#BBCSpecial : దేశంలో దళితులు, ముస్లింల సమస్యలు ఏంటి? చర్చిద్దాం రండి

  • రాజేశ్ ప్రియదర్శి
  • డిజిటల్ ఎడిటర్, బీబీసీ హిందీ
దళితులు

ఫొటో సోర్స్, Getty Images

పోర్చుగల్, హంగరీ, స్వీడన్, ఆస్ట్రియా - ఈ మొత్తం దేశాల జనాభా సుమారు 4 కోట్లు. భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కేవలం ముస్లింల జనాభా ఇంత ఉంది. కానీ ప్రస్తుత లోక్‌సభలో వారికి ఒక్క ప్రతినిధీ లేడు.

ఈ పరిస్థితిని ఖండించి, దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం ఎక్కడా లేదు. ఉదాహరణకు, గుజరాత్‌లో ముస్లింల జనాభా 9 శాతం ఉండగా, గత రెండున్నర దశాబ్దాల కాలంలో అధికారంలో ఉన్న బీజేపీ 2017 ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థినీ నిలబెట్టలేదు.

బీజేపీ హిందుత్వ రాజకీయాలు ముస్లింల ఓటుకు, వారి రాజకీయాలకు విలువ లేకుండా చేశాయి.

ప్రజాస్వామ్య ఎన్నికల్లో 80 శాతం మంది 14 శాతం మందితో పోటీ పడే కొత్త నియమం వచ్చింది. ఈ పరిస్థితుల్లో ముస్లింలు ప్రజాస్వామ్యాన్ని ఎలా చూస్తున్నారు అన్నదానిపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముంది.

కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు కాస్త మేలు జరిగినా, అది వాళ్లను మంచి చేసుకునేందుకే అని బీజేపీ అంటోంది. కానీ రాష్ట్రంలోని లక్షలాది మంది ముస్లింలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తి చెందారా? వారి ప్రస్తుత పరిస్థితి కేవలం నాలుగేళ్ల పాలన ఫలితం కాదు. దశాబ్దాలుగా వారిపట్ల చూపిన నిర్లక్ష్యం, రాజకీయ ఎత్తుగడలే దీనికి కారణం.

కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే - అక్కడ బీజేపీ ఎలాంటి పరిస్థితి సృష్టించిందంటే, ఇప్పుడు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ముస్లింల నుంచి అంతే దూరాన్ని, ఇంకా చెప్పాలంటే ఎక్కువే పాటిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ 'సబ్'లో ముస్లింలు ఉన్నారా?

ముస్లింలు అనేక సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం వారి దేశభక్తిని కొలవడం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 'సబ్'లో ముస్లింలు ఉన్నారా? ఏమో?

జనాభాకు తగినట్లుగా ముస్లిం ప్రాతినిధ్యం లేనిది కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదు - కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రొఫెషనల్ కెరీర్లలో కూడా ఇది నిజం. అనేక పరిశోధనలు, నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. వాటిలో జస్టిస్ సచార్ కమిటీ ముఖ్యమైనది.

కేవలం ముస్లింలు అయినందుకే అఖ్లాక్, జునైద్, పహ్లూ ఖాన్, అఫ్రాజుల్ లాంటి వారు హత్య చేయబడ్డారు. 'యూఎస్ కమిటీ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్' అన్న అమెరికా సంస్థ తన నివేదికలో ''నరేంద్ర మోదీ పాలనతో మైనారిటీల జీవితం ప్రమాదంలో పడింది'' అని పేర్కొంది. సహ్రాన్‌పూర్, ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులకు న్యాయం జరగలేదని పేర్కొంది.

''ప్రధాని ఈ మతపరమైన హింసను ఖండించారు కానీ ఈ అల్లర్లలో ఆయన పార్టీ వారి హస్తం ఉంది'' అని పేర్కొంది.

దేశంలో కాస్‌గంజ్, ఔరంగాబాద్, రోస్డా, భాగల్‌పుర్, అసన్‌సోల్‌లాంటి అనేక పట్టణాలలో మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటన్నిటిలో ఒక క్రమం కనిపిస్తుంది. వాటిలో కొంతమంది బీజేపీ నేతలే అల్లరిమూకలకు నేతృత్వం వహించారు. ఒక పద్ధతి ప్రకారం ముస్లిం దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు.

భారత్‌లో సుమారు 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 'ఇస్లామోఫోబియా' కారణంగా ముస్లిం కావడమే నేరంగా పరిగణించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు, వారి సమస్యలను ఎజెండాలో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది.

దేశంలో ముస్లింలకన్నా దళితుల రాజకీయ పరిస్థితి కొంచెం భిన్నం. దీనికి కారణం - 80 శాతం హిందువుల ఓట్లలో వారి ఓట్లు ఒక భాగం. ముస్లింల మాదిరి వారి ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యం. అందుకే దళితుల ఇళ్లకు వెళ్లి సహపంక్తి భోజనం చేయడం లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

దళితుల పరిస్థితి ఏమిటి?

