యద్దనపూడి సులోచనా రాణి: ‘హీరో’ల సృష్టికర్త

  • మృణాళిని
  • బీబీసీ కోసం
సులోచనారాణి

ఫొటో సోర్స్, facebook/YaddanapudiSulochanaRani

(ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో కన్నుమూశారు. ఆమె రచనలు, జీవన యానం గురించి తెలుగు యూనివర్శిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ మృణాళిని బీబీసీ కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం)

యద్దనపూడి సులోచనారాణి అంటే అందరికీ రెక్కలు చాచుకున్న కార్లు, ఆరడుగుల 'రాజశేఖర్' లూ, ముక్కుమీద కోపం ఉన్న 'రోజా'లు గుర్తుకొస్తారేమో... కానీ నాకు మాత్రం మెత్తని మాట, మందస్మితం, హుందాతనం, నిరాడంబరత్వం మూర్తీభవించిన ఆమె మూర్తిమత్వమే గుర్తుకొస్తుంది.

ఆమె పరిచయం కాకముందు, నా 12 ఏళ్ల వయస్సునుంచీ నన్ను ముంచెత్తినవి కూడా ఆ అద్భుతమైన ప్రేమ కథలే. ఆమె రచనలు వట్టి ప్రేమ కథలు కావు. ఆడపిల్లని కొత్తరకంగా, మనం కూడ అలా ఉండగలిగితే బాగుండు అనే రకంగా చూపించినవి. ఆమె మీద ఆరోపణ కూడ అదే. ఒక్కోసారి అనిపిస్తుంది. ఆమె ఆడపిల్లల్ని, అప్పటి తక్కిన రచయిత్రుల్లా 'బాధితులు' గా (విక్టిమ్స్) చూపించివుంటే ఆమెకు విమర్శకుల మన్ననలు కూడ లభించేవేమో? కానీ ఆమె ఏరోజూ ఆడపిల్లల్ని బాధితులుగా చూడలేదు. చూపలేదు.

చీమూ, నెత్తురూ ఉండి, సమస్యలను ఎదురెళ్లి మరీ ఢీకొన్న మొండిఘటాలుగానే చూపించింది. ఒకవేళ తమకు సమస్యలు లేకపోతే కొని తెచ్చుకునే పెంకితనం ఉన్న ఆడపిల్లలు వాళ్లు. ఆమె ఎవరికీ అనుభవంలోకి రాని, రాలేని 'కలల పురుషుడిని, స్వప్నలోకాన్ని' చూపించిందన్న ఆరోపణ మహామహుల నుంచి కూడ వస్తూంటుంది. నిజమే.. కానీ ఆడపిల్లలకు కలలు కనే హక్కును కూడ నిరాకరించే సమాజంలో కనీసం కథల్లోనైనా కలలు కనడం ఆనందం కాదూ?

సులోచనారాణి 1964లో సెక్రటరీతో మొదలుపెట్టి డెబ్బైకి పైగా నవలలు రాసారు. కానీ ఎక్కువ పేరు తెచ్చిపెట్టినవి, ఆమె పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి, సీరియల్స్ గా వచ్చినపుడు పాఠకులను మంత్రముగ్ధులను చేసినవి కొన్నే. సెక్రటరీ, జీవనతరంగాలు, మీనా. ఇంకా చెప్పుకోదగ్గవి విజేత, ఆరాధన, కీర్తి కిరీటాలు, ప్రేమలేఖలు, గిరిజాకల్యాణం, పార్థు, ఈ తరం కథ, ఆత్మీయులు, బంగారు కలలు, కథల్లో బహుమతి, ఐలవ్ యూ... ఇంకా ఎన్నో ఆమె అభిమానులు మెచ్చినవి. ఎన్ని సార్లు ప్రచురించినా, అన్ని ప్రతులూ అతి వేగంగా అమ్ముడుపోయే ఏకైక రచయిత్రి ఆమె (రచయితలు కొందరున్నారు).

