పెయిన్ కిల్లర్స్: నొప్పిని తగ్గించే మందు మీకు దొరకడం లేదా? ఎందుకు?

  • జస్టిన్ రౌలట్
  • బీబీసీ ప్రతినిధి

మన చుట్టూ ఉన్న ఎంతో మంది 'ఎవరికీ కనిపించని' వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి పేరు- నొప్పి!

దీనికి మందు లేదా? ఉంది. అయినా ఎందుకది చాలా మందికి దొరకడం లేదు?

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు కోట్ల మంది నివారించదగ్గ నొప్పితో బాధపడుతున్నారు. భారత్‌లో ఈ సమస్య నుంచి బాధితులకు ఊరట కలిగించేందుకు ఎంఆర్ రాజగోపాల్ అనే వైద్యుడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఆయన్ను 'ఇండియాస్ ఫాదర్ ఆఫ్ పాలియేటివ్ కేర్' అని పిలుస్తారు.

నాలుగు దశాబ్దాల క్రితం రాజగోపాల్ పొరుగింట్లో క్యాన్సర్ బారిన పడిన ఒక వ్యక్తి ఉండేవారు. ఆయనకు క్యాన్సర్ చివరి దశలో ఉండేది. ఆయన ఏడుపులు రాజగోపాల్‌ను పరిష్కారం దిశగా ఆలోచింపజేశాయి.

"క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు. ఆయనకు బాధ తగ్గించేందుకు నువ్వేమైనా చేయగలవా అని అడిగారు. నేనేమీ చేయలేకపోయాను. అప్పటికి నేను ఇంకా వైద్య విద్యార్థినే" అంటూ డాక్టర్ రాజగోపాల్ అప్పటి తన నిస్సహాయతను గుర్తుచేసుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఓపిఆయిడ్స్‌ నిబంధనల సరళీకరణ కోసం డాక్టర్ ఎమ్.ఆర్. రాజగోపాల్ కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

పాలియాటివ్ కేర్ అంటే?

ఇదే నిస్సహాయత రాజగోపాల్‌ను మొదట మత్తు వైద్యనిపుణుడు (అనస్తీషియన్)గా తర్వాత 'పాలియేటివ్ కేర్‌' నిపుణుడిగా తయారు చేసింది. ఆరోగ్య సంబంధ నొప్పి నివారణ-చికిత్స పాలియేటివ్ కేర్ (సాంత్వన చికిత్స) కిందకు వస్తుంది.

ఆయన మూడు దశాబ్దాలకు పైగా పాలియేటివ్ కేర్‌ సేవలు అందిస్తున్నారు. ఇన్నేళ్ల అనుభవంతో ఆయనో మాట చెబుతారు. "మన చుట్టూ చాలా మంది ఏదో నొప్పిని భరిస్తున్నారు. వీరిలో అత్యధికుల బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు. భారత్‌లోనే కాదు, ప్రపంచమంతా పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే నొప్పి అనేది 'ఎవరికీ కనిపించని' వ్యాధి" అని అంటారాయన.

"నొప్పితో బాధపడుతున్నవారు బాధ పడుతూనే ఉంటారు. వారి నొప్పిని ఎవరూ పట్టించుకోరు. దానిని వారి సమస్యగానే చూస్తారు, పట్టనట్టు ఉంటారు. ప్రతి ఒక్కరూ మిగతావాళ్ల నొప్పి పట్ల ఇలాగే వ్యవహరిస్తారు. నొప్పి కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో" అని రాజగోపాల్ వ్యాఖ్యానించారు.

నొప్పి ఎంత తీవ్రంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో అవతలివాళ్లకు అర్థమయ్యేలా చెప్పడమన్నది సవాలుతో కూడుకున్నదని ఆయన తెలిపారు.

కేరళలోని పాలియంలో రాజగోపాల్ పాలియేటివ్ కేర్ ఆస్పత్రిని నడుపుతున్నారు.

"మనలో చాలా మంది అవతలివాళ్ల నొప్పి గురించి స్పందించేటప్పుడు మన కోణంలోనే స్పందిస్తుంటాం. ఫలానా నొప్పి మనకు కలిగినప్పుడు మనకు ఎలా అనిపించిందనే దాని ఆధారంగా మాట్లాడుతుంటాం. చాలా సందర్భాల్లో అవతలి మనిషి బాధ మన ఊహకు కూడా అందదనే నిజాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. ఈ బాధ నమ్మశక్యం కానంతగా ఉంటుంది. మనం దీనిని పట్టించుకోం, ఆస్పత్రులు పట్టించుకోవు, ఎందుకంటే డాక్టర్లు తాము చేయగలిగిందేమీ లేదని, ఇంటికి వెళ్లాలని చెబుతారు" అని రాజగోపాల్ వివరించారు.

