కర్ణాటక ఎన్నికలు రాహుల్‌ గాంధీకి ఏం నేర్పాయి? 2019లో బీజేపీని ఎలా ఎదుర్కొంటారు?

  • స్వాతి చతుర్వేది
  • బీబీసీ కోసం
రాహుల్, సోనియా

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య వాతావరణం ప్రస్తుతం చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమారస్వామికి చెందిన జేడీఎస్‌ను ‘బీ టీం ఆఫ్ బీజేపీ’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.

ఎన్నికల తరవాత బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. ఇందులో భాగంగా 37మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రి కానున్నారు. 78మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్, కూటమిలో జూనియర్ భాగస్వామిగా మిగలాల్సి వచ్చింది.

క్లుప్తంగా చెప్పాలంటే రాహుల్ గాంధీకి అసలు సమస్య ఇప్పుడు ఈ కూటములను నెలకొల్పడమే. భాజపాను ఎదుర్కోవడానికి విపక్షాలన్నింటినీ ఏకం చేసి ఒకతాటిపై నడిపించాల్సిన బరువైన బాధ్యత ఆయనపై పడింది.

గుజరాత్ ఎన్నికల సమయంలో పాటీదార్ల నేత హార్దిక్ పటేల్‌ను, దళిత నేత జిగ్నేష్ మేవానీని ఒక వేదికపైకి తెచ్చినట్లే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల మధ్య వారధిగా ఆయన మారాలి.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ పరిణామాలను గమనిస్తే, ఎన్నికల ముందే జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవనే విషయం కూడా కాంగ్రెస్‌కు బోధపడింది.

ఫొటో సోర్స్, JAGADEESH NV/EPA

మరోపక్క జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ‘పీపీ పార్టీ’(పంజాబ్, పుదుచ్చేరి) మాత్రమే అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న అమిత్‌ షా బలం కూడా బీజేపీకి ఉంది. ఈ విమర్శలకూ, వ్యక్తులకూ సమాధానం ఇవ్వాలంటే రాహుల్ చాలా కష్టపడాలి.

ఈ నేపథ్యంలో ఓ బలమైన కూటమి అవసరం ఎంతుందో రాహుల్‌కు బాగా తెలుసు. అందుకే తమతో కలిసిన నేతలందర్నీ కర్ణాటకలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించి తమ బలాన్ని ప్రదర్శించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

దానికి తగ్గట్లే రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, తేజస్వీ యాదవ్ లాంటి వాళ్లంతా ఆ సభకు హాజరుకానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ సభకు హాజరై అమిత్‌షాకు తన దృక్పథంపై స్పష్టమైన సంకేతాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయాల నుంచి తన నిష్క్రమణను బాహటంగానే ప్రకటించిన సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ సంకట స్థితిని దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీతో స్వయంగా చర్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, @INCINDIA/TWITTER

కర్ణాటకలో బీజేపీని పడగొట్టడానికి రాహుల్ గాంధీ సరైన సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడి తన కొడుకు కుమారస్వామి బీజేపీతో పొత్తుపెట్టుకోకుండా ఉండేలా చూడాలని కోరారు. రాహుల్ కర్ణాటక రాజకీయంలో తన ఎత్తుగడలు ఫలించేందుకు యువ నేతలతో పాటు సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకున్నారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ బృందానికి సరైన రాజకీయ నెట్‌వర్క్‌తో పాటు ఇతర పార్టీల నేతలతో వ్యక్తిగత సంబంధాలు కూడా లేకపోవడం ప్రధాన లోటు. గతంలో సోనియా గాంధీకి ఉన్న రాజకీయ సంబంధాలే ఆమెకు ప్రధాన బలంగా ఉండేవి. ఈ విషయాన్ని గ్రహించిన రాహుల్ తన పంథాని చాలా వరకూ మార్చుకొని ఇతర పార్టీల నేతలతో సామరస్యంగా మెలుగుతూ ఏ ఒక్కరూ చేజారిపోకుండా చూసుకుంటున్నారు.

బిహార్, గుజరాత్‌లలో ఇతర పార్టీలతో పొత్తులు ఎంత కీలకమో రాహుల్ ముందే గ్రహించి నిర్ణయం తీసుకున్నారు. కానీ కర్ణాటకలో ఒంటరిగానే బీజేపీని ఓడిస్తామన్న సిద్ధ రామయ్య మాటలపై విశ్వాసం ఉంచి ఆయన ముందుగానే జేడీఎస్‌తో పొత్తుపెట్టుకోలేదు.

కానీ కర్ణాటక ఫలితం రాహుల్‌కు కనువిప్పు కలిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు తమ పార్టీకి ఎంత ముఖ్యమో తెలిసేలా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

త్వరలో ఉత్తర్ ప్రదేశ్‌లో జరగనున్న కైరానా ఉప ఎన్నికలకు కూడా విపక్షాలతో కలిసే కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. 2019 ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక ఫలితాలు సంకేతంగా నిలుస్తాయని భావిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఇటీవల మాయావతి, అఖిలేష్‌ల కూటమి కలిసి గోరఖ్‌పుర్, ఫుల్‌పుర్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించినట్లే, కైరానాలో కూడా జరిగితే, ఆపైన పొత్తుల భవిష్యత్తు సజావుగా ఉండే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం విపక్షాలకు కనిపిస్తున్న మార్గం ఒక్కటే.. కలిసి పోరాడాలి లేదా తుడిచిపెట్టుకుపోవాలి. మోదీ, అమిత్ షా లాంటి ఉద్దండులను ఎదుర్కోవాలంటే కలిసి అడుగేయడమే మేలని వారు భావిస్తున్నారు.

శివసేన, తెలుగు దేశం పార్టీ లాంటివి భాజపాకు దూరమవుతున్న క్రమంలో 2019 ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాహుల్‌ వీటిని ఆసరాగా చేసుకొని కొత్త సూత్రాలు రచించాలి.

చివరిగా ‘విపక్ష ముక్త్ భారత్’ అనే అమిత్ షా నినాదాన్ని గమనిస్తే.. భారత్‌లో విపక్షమంటూ ఉందనే విషయమైతే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)