ఫొటో సోర్స్, facebook/facebook/YaddanapudiSulochanaRani

సులోచనారాణి మీద వచ్చిన విమర్శలు అన్నీ, ఇన్నీ కావు

ప్రచురణకర్తల కొంగును బంగారంతో నింపిన పారిజాతవృక్షం ఆమె. తన రచనలకోసం అనునిత్యం ఎదురుచూసే పాఠకులను ఎప్పుడూ నిరాశపరచని అక్షయపాత్ర ఆమె. రాయడమే తప్ప, వాటిని ఎవరు ఎంత మెచ్చుకుంటున్నారో, ఎవరు ఎంత విమర్శిస్తున్నారో పెద్దగా పట్టించుకోలేదు ఆమె ఎప్పుడూ. నవలారచనకు గ్లామర్ తీసుకురావడం ఒక ఘనత అయితే, ఎంతో మంది మహిళాపాఠకులను రచయిత్రులుగా మార్చిన ప్రభావం కూడ ఆమెదే.

మహిళా పాఠకుల సంఖ్యను పెంచిన రచయిత్రిగా ఆమెను అందరూ అంగీకరిస్తారుగానీ, వారిని రచనలకు ప్రేరేపించిన శక్తిగా కూడ గుర్తించాల్సిందే. ఆమెకు ఆడపిల్లలు స్వతంత్రంగా ఆలోచించాలనీ, వారికి ఆర్థిక స్వేచ్ఛతో పాటు, మానసిక స్వేచ్ఛ కూడ ఉండాలనీ కోరిక. తన నవలల ద్వారా అవన్నీ చెప్పగలిగిందా లేదా అంటే కనీసం డెబ్భై అయిదు శాతం అందులో సఫలమైందనే చెప్పాలి.

సులోచనారాణి మీద వచ్చిన విమర్శలు అన్నీ, ఇన్నీ కావు. ఆమె చేసిందల్లా మిల్స్ అండ్ బూన్స్ ని తెలుగులోకి తర్జుమా చేయడమేననీ, వాటిలో మళ్లీ డెన్నిస్ రాబిన్స్ నవలల్ని కాపీ కొట్టడమేననీ చాలామంది అంటూంటారు. నిజంగా మిల్స్ అండ్ బూన్స్ నవలల్ని చదివితే, వాటిలోని నాయికా నాయకులకూ, సులోచనారాణి నాయికానాయకులకూ హస్తిమశకాంతరం ఉందని ఏ కాస్త విషయపరిజ్ఞానం ఉన్న పాఠకుడైనా గుర్తిస్తాడు. సులోచనారాణి నాయికల్లో రోషం, తెలివి, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పుష్కలంగా ఉన్నట్టే, ఆమె నాయకుల్లోనూ హుందాతనం, దయ, స్త్రీల పట్ల గౌరవం కనిపిస్తాయి (మిల్స్ అండ్ బూన్ నవలా పాత్రల్లో ఇవేవీ ఉండవు -ఫక్తు మోహం, శృంగారం తప్ప).

'సెక్రటరీ'లో తన అనాలోచితమైన వ్యాఖ్యతో నలుగురి ఎదటా జయంతి మనసును బాధపెట్టానని గ్రహించినపుడు రాజశేఖర్ ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకునే సన్నివేశం జయంతికే కాదు. మనకుకూడ అతనిపై గౌరవం కలిగేలా చేస్తుంది. ఇటువంటి సన్నివేశాలు మిల్స్ అండ్ బూన్‌లలో కాగడా పెట్టి వెతికినా కనిపించవు. ఇంకా ఆవిడ నాయికల్లో జేన్ ఆస్టిన్, మార్గరెట్ మిచెల్ ఛాయలు కనిపిస్తాయంటే ఒప్పుకోవచ్చు.

ఫొటో సోర్స్, facebook/YaddanapudiSulochana

చలం, సులోచనారాణి రచనలకు ఏమీ పోలిక లేకపోయినా - వీరిద్దరి గురించి వాళ్ల వ్యతిరేకులు కూడ ఒప్పుకునే మాట ఒక్కటే - చక్కని శైలి, కథాకథనం వాళ్ల రచనల్ని చదివింపజేస్తాయని. చలం దీని మీద విసుక్కుంటే, సులోచనారాణి విసుక్కోలేదు గానీ, అదో పెద్ద విషయంగా పరిగణించలేదు.

