి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

భవిష్యత్తు ప్రపంచాన్ని కలవరపెట్టబోయే రుగ్మతుల్లో ఇదొకటని పేర్కొంది.

గబ్బిలాలలో ఈ వైరస్ పెరుగుతుంది.

తాజాగా మృతి చెందిన వారి ఇంటి ఆవరణలో గబ్బిలాలు కొరికిన మామిడి పండ్లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. నిపా వైరస్ లక్షణాలతో చనిపోయిన వారిలో ఆ ఇంటి వారే ముగ్గురు ఉన్నారు.

పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను కేరళకు పంపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

ఫొటో సోర్స్, AMI IMAGES/SCIENCE PHOTO LIBRARY

ఫొటో క్యాప్షన్,

నిపా వైరస్

ఏమిటీ నిపా వైరస్?

తొలిసారిగా 1999లో నిపా వైరస్‌ను వైద్య నిపుణులు గుర్తించారు.

అప్పట్లో సింగపూర్, మలేసియాలో చాలా మంది రైతులు మెదడువాపు వ్యాధి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. వారికి నిపా వైరస్‌ సోకినట్టు వెల్లడైంది.

పందులను పెంచే రైతులు, పందులకు దగ్గరగా ఉండే ప్రజల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు.

అప్పుడు దాదాపు 300 మందిలో ఆ లక్షణాలు కనిపించగా, 100 మందికి పైగా మరణించారు.

దాంతో వైరస్ వ్యాప్తి చెందకుందడా నివారించేందుకు దాదాపు మలేసియాలో 10 లక్షలకు పైగా పందులను చంపేశారు. అది ఆ దేశానికి ఆర్థికంగా భారీ నష్టాన్ని మిగిల్చింది.

అనారోగ్యంతో ఉన్న పందులకు, గబ్బిలాలకు దూరంగా ఉండటం, పక్వానికి రాని ఖర్జూరం రసాన్ని తాగకుండా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు.

ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మత్తుగా కనిపించడం, శ్వాస ఆడకపోవడం, కంగారుపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 నుంచి 28 గంటల్లోనే బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

(ఆధారం: ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)