‘నిపా’ వైరస్‌కు బలైన నర్స్ లిని తన భర్తకు రాసిన అంతిమ లేఖ

నిపా వైరస్ గబ్బిలం కేరళ

ఫొటో సోర్స్, FACEBOOK/lini.nanu

అంతిమ ఘడియల్లో ఎవరైనా తన ఆత్మీయులంతా తన పక్కనే ఉండాలనుకుంటారు. కానీ, కేరళకు చెందిన ఓ నర్స్ మాత్రం ఇందుకు భిన్నంగా, ఓ కఠిన నిర్ణయం తీసుకుంది.

కేరళలో ఇటీవల 'నిపా' అనే ఒక కొత్త వైరస్ జనాలను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు.

వారికి సపర్యలు చేసే క్రమంలో 31 ఏళ్ల లిని నాను అనే నర్స్ కూడా అదే వైరస్‌కు బలయ్యారు.

అయితే, అంతిమ ఘడియల్లో ఆమె ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు.

తన వారెవరినీ తన దగ్గరకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తన దహనసంస్కారాలు కూడా ఇంట్లో వాళ్లను చేయనీయలేదు.

తనకు సోకిన నిపా వైరస్ తన వాళ్లకు సోకగూడదనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు, బహ్రెయిన్‌లో ఉన్న భర్తకు ఆమె తన చివరి క్షణాల్లో ఎంతో భావోద్వేగంతో ఓ లేఖ రాశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/lini.nanu

ఫొటో క్యాప్షన్,

భర్త సజీశ్‌తో లిని

ఇంతకీ ఆ లేఖలో ఏముంది?

బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భర్త సజీశ్‌కు మరణశయ్యపై నుంచే లిని రాసిన లేఖ ఇది.

''ఇవే నాకు చివరి క్షణాలు. ఇక మిమ్మల్ని చూస్తాననే ఆశ నాకు లేదు. క్షమించండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పాపం కుంజూ, తనని మీతో గల్ఫ్‌కి తీసుకెళ్లండి. నాన్నలా అతడ్ని ఒంటరిగా వదిలేయకండి... గుండెల నిండా ప్రేమతో...''

ఈ లేఖను కేరళ పర్యావరణ మంత్రి తన ఫేస్‌బుక్‌లో మొదట షేర్ చేశారు. ఇప్పుడు ఆ లేఖ వైరల్‌గా మారింది.

నెటిజన్లు ఆమె సేవానిరతినీ, చివరి క్షణాల్లో సైతం ఆమె తన ఆత్మీయుల కోసం పడిన తపనను చూసి అభినందనలతో ముంచెత్తుతున్నారు.

కోజికోడ్‌లోని పెరంబ్రా ఆస్పత్రిలో నిపా వైరస్ బాధితులకు సపర్యలు చేసిన తొలి బృందంలో లిని ఒకరు.

బాధితులకు సేవ చేస్తున్న సమయంలోనే ఆమెకు కూడా నిపా వైరస్ సోకింది.

లిని భావోద్వేగ లేఖ బయటకు వచ్చాక దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు.

''లిని నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి'' అని ఆమెను ప్రశంసించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/kadakampally/

నిపా వైరస్ దాడి

నిపా వైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కేరళలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 12 మందికి ఈ వ్యాధి సోకగా అందులో 10 మంది చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/lini.nanu

ఫొటో క్యాప్షన్,

పిల్లలతో లిని భర్త

ఏమిటీ నిపా వైరస్?

నిపా వైరస్‌ను తొలిసారిగా 1999లో వైద్య నిపుణులు గుర్తించారు.

అప్పట్లో సింగపూర్, మలేసియాలో చాలా మంది రైతులు మెదడు వాపు వ్యాధి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. వారికి నిపా వైరస్‌ సోకినట్టు వెల్లడైంది.

పందులను పెంచే రైతులు, పందులకు దగ్గరగా ఉండే ప్రజల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు.

అప్పుడు దాదాపు 300 మందిలో ఆ లక్షణాలు కనిపించగా, 100 మందికి పైగా మరణించారు.

దాంతో వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు మలేసియాలో దాదాపు 10 లక్షలకు పైగా పందులను చంపేశారు. అది ఆ దేశానికి ఆర్థికంగా భారీ నష్టాన్ని మిగిల్చింది.

ఫొటో సోర్స్, AFP

అనారోగ్యంతో ఉన్న పందులకు, గబ్బిలాలకు దూరంగా ఉండటం, పక్వానికి రాని ఖర్జూరం రసాన్ని తాగకుండా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు.

ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మత్తుగా కనిపించడం, శ్వాస ఆడకపోవడం, కంగారుపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 నుంచి 28 గంటల్లోనే బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

(ఆధారం: ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)