తను శైలి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే అలవాటు ఆమెకు లేదు. సహజంగానే ఆమె కలానికి ఆ 'చదివించే గుణం' ఒంటబట్టిందని, ఆమె సహజ కథకురాలనీ అనిపిస్తుంది. ఆమె తను గొప్ప ఉదాత్తమైన రచనలు చేస్తున్నాననీ, సమాజాన్ని మార్చడం రచయితగా తన విద్యక్తధర్మమనీ, పాఠకులకు సందేశం ఇవ్వాలనీ భావించిన రచయిత్రి కాదు. తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీలను, వారి జీవితాలను పరిశీలిస్తూ, తన అవగాహన మేరకు వారి జీవితాలను చిత్రించడం, అవి అలా ఎందుకున్నాయో ప్రశ్నించుకుంటూ, స్త్రీపురుషుల అనుబంధం ఎలా ఉంటే కుటుంబం, సమాజం ఇంకా శాంతిగా, సంతోషంగా ఉండగలవో ఆలోచిస్తూ, వాటికి సమాధానాలు అన్వేషించడం తన రచనాధర్మంగా భావించారు. ఆ క్రమంలో కొన్ని పాత్రలు వాస్తవికంగానూ, మరికొన్ని ఆదర్శవంతంగానూ రూపుదిద్దుకునివుండవచ్చు. ఏదైనా, జేన్ ఆస్టిన్ లా ఆమె తనకు తెలిసిన జీవితాన్నే వర్ణించారు. దాన్ని మరింత సుందరంగా ఎలా చేసుకోవచ్చో తన కథలు, కథనం, పాత్రల ద్వారా చెప్పారు.

ఆ నవలలు చదివినప్పుడు కలిగిన హాయి, ఆ సినిమాలు చూసినప్పుడు కలగదు

ఆమె నవలలు సినిమాలుగా వచ్చినపుడు, ఒక్క 'మీనా' తప్ప మరేవీ నవలలకు న్యాయం చెయ్యలేదని నాకనిపించింది. ఆమెతో ఆ మాట అంటే 'ఎవరి దృష్టికోణం నుంచి వాళ్లు చూస్తారు. నాకేం అభ్యంతరం అనిపించలేదు' అని చెప్పారు. అంతే తప్ప, ఏ దర్శకుడి గురించి ఒక్క పొల్లుమాట కూడ అనలేదు. నిజానికి ఆమెలా సంభాషణలు రాయగలవాళ్లు ఎక్కువ మంది సాహిత్యంలో లేరు. వర్ణనల్లో మేటి రచయితలున్నారు గానీ, సంభాషణా రచనలో ఆమె అసమానురాలు. ఆ సంభాషణలతో పాటు కథలో నాటకీయత కూడ పుష్కలంగా ఉంటుంది కనక ఆమె నవలలు సినిమాలకు బాగా పనికి వస్తాయి (అందుకే చాలా సినిమాలుగానూ, టీవీ సీరియల్స్ గానూ వచ్చాయి). కానీ ఆ నవలలు చదివినప్పుడు కలిగిన హాయి, ఆ సినిమాలు చూసినప్పుడు కలగదు. బహుశా ఒక్కొక్క పాఠకుడు ఆ నాయికా నాయకులను ఒక్కోలా ఊహించుకుని, ఈ భూమ్మీద ఉన్న నటీనటులలో వాళ్లను ఊహించుకోకపోవడం వల్లనేమో.

