ప్రెస్‌రివ్యూ: ప్రాంతీయ పార్టీల అసలు సత్తా మున్ముందు చూపిస్తాం: కేసీఆర్

కేసీఆర్
కుమారస్వామిని అభినందిస్తున్న కేసీఆర్

కర్ణాటకలో జేడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటం ఆరంభం మాత్రమేనని, ప్రాంతీయ పార్టీల అసలు సత్తా ఏమిటో భవిష్యత్తులో చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారని ఈనాడు కథనం పేర్కొంది.

కర్ణాటక సీఎంగా జేడీ(ఎస్) నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కేసీఆర్ బెంగళూరు వెళ్లి ఆయన్ను అభినందించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలుగానే గాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారంతో అభివృద్ధిని సాధించేందుకు కృషి చేద్దామని కుమారస్వామితో కేసీఆర్‌ అన్నారు.

కుమారస్వామి ప్రమాణస్వీకారం తర్వాత మళ్లీ తాను వస్తానని, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చిద్దామని తెలిపారని.. వారిద్దరూ కొంతసేపు ఏకాంతంగా చర్చించుకున్నారని ఈనాడు కథనంలో పేర్కొన్నారు.

కాగా కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నప్పటికీ కేసీఆర్‌ వ్యూహాత్మకంగా మంగళవారం బెంగళూరు పర్యటనకు వెళ్లివచ్చారని.. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్న నేపథ్యంలో.. వారితో వేదికను పంచుకుంటే తప్పుడు సంకేతాలు వస్తాయనే భావనతో కేసీఆర్‌ మంగళవారమే కుమారస్వామిని కలిసినట్లుగా ఈనాడు కథనంలో పేర్కొన్నారు.

విమాన ప్రయాణికులకు ఊరట

విమాన ప్రయాణికుల హక్కులను కాపాడే, మరిన్ని సదుపాయాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినట్లు సాక్షి కథనం పేర్కొంది. దేశంలో ప్రయాణం కోసం ఉద్దేశించిన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటల్లోగా క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు విధించకూడదని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది.

24 గంటల లాకిన్ వ్యవధిలో ప్రయాణికుల పేర్లలో మార్పలు చేర్పులు, ప్రయాణ తేదీలను ఉచితంగా సవరించుకోవచ్చని ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.

విమానం బయలుదేరడానికి నాలుగు రోజుల ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు.

కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించి రెండు నెలల్లోగా నోటిఫై చేస్తారని సిన్హాని ఉటంకిస్తూ ఆ కథనంలో వెల్లడించారు.

‘నాగాయలంక గ్యాస్ ఆంధ్రప్రదేశ్‌కే’

నాగాయలంక ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాల సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని 'ఓఎన్‌జీసీ' చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిశంకర్‌ చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది. దివిసీమ ప్రజలకు అందించిన తరువాతే, వేరే ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక క్షేత్రం వద్ద మంగళవారం ఎర్లీ ప్రొడక్షన్‌ సిస్టమ్‌ను(ఈపీఎస్‌) శశిశంకర్‌ ప్రారంభించారు. నాగాయలంక క్షేత్రంలోని 33 బావులకు అటవీ, పర్యావరణ అనుమతులు తెప్పించడంలో, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నుంచి వాణిజ్య సమ్మతిని సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి అభినందనీయమని ఈ సందర్భంగా శివశంకర్‌ అన్నారు.

''గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాల వెలికితీతని ఒక పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టులో 49 శాతం వాటాతో వేదాంత భాగస్వామిగా ఉంటుంది. ప్రాజెక్టు వ్యయం 400 మిలియన్‌ డాలర్లు. రోజుకు 400 టన్నుల గ్యాస్‌, రెండు లక్షల స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల అయిల్‌ నిక్షేపాలను వెలికి తీయనున్నాం. దీనికి సంబంధించిన విస్తరణ పనులు మొదలయ్యాయి'' అని శశి శంకర్‌ వివరించారు.

కాగా, నాగాయలంకలో వెలికితీసిన చమురు నిక్షేపాల ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే బాధ్యతను మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించినట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు.

హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు 4,750 కోట్లతో కేశవపూర్ రిజర్వాయర్

హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చేందుకు శామీర్‌పేట కేశవాపూర్‌లో 10 టీఎంసీల సామర్థ్యంతో రూ.4,750 కోట్లతో భారీ రిజర్వాయర్ నిర్మించనున్నట్టు తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

నగరంలోని హఫీజ్‌పేట, కూకట్‌పల్లి ఎల్లమ్మబండ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న కోటి జనాభా భవిష్యత్తులో నాలుగు కోట్లకు చేరినా తాగునీటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ దూరదృష్టితో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.

కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణలో ఉన్న చిన్నచిన్న చిక్కులను సాధ్యమైనంత త్వరగా అధిగమించి పనులను ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రస్తుతం నగర దాహార్తి తీర్చడంలో కృష్ణా, గోదావరి జలాలు కీలకంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ రెండింటి జలాశయాలలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రభావం నగరంపై పడకుండా ఔటర్ రింగురోడ్డు చుట్టూ కృష్ణా, గోదావరి పైపులైన్ వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ఇంటర్ కనెక్టివిటీ గ్రిడ్ ఏర్పాటుచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)