వేదాంత ఫ్యాక్టరీ: అసలేంటీ వివాదం? ఎందుకిన్ని ఆందోళనలు?

ఫొటో సోర్స్, BBC Sport
తమిళనాడులోని తూతుక్కుడి (Tuticorin) జిల్లాలో స్టెర్లైట్ రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 9మంది చనిపోయారు.
మరో 40మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు.
వేదాంత గ్రూప్‌కి చెందిన ఈ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఆందోళనలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారంనాడు నిరసనలు చేపట్టి 100 రోజులు కావడంతో ఫ్యాక్టరీతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వైపుగా ఆందోళనకారులు ర్యాలీగా బయలుదేరారు.
ఆ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ఫ్యాక్టరీతో పాటు, కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
ఆ ఆంక్షల్ని లెక్క చేయని ఆందోళనకారులు ఫ్యాక్టరీ, కలెక్టర్ కార్యాలయం పరిసరాలకు చేరుకున్నారు.
పోలీసులు, ఫ్యాక్టరీ భద్రతా సిబ్బంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి.
దాంతో పోలీసులు తొలుత భాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. అనంతరం కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళతో సహా 9మంది చనిపోయారు. మరో 40మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
9 మంది చనిపోయిన మాట వాస్తవమేననీ, కానీ వారు పోలీసుల కాల్పుల్లో చనియపోయారో లేదోనన్నది స్పష్టం కాలేదనీ జిల్లా అధికారి ఒకరు బీబీసీ తమిళ ప్రతినిధి ప్రమీలా కృష్ణన్‌తో చెప్పారు.
ప్రస్తుతం తూతుక్కుడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఏమిటీ స్టెర్లైట్?
ప్రపంచంలోని అతిపెద్ద లోహ, మైనింగ్ సంస్థల్లో 'వేదాంత' ఒకటి.
దీని యజమాని అనిల్ అగర్వాల్. ఆయన స్వస్థలం బిహార్‌లోని పట్నా. వ్యాపారవేత్తగా ముంబయిలో స్థిరపడిన అనిల్ వేదాంత కంపెనీని స్థాపించారు.
లండన్ షేర్ మార్కెట్లో నమోదైన తొలి భారతీయ కంపెనీ ఇదే.
వేదాంత గ్రూపులోని ఓ సంస్థ స్టెర్లైట్. గుజరాత్ సమీపంలోని సిల్వస్సా, తమిళనాడులోని తూతుక్కుడిలో ఈ సంస్థ కార్యాకలాపాలు నిర్వహిస్తోంది.
తూతుక్కుడిలోని కర్మాగారంలో ఏటా 4 లక్షల మెట్రిక్ టన్నుల రాగిని ఉత్పత్తి చేస్తోంది.
ఎప్పటి నుంచి ఈ నిరసనలు?
స్టెర్లైట్‌కు మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1992లో 500 ఎకరాల భూమి కేటాయించింది.
అయితే, ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళనలు చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. పరిశ్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని 1993లో అక్కడి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఆ తర్వాత ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలిపోయింది.
"1994లో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఈ ఫ్యాక్టరీకి నిరభ్యంతర పత్రం ఇచ్చింది. అయితే పర్యావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షలు చేయాలని ఆ సంస్థను కోరింది. పరిశ్రమను గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, 14 కిలోమీటర్ల దూరంలోనే నెలకొల్పారు" అని పర్యావరణవేత్త నిత్యానంద్ జయరామన్ వివరించారు.
కేసులు:
నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎండీఎంకే నేత వైగో, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఈ కర్మాగారానికి వ్యతిరేకంగా కేసులు వేశారు. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని ఈ ఫ్యాక్టరీ తీవ్రంగా కలుషితం చేస్తోందని వారు ఆరోపించారు.
1997- 2012 మధ్య ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందాలను పునరుద్ధరించుకోలేదన్నది ప్రధాన ఆరోపణ.
ఈ కర్మాగారాన్ని మూసేయాలని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో సంస్థ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కంపెనీకి రూ.100 కోట్ల జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం, కార్యకలాపాలను కొనసాగించవచ్చని చెప్పింది.
ఎందుకీ ఆకస్మిక ఆందోళన?
స్టెర్లైట్ కర్మాగార విస్తరణను వ్యతిరేకిస్తూ తొలి రోజు నుంచీ తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నామని పర్యావరణవేత్త నిత్యానందన్ అన్నారు. ఈ పరిశ్రమను కట్టడి చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
ఇప్పుడు ఆ సంస్థ అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని, దానికి వ్యతిరేకంగానే తాము ఈ ఆందోళన చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
కంపెనీ ఏమంటోంది?
పరిశ్రమ విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ తీసుకున్నామని సంస్థ పీఆర్వో ఇసాకిముథు తెలిపారు.
కర్మాగారంలో వ్యర్థాల నిర్వహణ కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
శుద్ధి చేసిన సముద్రపు నీరు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే వృథా నీటిని మాత్రమే కొత్త యూనిట్లో వినియోగిస్తామని, ద్రవరూప వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని వెల్లడించారు.
తమ ఫ్యాక్టరీ వల్ల 2,000 మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పీఆర్వో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అగ్రిగోల్డ్ కేసులో మరో అరెస్ట్ - ఇంతకూ ఏంటీ అగ్రిగోల్డ్ కేసు?
- డేటింగ్ తర్వాత... మీరు ‘బ్రేకప్ ఫీజు’ చెల్లిస్తారా?
- కార్పొరేట్ స్కూల్స్‌లో చదవలేదు.. కానీ నాసా సదస్సుకు ఎంపికయ్యారు
- ఘనంగా జరిగిన బ్రిటన్ రాకుమారుడు హ్యారీ వివాహం
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- 'టీటీడీ ఆలయాల్లో దళితుల నియామకం లేదు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)