ఫొటో సోర్స్, యద్దనపూడి సులోచనారాణి

సులోచనారాణి 'జీవనతరంగాలు' సీరియల్ గా వస్తున్నప్పుడు కావలి పట్టణంలో విశ్వోదయా బాలికల పాఠశాలలో చదువుతున్నాను. నేనూ, నా స్నేహితులూ, బుధవారం మార్కెట్ లోకి 'ఆంధ్రజ్యోతి' రాగానే తెచ్చుకుని, ఆ మూడు పేజీల సీరియల్ ని చింపేసుకుని, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు చదువుతూ నానా గోలా చేసేవాళ్లం. అలాగే 'యువ' లో మీనా చదువుతున్నప్పుడూ అంతే. సీరియల్స్ అయిపోయాక నిట్టూర్చుకుని, ఎప్పటికైనా హైదరాబాద్ వెళ్లి ఈమెను ఒకసారి చూడాలి అనుకునేవాళ్లం. అలాంటిది ఒకనాడు ఆ సులోచనారాణిగారు తనతల్లి పేరిట స్థాపించిన అవార్డును తొలిసారి నాకే ఇచ్చే రోజు వస్తుందనీ, నేను రాసిన 'తాంబూలం' ఆమె ఆవిష్కరించే రోజు వస్తుందనీ, ఆమె నాకు ఫోన్ చేసి ముచ్చట్లు చెప్పే రోజు వస్తుందనీ......ఏనాడూ అనుకోలేదు. వ్యక్తిగా పరిచయమయ్యాక ఆమె రచనల కంటే ఆమె ఎంత గొప్పవారో అర్థమైంది. తన అభిమానులతో ఆమె మాట్లాడే తీరు, ఎంత కొత్తవాళ్లనైనా, క్షణంలో ఆత్మీయులుగా తోచేలా చేసే సౌజన్యం, తన నవలల గురించి ఏనాడూ తను మాట్లాడకపోవడం .. నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి.

మనం పనిగట్టుకుని ఆమె నవలల ప్రస్తావన తెస్తే తప్ప, తన గురించి తాను అస్సలు మాట్లాడుకోని రచయితను ఆమెనే చూసాను. తన గురించి చెప్పాల్సి వచ్చినపుడు కూడా అతిశయం, ఆత్మస్తుతి, అహంకారం, ఇతరులతో పోల్చుకుని తన గురించి గర్వంగా ఫీలవడం - ఇవి మచ్చుకైనా కనిపించవు. అసలు ఆమె మరో రచయిత గురించి మంచి మాటలే తప్ప, చెడుగానీ, విమర్శ గానీ చేయడం ఒక్క సారి కూడ నేను నా పదిహేనేళ్ల పరిచయంలో చూడలేదు. మరో విషయం. ఆమె భర్త మరణించాక, తోడుకోసం ఆవిడ ఇంట్లో ముగ్గురు వ్యక్తులను పెట్టుకున్నారు. నాబోటి స్నేహితులు ఎవరైన ఇంటికి వస్తే, ఆ ముగ్గురినీ పిలిచి, నన్ను వాళ్లకు, వాళ్లను నాకు పరిచయం చేసేవారు. డబ్బులిచ్చి పెట్టుకున్న వారిని పని మనుషులుగా కాక, కుటుంబ సభ్యులుగా చూడడమంటే ఇది కాక మరేమిటని అనిపించింది. ఆమెలా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, సంయమనంతో ఉన్న రచయితలను, ఆ మాటకొస్తే వ్యక్తులను నేను చాలా తక్కువమందిని చూసాను. (చప్పున గుర్తుకు వచ్చేది ఒక్క అబ్బూరి ఛాయాదేవిగారే)

ఫొటో సోర్స్, FACEBOOK/TRIVIKRAM

ఫొటో క్యాప్షన్,

యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ను మూలకథగా తీసుకుని తెరకెక్కించానని త్రివిక్రమ్ చెబుతున్న సినిమా ‘అఆ’ పోస్టర్.

