ప్రెస్‌రివ్యూ: వాట్సాప్‌లో వదంతులు.. తెలుగు రాష్ట్రాల్లో కంటి మీద కునుకులేని గ్రామాలు

వాంపైర్

ఫొటో సోర్స్, iStock

బిహార్‌ గ్యాంగులు ప్రవేశించాయనే, మనుషులను చంపి మెదడు తినే నరహంతకులు వచ్చారనే వదంతులు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయని.. దీంతో తెలుగు రాష్ర్టాల్లో భయమేర్పడిందని, ఆ భయంతో అపరిచితులపై దాడులు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

'బిహార్‌ గ్యాంగులు వచ్చాయి. చిన్న పిల్లలతోపాటు దొరికినవారిని దొరికినట్లు చంపేస్తున్నారు. బంగారం, నగల కోసం మహిళల పీకలు కోసేస్తున్నారు' అంటూ కొన్ని రోజులుగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల్లో ఫొటోలు, వీడియోలతో ప్రచారం జరుగుతోంది.

దీంతో హిందీ, ఇతర భాషల్లో మాట్లాడుతున్న అపరిచితులను చూసి భయపడుతున్నారు. వారిపై దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లలను ఇల్లు దాటకుండా కట్టడి చేస్తున్నారు. యువకులు రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌‌లో, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లిలో గ్రామస్థులు కొందరు అనుమానితులను తీవ్రంగా కొట్టారు.

అయితే, సోషల్‌ మీడియాలో వస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిద్ధపడుతున్నారు. ప్రజల్లో భయాందోళనలను తొలగించేందుకు పోలీస్‌ అధికారులు రంగంలోకి దిగారు.

ఫొటో సోర్స్, Getty Images

‘రమణ దీక్షితులు తొలగింపుపై సుప్రీంకు వెళ్తా’

మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తొలగింపులో టీటీడీ అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి వెల్లడించినట్లుగా సాక్షి కథనం పేర్కొంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు సుబ్రమణియన్ స్వామి డిమాండ్‌ చేస్తూ ఆయన ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు.

కాగా తితిదే వివాదం ముదురుతోందంటూ ప్రజాశక్తి కథనం ప్రచురించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఈ వివాదంపై సోమవారం స్పందించారని.. టీటీడీకి చెందిన పలువురు మాజీ అధికారులు, ఆర్కియాలజీ అధికారులు కూడా ఈ వివాదంపై పెదవి విప్పారని అందులో పేర్కొంది. మరోవైపు టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బిజెపి అధినేత అమిత్‌షాను కలిసినట్లు సోషల్‌మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన తొలి అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేపట్టిన తొలి అతిపెద్ద విద్యుత్తు ప్రాజెక్టు, అందులోనూ సూపర్‌క్రిటికల్‌ టెక్నాలజీతో చేపట్టిన కొత్తగూడెం థర్మల్‌పవర్‌ స్టేషన్‌(కేటీపీఎస్‌)స్టేజ్‌-7 వెలుగు అందించడానికి సిద్ధమవుతోందని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్-7ను 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్రాజెక్టు 2012లోనే రూ.5548 కోట్ల వ్యయంతో ప్రతిపాదించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 28వ తేదీకల్లా పనుల న్నీ పూర్తి చేసి, జూన్‌లో ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలున్నాయని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/telanganaCMO

ఆప్మెల్ తెలంగాణదే: కేసీఆర్

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీ హెవీ మిషనరీ, ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ (ఆప్మెల్‌)ను స్వాధీనం చేసుకోవాలనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎత్తుగడను గట్టిగా తిప్పికొట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారని ఈనాడు కథనం పేర్కొంది.

విభజన చట్టాన్ని తప్పుగా అన్వయించి అత్యంత విలువైన ఆస్తులున్న ఆప్మెల్‌ను తమ వశం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి సింగరేణిలో ప్రధాన వాటా ఉన్నందున ఆప్మెల్‌పై ఈ రెండింటికే పూర్తిగా హక్కు ఉంటుందని చెప్పారు. తెలంగాణకు, కేంద్రానికి నష్టం కలిగిస్తూ, ఏపీ ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా షీలాభిడే కమిటీ నివేదిక ఇవ్వడాన్ని సీఎం ఖండించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు.

ఏపీ ప్రభుత్వం సైతం విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఆయన తప్పుబట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)