భారత్‌లో రెండు శాతం మందికే ఉపశమనం

నొప్పిని ఎదుర్కొనే భారతీయుల్లో కేవలం రెండు శాతం మందే తగిన ఉపశమనాన్ని పొందగలుగుతున్నారని ఆయన చెప్పారు. ఉపశమనం పొందుతున్నవారిలో ఎక్కువ మంది కేరళ వారే. నొప్పి నుంచి ఉపశమనం కలిగించే అధునాతన వైద్యసేవలు కేరళలో ఎక్కువగా అందుబాటులో ఉండటమే దీనికి కారణం. కేరళలో ఈ సేవలు అంతగా అందుబాటులోకి రావడం వెనక రాజగోపాల్ కృషి ఎంతో ఉంది.

దేశంలో అత్యధికులకు బాధ నుంచి ఉపశమనం కలిగించలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? 'ఓపిఆయిడ్స్' అనే ఔషధాలు చౌకయిన, ప్రభావవంతమైన నొప్పి నివారిణులని, కానీ చాలా దేశాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటిని పొందడం చాలా కష్టమని రాజగోపాల్ వెల్లడించారు.

ఈ ఔషధాలు మెదడును ప్రభావితం చేసి, నొప్పి తెలియకుండా చేస్తాయి. తీవ్రమైన బాధ ఉన్నప్పుడు కుంగుబాటు, ఆందోళన కూడా ఉంటాయి. ఓపిఆయిడ్స్ వీటిని కూడా తగ్గిస్తాయి. అయితే ఈ నొప్పి మందులు ఉల్లాసకరమైన అనుభూతినీ కలిగిస్తాయి. అందువల్ల ఇవి తరచూ దుర్వినియోగానికి గురవుతుంటాయి. ఓపిఆయిడ్స్‌కు అలవాటు పడితే అది వ్యసనంగా మారే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

డ్రగ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో ఇలాంటి ఔషధాల దుర్వినియోగాన్ని నియంత్రించడం కూడా ఉంది. ఇందులో భాగంగా ఓపిఆయిడ్స్‌ సరఫరాను ఎక్కువగా నియంత్రిస్తున్నారు.

చాలా దేశాల్లో ముఖ్యంగా భారత్, తక్కువ ఆదాయమున్న ఇతర దేశాల్లో ఇలాంటి డ్రగ్స్‌పై ఆంక్షలు మరీ తీవ్రంగా ఉన్నాయని రాజగోపాల్, ఇతర వైద్యనిపుణులు చెబుతున్నారు.

నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందుల లభ్యత విషయంలో పేద, ధనిక దేశాల మధ్య చాలా అసమానత ఉందని వైద్య పత్రిక 'లాన్సెట్'లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది.

మార్ఫీన్‌కు సమానమైన ఓపిఆయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల టన్నులు ఏటా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో కేవలం 0.1 శాతం మాత్రమే అల్పాదాయ దేశాలకు చేరుతున్నాయని అధ్యయనం తెలిపింది.

అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని కోట్ల మంది ప్రజలకు ప్రభావవంతమైన, చౌకయిన ఇలాంటి మందులను నిరాకరించడం ప్రజారోగ్యం, నైతికత పరంగా పెద్ద తప్పిదమని, ఇది అన్యాయమని అధ్యయనం వ్యాఖ్యానించింది.

ఫొటో క్యాప్షన్,

భారతదేశంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రోగులకు కూడా ఓపిఆయిడ్స్ ఇవ్వడం చాలా అరుదు

భారత్‌లో నిబంధనలు ఎలా ఉన్నాయి?

గతంలో భారత్‌లో ప్రాథమిక స్థాయి ఓపిఆయిడ్స్ నిల్వ చేయాలన్నా ఆస్పత్రులకు కనీసం ఐదు లైసెన్సులు తప్పనిసరి. ప్రిస్కిప్షన్ రాసేటప్పడు వైద్యులు ఏ చిన్న పొరపాటు చేసినా వారు ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి. నొప్పి మందుల దుర్వినియోగం జరగకపోయినా వారు దీనిని తప్పించుకోలేని విధంగా నిబంధనలు ఉండేవి. ఇంత కఠినమైన నిబంధనలు, ఆంక్షల మూలంగా రోగులకు అత్యవసరమైనప్పుడు ఇవ్వాలన్నా ఈ మందులు సరిగా దొరికేవి కాదు. అయితే గతంతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగుపడింది.