సులోచనారాణి గారి అభిమానులకు ఆమె మీద ఫిర్యాదు ఒకటుంది. ఆమె ప్రజాజీవితంలోకి రారనీ, ప్రసంగాలు చెయ్యరనీ. ఆ రంగంలోకి ఆమెను దింపిన ఘనత వాసా ప్రభావతిగారిది. 'లేఖిని' సంస్థ గౌరవాధ్యకురాలిగా సులోచనారాణిని ప్రజల్లోకి ఆమె తీసుకువచ్చారు. ఆ సభల్లో అధ్యక్షత వహించడం మొదలుపెట్టాక, సులోచనగారు మరింత మందికి చేరువయ్యారు. ఈ క్రమంలో ఒక చిన్న సంఘటన చెప్పాలి. సులోచనారాణిగారికి 'మాలతీ చందూర్' అవార్డు ఇచ్చిన సందర్భంలో వాళ్లిద్దరి గురించి మాట్లాడ్డానికి నన్ను వక్తగా రమ్మన్నారు. సులోచనారాణిగారు కూడ ఆ సందర్భంలో ప్రసంగించాలి. ఆ సమయంలో నేను వాళ్లింటికి వెళ్లినపుడు, తనకు ప్రసంగాలు అస్సలు అలవాటు లేదు కనక, బెరుగ్గా ఉందన్నారు ఆవిడ. నేను కూడ మాట్లాడుతున్నాననేసరికి' ' అమ్మో. నీకేమో ప్రసంగాలు కొట్టిన పిండి. పైగా బాగా చదువుకున్నావు కనక చాలా చెప్పగలవు. నీతో పోల్చుకుంటే నేనేం మాట్లాడగలను?' అన్నారు.

నాతో ఎందుకు పోల్చుకోవాలని అడిగాను. ఎన్ని ప్రసంగాలు చేసినా నేను సులోచనారాణిని అవుతానా అన్నాను. 'మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి ఈ అవార్డు సందర్భంగా' అంటే ఏడెనిమిది వాక్యాల్లో చెప్పారు. 'సరిగ్గా ఇప్పుడు నాకు చెప్పిందే రేపటి వేదిక నుంచి చెప్పండి. అక్కడ జనం సులోచనారాణి, సులోచనారాణిలా మాట్లాడితే వినాలని వస్తారుగానీ, మరెవరిలానో మాట్లాడితే వినడానికి రారు' అన్నాను. ఆ రోజున రవీంద్రభారతి వేదికమీద ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారో శ్రోతలకు తెలుసు. 'సులోచనారాణి ఇంత మంచి వక్త అని మేమనుకోలేదు' అన్నవాళ్లు కూడ ఉన్నారు. నేనూహించని విషయం ఏమిటంటే ఆ రోజున నేనే తనను తనలా మాట్లాడమని చెప్పానని కూడ ఆవిడ సభకు చెప్పడం. అందుకే అనడం - చాలా అరుదైన వ్యక్తి అని.

ఆమెకు రాముడి గురించి రాయాలని ఉండేది

మరో విచిత్ర సంఘటన - సులోచనారాణిగారు కొన్ని నెలల క్రితం నాతో పాటు మరో స్నేహితురాలిని పిలిచి, మనం రామాయణం మోనోలాగ్‌లా రాద్దామని ప్రతిపాదించారు. నేను సీత మొనోలాగ్, ఆమె స్నేహితురాలు రావణుడి మోనోలాగ్, తను రాముడి మోనోలాగ్ రాయాలని ఆవిడ ప్రతిపాదన. మేం కూడ ఉత్సాహంగానే ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఇది తలుచుకుని నవ్వుకున్నాం కానీ ఆమెకు మాత్రం నిజంగానే రాముడి గురించి రాయాలని ఉందని అన్నారు.

యద్దనపూడి సులోచనారాణి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంగ్లీషు పదాన్ని ఆశ్రయించక తప్పడం లేదు. ఆమె చాలా genuine మనిషి. ఎక్కడా కపటం, అతిశయం, నటన, హిపోక్రసీ, ఏ విషయంలోనూ 'అతి' లేని వ్యక్తి. అతి హుందాగా, సంయమనంతో, తన జీవితాన్ని తన నవలల్లాగే సంతోషంగా, అందంగా తీర్చిదిద్దుకున్న వ్యక్తి. మనిషి ఆనందం, అతను సాధించిన వాటిలో, సంపదలో, కీర్తిలో, ఇతరులతో సంబంధాల్లో కంటే తన మనస్సులోనే ఉంటుందన్న సత్యాన్ని ఆచరించి చూపిన అరుదైన వ్యక్తి సులోచనారాణి.

(రచయిత తెలుగు విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్)

ఇవి కూడా చదవండి