స్వాతంత్ర్యానంతరం దళితుల పరిస్థితి కొంచెం మెరుగుపడినప్పటికీ, నేటికీ వాళ్లు భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పలేం.

రాజ్యాంగంలోని ఏ మినహాయింపుల కారణంగా వారి పరిస్థితి మెరుగుపడిందో, అవి రేపు ఉంటాయా, ఉండవా అన్న సందేహాలు దళితుల్లో తలెత్తుతున్నాయి.

ఇటీవల ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో చేసిన మార్పులను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దానిపై ఒక పిటిషన్ దాఖలు చేసింది.

ఇటీవల దళితులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో చెలరేగిన హింస, వాటిలో పోలీసులు ప్రవర్తించిన తీరు, అనేక విషయాలను వెల్లడిస్తున్నాయి. రిజర్వేషన్లపై ఉన్నత కులాల వారికి ఉన్న వ్యతిరేకత పలు రూపాలలో వ్యక్తమవుతోంది. దీని వల్ల ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

..ఇవన్నీ దళితుల భయాలను పెంచుతున్నాయి

హిందుత్వ రాజకీయాలను సమర్థించే బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు రిజర్వేషన్లను ఒక విపత్తుగా పరిగణిస్తారు. గుజరాత్‌లోని ఉనాలో జరిగిన దాడులు, ఉత్తర ప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌లో జరిగిన అలర్లు, రాజస్థాన్‌లో దళిత పెళ్లికొడుకు గుర్రంపై కూర్చున్నందుకు దాడి - ఇలాంటి సంఘటనలను ఎక్కువగా సమర్థించేది వీళ్లే.

దళితులపై ఉన్నత కులాల దాడుల విషయానికి వస్తే, వాటిపై బీజేపీ మౌనం వహిస్తుంది. తాము ఏ ఒక్కరి పక్షమో వహించినట్లు కనిపించడం బీజేపీకి ఇష్టం లేదు. కానీ అందువల్లే హిందుత్వ మూకలు ప్రభుత్వం తమ వైపు ఉందని భావించడానికి ఆస్కారం ఏర్పడుతోంది. దళితులపై జరిగిన దాడులకు కారకులైన వారిపై ఒక్క చోట కూడా కఠినంగా వ్యవహరించినట్లు మనకు కనిపించదు. వాటిని తీవ్రంగా ఖండించిన దాఖలాలూ కనిపించవు. ఉనా సంఘటనలు జరిగిన చాలా కాలం తర్వాత ప్రధాని ''దళితులను కాదు, మొదట నన్ను చంపండి'' అన్నారు.

మరోవైపు, దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్‌ రావణ్‌ను జాతీయ భద్రతా చట్టం కింద జైలులో పెట్టడం, దళితులపై దాడి జరిగిన కేసుల్లో దోషులను రక్షించడం, భీమా-కోరెగావ్ అల్లర్లలో నిందితులను చాలా కాలం తర్వాత అరెస్ట్ చేయడం, ఇవన్నీ దళితుల భయాలను పెంచుతున్నాయి.

ఇక అనంతకుమార్ హెగ్డేలాంటి వారు రాజ్యాంగాన్ని మారుస్తామని, సీపీ ఠాకూర్ లాంటి వారు రిజర్వేషన్లను తొలగిస్తామనీ చేస్తున్న ప్రకటనలు దళితుల భయాలను పెంచుతున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో దళితుల జనాభా దాదాపు 20 కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సమతౌల్యంతో సమీక్షించాల్సిన అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ స్పెషల్ సిరీస్

ఈ నేపథ్యంలో దళితులు, ముస్లింల సమస్యలపై బీబీసీ ఒక ప్రత్యేక సిరీస్‌ను వెలువరిస్తోంది.

ప్రధానస్రవంతి మీడియాలో దళితులు, ముస్లింల సమస్యలకు చోటు తగ్గిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మేం దళితులు, ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన కథనాలను చెబుతాం, వారి వాణిని వినిపిస్తాం.

ఈ బీబీసీ స్పెషల్ సిరీస్ దేశంలోని దాదాపు మూడో వంతు ప్రజల జీవితాలు, వారి పోరాటాలు, వారి కలలు, వారి భవిష్యత్తుకు సంబంధించినది.

దేశంలోని సుమారు 40 కోట్ల మంది ప్రజలు దళితులు లేదా ముస్లింలు. మరి వారి సమస్యలపై జరగాల్సినంత తీవ్రమైన చర్చ జరుగుతోందా? దీనికి సమాధానం లేదనే చెప్పాల్సి వస్తుంది.

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ''ప్రజాస్వామ్యానికి గీటురాయి ఆ దేశంలోని మైనారిటీలకు మనం ఎంత భద్రత కల్పిస్తున్నామన్నదే'' అన్నారు.

మన రాజ్యాంగ పీఠికలోని మూడు పదాలు - స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం - ఈ మూడు పదాల అర్థం మీకు తెలిస్తే, లేదా వాటిని అర్థం చేసుకోవాలని మీరు భావిస్తుంటే ఈ సిరీస్ మీ కోసమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)