2014లో రాజగోపాల్, మరికొందరు నొప్పి మందులపై నిబంధనలు సరళతరం చేస్తూ చట్టంలో మార్పులు తెచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు.

వీటి నిల్వ, ప్రిస్కిప్షన్ విషయంలో 2015లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ నొప్పి మందుల వినియోగంలో చాలా కొద్ది పెరుగుదలే ఉందని రాజగోపాల్ తెలిపారు. అమెరికాలో ఓపిఆయిడ్స్‌ సంక్షోభం నేపథ్యంలో నొప్పి మందుల విషయంలో సంస్కరణలు నిలిచిపోయాయని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

అమెరికాలో ఓపిఆయిడ్ పెయిన్ కిల్లర్స్‌ను ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అది దుర్వినియోగం అవుతోంది.

అమెరికా అనుభవం ఏమిటి?

అమెరికాలో ఓపిఆయిడ్ నొప్పి మందులను వైద్యులు ఎక్కువగా రాయడంవల్ల ఇవి పెద్దయెత్తున దుర్వినియోగమవుతున్నాయి. కారు ప్రమాదాల్లో చనిపోతున్నవారి సంఖ్య కంటే ఓపిఆయిడ్స్‌ను మోతాదుకు మించి తీసుకోవడంవల్ల చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికాలో వైద్యులు రోగులకు నొప్పికి తగిన స్థాయిలో చికిత్స అందించడం లేదని 1990ల్లో అక్కడ పాలియేటివ్ కేర్ మద్దతుదారులు విమర్శించేవారు.

నొప్పిని ఎలా నియంత్రించాలనే అంశంపై అంతర్జాతీయ చర్చ అమెరికాలో ఎదురైన అనుభవాల ప్రాతిపదికగా సాగుతోందని, ఇది సబబు కాదని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. నొప్పి మందుల వినియోగంలో అమెరికాలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, అయినప్పటికీ ప్రపంచం అమెరికా వైపు చూస్తోందని ఆక్షేపించారు.

ఓపిఆయిడ్స్‌ నియంత్రణలో విజయవంతమైన దేశాలు చాలానే ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చని రాజగోపాల్ తెలిపారు. ఈ మందుల నియంత్రణలో ఔచిత్యాన్ని, సమతౌల్యాన్ని పాటించడం ద్వారా ఆయా దేశాలు విజయం సాధించాయని చెప్పారు. చిన్న రాష్ట్రమైన కేరళలోనూ ఇది రుజువైందని చెప్పారు. వైద్య అవసరాలకు సముచిత రీతిలో వీటి వినియోగాన్ని అనుమతిస్తూనే, వైద్యేతర అవసరాలకు వీటిని వినియోగించడాన్ని కట్టడి చేయొచ్చని తెలిపారు.

మీ వరకు వచ్చే వరకు ఎదురుచూడకండి!

భారతదేశంతోపాటు చాలా దేశాల్లో వైద్య శిక్షణ సమయంలో నొప్పి నివారణ గురించి చాలా తక్కువ ప్రస్తావిస్తారు. దీని ఫలితంగా చాలా మంది వైద్యులు ఓపిఆయిడ్లను ప్రిస్క్రైబ్ చేయడానికి సంకోచిస్తారు. అందువల్ల పరిస్థితి మారడానికి కొంత సమయం పడుతుందని రాజగోపాల్ చెప్పారు.

ప్రస్తుతం ఆయన 70ల్లో ఉన్నారు. అయినా ఆయనకు తన పోరాటాన్ని ఆపే ఉద్దేశం లేదు.

"నొప్పికి ఎలాంటి వైద్యం చేయాలో మనకు తెలుసు. నొప్పిని అనుభవిస్తున్న వారు తమ గొంతును వినిపించలేరు. ఎందుకంటే వారు శారీరకంగా, మానసికంగా బలహీనమై పోయుంటారు. నొప్పిని అనుభవిస్తున్నవారి తరపున వాదించే వారు కావాలి" అని రాజగోపాల్ తెలిపారు.

'నొప్పి' మనకు కనిపించకపోయినా, దాని గురించి మనమంతా ఆలోచించాలని ఆయన చెప్పారు. "మౌనంగా భరిస్తే మన ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లవుతుంది. మీ వరకు వచ్చే వరకు ఆగకండి. మరీ ఆలస్యం కాక ముందే మేలుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)