అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
రాధికా కుమారస్వామి

ఫొటో సోర్స్, Shamika Enterprises

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి, నటి రాధికా కుమారస్వామి, వారితో ఓ చిన్నారి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వారిపై జోకులు వాట్సాప్‌లో తిరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌లను కలపడానికి రాధిక అందం ఓ 'గమ్ము'లాగా సాయపడిదంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

అసలు కుమారస్వామి రాధికను పెళ్లి చేసుకున్నారా? లేక చాటుగా వ్యవహారం నడిపారా? ఆ సంబంధం ద్వారానే వారికి బిడ్డ పుట్టిందా? ప్రస్తుతం వాళ్లు కలిసే ఉంటున్నారా? అన్న విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా కనిపిస్తోంది.

ఎన్నికల సంఘానికి సమర్పించిన రాతపూర్వక అఫిడవిట్‌లో హెచ్‌డీ కుమారస్వామి తన మొదటి భార్య పేరును పేర్కొన్నారు. రాధికా కుమారస్వామి తన భార్య అని మాత్రం ఆయన బహిరంగంగా ఎక్కడా వెల్లడించలేదు.

కుమారస్వామి ఒక్కరే కాదు. దేశంలోని రాజకీయ నాయకుల్లో ఓవైపు వైవాహిక జీవితంలో ఉండగానే ఇతరులతో ప్రేమ వ్యవహారాలు నడిపి, వారిని ఇంటికి తీసుకొచ్చిన వాళ్లు, పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డీఎంకే నేత కరుణానిధి మూడో భార్య కూతురు లోక్‌సభ సభ్యురాలు కనిమొళి

ఇద్దరు భార్యలున్న రాజకీయ నాయకులు

డీఎంకే నేత కరుణానిధి మూడో భార్య కూతురు లోక్‌సభ సభ్యురాలు కనిమొళి.

మరో డీఎంకే నేత టీఆర్ బాలు కూడా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఇద్దరు భార్యల పేర్లను పేర్కొన్నారు.

అయితే, అలా వైవాహిక జీవితంలో ఉండగానే, మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పురుషుడితో ప్రేమ వ్యవహారాలు నడిపి, అతన్ని తన ఇంటికి తెచ్చుకుని పెళ్లి చేసుకున్న మహిళా రాజకీయ నేతల పేర్లు సేకరించడం మాత్రం మీకు సాధ్యం కాకపోవచ్చు.

ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా? ఆ ఆలోచనే ఓ వింతగా అనిపిస్తుంది కదా? మహిళల క్యారెక్టర్ గురించి మీకు ఇప్పటికే పలు ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఆ ప్రశ్నల మాదిరిగానే రిలేషన్‌లో ఉన్న మహిళా, పురుష రాజకీయ నాయకుల శరీరం మీద, ఆలోచన, ఇష్టం, స్వభావం పైన కామెంట్లు కూడా వచ్చి ఉంటాయి.

కానీ, పురుష నాయకులను అయితే ఆ ప్రశ్నలు అడగరు. వారి సంబంధాల గురించి సోషల్ మీడియాలో కొద్దికాలం చర్చ నడిచినా ఆ తర్వాత వెంటనే అంతా మరచిపోతారు.

అదే మహిళా నాయకురాలి విషయానికి వస్తే అలా వదిలేస్తారా?

ఫొటో సోర్స్, Getty Images

రెండో పెళ్లి చట్ట వ్యతిరేకం కాదా?

పురుష రాజకీయ నాయకులు ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు, రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అయినా ఓటర్లు వారిని ఆదరిస్తున్నారు. వాళ్లనే మళ్ళీమళ్లీ తమ నాయకుడిగా ఎన్నుకుంటున్నారు.

భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 494 కింద మొదటి పెళ్లికి సంబంధించిన భర్త లేదా భార్య బతికుండగానే లేదా విడాకులు తీసుకోకుండానే రెండో వివాహం చేసుకోవడం చట్టవ్యతిరేకం.

అయితే కరుణానిధి, టీఆర్ బాలు లాంటి నాయకులు అలా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ వారి మీద ఎలాంటి న్యాయపరమైన చర్యలూ లేవు.

అందుకు కారణం అది 'విచారించదగిన' నేరాల జాబితాలో లేకపోవడమే. అందువల్ల పోలీసులు తమంతట తాముగా ఎలాంటి చర్యలు చేపట్టలేరు. చట్టవ్యతిరేకంగా మళ్లీ పెళ్లి చేసుకున్న పురుషుడిని లేదా మహిళను అరెస్టు చేయలేరు.

ఫొటో సోర్స్, Getty Images

మరి ముస్లింల సంగతేంటి?

మొదటి భార్య లేదా భర్త ఫిర్యాదు చేస్తేనే బాధ్యులపై న్యాయపరంగా చర్యలు చేపట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ చట్టం ముస్లిం మహిళలకూ వర్తిస్తుంది. కానీ, ముస్లిం పురుషులు మాత్రం నలుగురు మహిళలను పెళ్లి చేసుకునే స్వేచ్ఛ 'ముస్లిం పర్సనల్ లా' కల్పిస్తోంది.

ఒకవేళ ముస్లిం పురుషుడు ఐదో పెళ్లి చేసుకుంటే మాత్రం అది చట్టవ్యతిరేకంగా అవుతుంది. మొదటి భార్య ఫిర్యాదు చేస్తే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభించే వీలుంటుంది.

ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఫిర్యాదు చేసింది భార్యనా కాదా అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే రెండో పెళ్లికి చట్టబద్ధత ఉండదు.

వీలునామా లేకుండా భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైన రెండో భార్యకు హక్కు ఉండదు. అతను సంపాదించిన ఆస్తులపై కూడా ఆమెకు హక్కు రాదు.

న్యాయపరంగా తన భర్త నుంచి భరణం కూడా అడిగే అవకాశం రెండో భార్యకు ఉండదు.

మహిళా నాయకుల్ని కూడా అలాగే ఆదరిస్తారా?

చట్టవ్యతిరేక వివాహాలను 'విచారించదగిన' నేరాల జాబితాలో చేర్చాలని 2009లో లా కమిషన్ భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలా చేస్తే సామాజిక ఒత్తిళ్ల కారణంగా మొదటి భార్య ఫిర్యాదు చేయకపోయినా.. రెండో పెళ్లి చేసుకున్న భర్తపై పోలీసులు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

కానీ, అది జరగలేదు. అది ఇంకా పరిశీలన దశలోనే ఉంది. పురుష రాజకీయ నాయకులు మాత్రం అలాంటి వ్యవహారాలు నడుపుతూనే ఉన్నారు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. నేను రెండో భార్య గురించి మళ్లీ మళ్లీ చెప్పాను. ఒకవేళ ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంటే, ఆ చట్టం ఆమె రెండో భర్తకు కూడా వర్తిస్తుంది.

సాధారణంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే అనేక అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అందుకే తమ ప్రతిష్ఠ ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఆలోచనతో వాళ్లు అలాంటి సంబంధాల జోలికి వెళ్లే రిస్క్ చేయకపోవచ్చు.

తాము ప్రేమ సంబంధాలు నడిపినా, రెండో పెళ్లి చేసుకున్నా ప్రజలు ఎవరూ పట్టించుకోరన్న నమ్మకం వారికి లేదు.

ఇక ఇప్పుడు చెప్పండి.. అలాంటి సంబంధాలు కలిగి ఉన్న మహిళా నాయకులను మీరు ఉపేక్షిస్తారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)