కుమారస్వామి ప్రమాణస్వీకార వేడుక.. మోదీ వ్యతిరేకులకు పండుగ!!

  • 23 మే 2018
కుమారస్వామి Image copyright hdkumaraswamy/facebook

కర్ణాటకలో జనతాదళ్(సెక్యులర్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు.. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుక బీజేపీయేతర పార్టీలకు పండుగ వాతావరణం తెస్తోంది. బీజేపీ మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకోకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు అడ్డుకోగలగడం వారికి ఆనందాన్నిస్తోంది.

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి దేశంలోని విపక్ష పార్టీల నేతలు వస్తారని కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని అయిన హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీలను కుమారస్వామి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. సోనియాను కలిసినప్పుడు కుమారస్వామి ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

మరోవైపు ఈరోజు సాయంత్రం 4.30కి జరగబోయే ఈ వేడుకకు తాము హాజరవుతున్నామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరై విజయన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఇప్పటికే ప్రకటించారు.

వీరేకాకుండా బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అజిత్ సింగ్, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్‌లు కూడా హాజరవుతున్నారు.

Image copyright facebook/KCR
చిత్రం శీర్షిక బెంగళూరులో మంగళవారం దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి అభినందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఒక రోజు ముందే కలిసిన కేసీఆర్

ఎన్నికల ప్రచార సమయంలోనే జేడీఎస్‌కు ఓటేయాలంటూ కర్ణాటకలోని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) ఒకరోజు ముందుగానే కుమారస్వామిని కలిశారు. ముందుగా నిర్ణయమైన కార్యక్రమాలు ఉండడంతో ప్రమాణ స్వీకారం రోజున రాలేనంటూ చంద్రశేఖరరావు మంగళవారమే బెంగళూరు వెళ్లి దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి అభినందించారు.

తమిళనాడులోని తూత్తుకుడిలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో డీఎంకే నేత స్టాలిన్ రాకపై ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్‌లు పదవుల పంపకంపై ఒక ఒప్పందానికి వచ్చాయి. ఉపముఖ్యమంత్రి, సభాపతి, ఉప సభాపతి పదవులు ఏ పార్టీకి ఇవ్వాలనే విషయంలో సీఎం కుమారస్వామి.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ కర్ణాటక ఇంఛార్జి కేసీ వేణుగోపాల్‌లు తుది నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కుమారస్వామితో పాటు ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తారు.

మే 24న విశ్వాస పరీక్ష ఉంటుందని, అందులో నెగ్గిన తరువాత సభాపతి, ఉప సభాపతిల ఎన్నిక ఉంటుందని కుమారస్వామి వెల్లడించారు.

Image copyright Getty Images

దేవెగౌడకు, కుమారస్వామికి ఒకరే సభాపతి!

కాగా సభాపతిగా కేఆర్ రమేశ్ కుమార్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తోంది. రమేశ్ కుమార్ ఇంతకుముందు 1994 దేవెగౌడ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో సభాపతిగా పనిచేశారు. ఉపసభాపతిగా జేడీఎస్ నేతను ఎన్నుకోనున్నారు.

కాంగ్రెస్ రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను కోరినప్పటికీ జేడీఎస్ అందుకు అంగీకరించలేదు. లింగాయత్ సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశమిచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని కోరింది.

లింగాయత్‌లకు అల్ప సంఖ్యాక మత హోదా ఇస్తామని సిద్ధరామయ్య ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపాదించడంతో లింగాయత్‌ల నుంచి స్పందన వచ్చింది. ఇది హిందూ సమాజాన్ని చీల్చడమేనంటూ బీజేపీ దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది.

అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 49 మంది లింగాయత్ అభ్యర్థుల్లో 18 మంది విజయం సాధించారు. ''వారిప్పుడు ప్రభుత్వంతో తమకు తగిన ప్రాధాన్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలా ప్రాధాన్యమిస్తేనే కాంగ్రెస్‌కు లింగాయత్‌ల ఓట్లు మళ్లీ పడతాయి'' అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు.

కాంగ్రెస్ కర్ణాటక ఇంఛార్జి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. మొత్తం 34 మంత్రి పదవుల్లో కాంగ్రెస్ నుంచి 22 మంది, జేడీఎస్ నుంచి సీఎం సహా 12 మంది ఉంటారని చెప్పారు. మే 24న విశ్వాస పరీక్ష తరువాత శాఖల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)