అగ్రిగోల్డ్ కేసులో మరో అరెస్ట్ - ఇంతకూ ఏంటీ అగ్రిగోల్డ్ కేసు?

అగ్రిగోల్డ్ లోగో

ఫొటో సోర్స్, Agrigold

అధిక వడ్డీలిస్తామని చెప్పి లక్షలాది మంది నుంచి పెట్టుబడులు స్వీకరించిన తరువాత బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ కేసులో ఆ సంస్థకు చెందిన మరో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ మోసం బయటపడినప్పటి నుంచి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సంస్థ వైస్ ఛైర్మన్ అవ్వా సీతారామారావు దిల్లీలో మంగళవారం అరెస్టయ్యారు.

ఈయన అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావుకు స్వయానా సోదరుడు. వెంకటరామారావును గతంలోనే అరెస్టు చేశారు.

సీతారామారావు దిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్న సీఐడీ అధికారులు ఏపీ నుంచి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.

ఫొటో సోర్స్, YouTube grab

అసలేంటీ కేసు..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు స్వీకరించిన అగ్రిగోల్డ్ సంస్థ.. మదుపరులకు వడ్డీలు, కాలపరిమితి తీరాక తిరిగి చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయింది.

దీంతో మదుపరుల ఫిర్యాదులతో తొలుత పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేసు సీఐడీకి బదిలీ చేశారు.

సంపాదించిన డబ్బంతా ఇందులో మదుపు చేసి పోగొట్టుకోవడంతో కొందరు బాధితులు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు.

పాలక, విపక్షాల మధ్య ఈ కేసు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకూ కారణమైంది. దీంతో పలుమార్లు అసెంబ్లీ కార్యకలాపాలు స్తంభించిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

అగ్రిగోల్డ్ కథ ఇదీ..

1) 1995లో అవ్వా వెంకట రామారావు ఛైర్మన్‌గా అగ్రిగోల్డ్ సంస్థ ఏర్పాటైంది. కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరుతో విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది. అక్కడి నుంచి క్రమంగా పొరుగు రాష్ట్రాలకూ విస్తరించి ప్రజల నుంచి పెట్టుబడులు సమీకరించింది. అధిక వడ్డీలు ఇస్తామని చెప్పడంతో లక్షలాది మంది ఇందులో మదుపు చేశారు. చిన్నచిన్న మొత్తాల నుంచి కోట్లలో మదుపు చేసినవారూ ఉన్నారు.

2) గడువు పూర్తయినా డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడం, వడ్డీలు చెల్లించకపోవడం, ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం వంటివి బయటపడడంతో 2014 నుంచి పరిస్థితి మారిపోయింది. దీంతో ఆ ఏడాది నవంబరులో తొలిసారి వినియోగదారులు, ఏజెంట్లు సమావేశమయ్యారు. సంస్థ తమను మోసం చేసిందంటూ డిసెంబరులో కొందరు డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

3) 2015 జనవరిలో లక్షలాది మంది బాధితులు బయటకొచ్చి ఆందోళనలు చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుపై తొలిసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు చేయడంతో సెక్యూరిటీస్, ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ), రిజర్వ్ బ్యాంకుల అనుమతి లేకుండానే ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీకి బదలాయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2016 ఫిబ్రవరిలో సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణరావులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వారు షరతులతో కూడిన బెయిలుపై విడుదలయ్యారు.

4) ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ కేసుకు సంబంధించి ప్రకటించిన వివరాల ప్రకారం.. 30 లక్షల మంది నుంచి సేకరించిన డబ్బుతో అగ్రిగోల్డ్ ఏడు రాష్ట్రాల్లో 16 వేల ఎకరాలను కొనుగోలు చేసింది. వివిధ బ్యాంకుల్లోని ఆ సంస్థ ఖాతాల్లో రూ.500 కోట్ల డిపాజిట్లు చేసింది.

5) హైకోర్టు ఆదేశించడంతో.. అటాచ్ చేసిన ఆస్తులను 2016 డిసెంబరు 27న సీఐడీ అధికారులు వేలం వేశారు. కానీ, పెద్ద నోట్ల రద్దు ఇతర కారణాల వల్ల అనేక ఆస్తులను వేలం పాడేవారే కరవయ్యారు. మరోవైపు బాధితుల్లో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)