అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!

  • ఆమిర్ పీర్జాదా
  • బీబీసీ ప్రతినిధి

''అది అత్యంత బాధాకరమైన అనుభవం. నేను దాదాపు రెండు వారాల పాటు సరిగా నడవలేకపోయాను. దురదృష్టం ఏమిటంటే మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవరూ కూడా ఈ పిల్లాడికి ఏమైందా అని ఆలోచించలేకపోయారు.''

ఇది కశ్మీర్‌లో, బాల్యంలో అత్యాచారానికి గురైన 31 ఏళ్ల వ్యక్తి అంతరంగం.

అత్యాచారానికి గురైన ఆయన తనపై చెడుముద్ర పడుతుందనే భయంతో ఇన్నాళ్లూ దానిని లోకానికి వెల్లడించలేదు.

14 ఏళ్ల వయసు ఉన్నపుడు ఒక మతబోధకుడు ఆయనపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అతీంద్రియ శక్తులు రాత్రే పని చేస్తాయన్నాడు..

''మా మామయ్యకు వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. దాంతో ఆ మతబోధకుడికి చాలా శక్తి ఉందని, అతను తన కష్టాలన్నీ దూరం చేస్తాడని మా మామయ్య తనతో పాటు నన్ను కూడా అతని వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆ మతబోధకుడు తాను కేవలం 10-14 ఏళ్ల వయసున్న పిల్లలతోనే మాట్లాడతాడని తెలిపారు. మేమిద్దరం ఆ మతబోధకుడి వద్దకు వెళ్లినపుడు అతీంద్రియ శక్తులు రాత్రే పని చేస్తాయని, అందువల్ల నన్ను ఆ రాత్రికి అక్కడే వదిలి వెళ్లమని మా మామయ్యకు చెప్పాడు.'' ఆ రాత్రి తనకు జరిగిన బాధాకరమైన అనుభవాన్ని ఆయన ఇలా పంచుకున్నారు.

''అది ఎంత బాధాకరంగా ఉందంటే నా ప్రాణం పోతున్నట్లు అనిపించింది. నేను గట్టిగా అరవాలనుకున్నా. కానీ అతను నా నోరును అదిమిపెట్టాడు. అంతా అయిపోయాక, నేను ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే, అతీంద్రియ శక్తులు నా ప్రాణాలు తీస్తాయని బెదిరించాడు.''

''ఒక ఏడాది కాలంలో అతను నాపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మా మామయ్యకు ఈ విషయం తెలీదు. నేను ఈ విషయాన్ని చెప్పాలంటే భయపడ్డాను'' అని ఆయన తెలిపారు.

14 ఏళ్లు గుండెలోనే దాచుకున్నారు..

బాలురపై అత్యాచారం జరిగితే దానిని మచ్చగా భావించి, చాలా మంది దానిని బయటకు వెల్లడించరు.

''మహిళలకు సమాజం అనేక రకమైన కట్టుబాట్లు విధించినట్లే, పురుషులకూ కొన్ని కట్టుబాట్లు విధించింది. పురుషులపై లైంగిక అత్యాచారం కూడా అలాంటిదే. పురుషులు దృఢంగా, స్వతంత్రంగా ఉండాలని సమాజం నిర్దేశిస్తుంది. అలా కాకుండా చిన్న వయసులో అత్యాచారానికి గురయ్యారని తెలిస్తే దానిని పురుషత్వానికి మచ్చగా పరిగణిస్తారు'' అని ఉఫ్రా మీర్ అనే సైకాలజిస్ట్ తెలిపారు.

కశ్మీర్‌కు చెందిన ఈ బాధితుడు కూడా 14 ఏళ్ల పాటు ఆ బాధను తన గుండెల్లోనే దాచుకున్నారు.

''అది నా తప్పు కాదని తెలుసుకోవడానికి నాకు 14 ఏళ్లు పట్టింది. మన విద్యావ్యవస్థలో పిల్లలు ఇలాంటి లైంగిక అత్యాచారాల గురించి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియజెప్పాలి'' అన్నారు ఆయన.

ప్రస్తుతం ఆయన ఇతర బాధితులతో కలిసి ఆ మతబోధకుడిపై న్యాయపోరాటం చేస్తున్నారు.

''నాపై అత్యాచారం జరిగిన 14 ఏళ్ల తర్వాత ఒక రోజు టీవీలో ఓ పోలీసు అధికారి ఆ మతబోధకుడి బాధితులు ఇంకెవరైనా ఉంటే ముందుకు రావాలని చెబుతుంటే విన్నాను. అప్పుడే నాకు అతను ఇతరులపై కూడా అలాంటి అత్యాచారాలకు పాల్పడినట్లు తెలిసింది'' అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆయన బాలల హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు.

పిల్లలపై ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం

2002లో ప్రపంచ ఆరోగ్యసంస్థ - బాలురు, పురుషులపై జరుగుతున్న అత్యాచారాలను చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తించింది.

భారతదేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలికపై అత్యాచారం జరుగుతోంది. 2016లో పిల్లలపై అత్యాచారం కేసులు 36,022 నమోదయ్యాయి.

''సాధారణంగా పిల్లలపై అత్యాచారం కేసుల గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. మగపిల్లలైతే అది ఇంకా ఎక్కువ. అందువల్ల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి రావు'' అని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ ప్రొఫెసర్ హకీమ్ యాసిర్ అబ్బాస్ అన్నారు.

భారత ప్రభుత్వం గత నెల 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్షను విధిస్తూ ఆర్డినెన్స్ ఆమోదించింది. అంతే కాకుండా బాధితులు 16 ఏళ్లకన్నా తక్కువ ఉంటే వారికి విధించే శిక్షను కూడా పెంచింది. కఠువా, ఉన్నావ్‌లలో జరిగిన అత్యాచార సంఘటనల అనంతరం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు బాలురపై అత్యాచారానికి పదేళ్ల జైలు శిక్ష, బాలికలపై అత్యాచారానికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు.

అయితే - ఈ ఆర్డినెన్స్‌లో బాధిత బాలుర గురించి ఎలాంటి ప్రస్తావన లేదని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.

''ఈ ఆర్డినెన్స్ బాలురు, బాలికలపై జరిగిన అత్యాచారాలను వేర్వేరుగా చూస్తుంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం, బాలురపై లైంగిక దాడిని అత్యాచారంగా పరిగణించరు. అందువల్ల బాలురపై అత్యాచారం జరిగితే దోషులకు కఠినమైన శిక్షలు ఉండవు'' అన్నారు ప్రొఫెసర్ హకీం యాసిర్ అబ్బాస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)