ఆంధ్రకి 100 కిలోమీటర్లలో ‘టిబెట్’.. చూసొద్దామా?

  • 28 మే 2018
పద్మసంభవుడి విగ్రహం
చిత్రం శీర్షిక పద్మసంభవుడి విగ్రహం

ఎటుచూసినా పచ్చని చెట్లను కప్పుకొన్న కొండలు, లోయలు.. ఉరకలేసే జలపాతాలు.. గుంపులుగుంపులుగా ఎగిరే పక్షులు.. మధ్యాహ్నం దాటితే మాయమైపోయే సూరీడు.. చీకటి పడడానికి ముందే వినిపించే కీచురాళ్ల చప్పుడు.. మధ్యమధ్యలో నెమళ్ల అరుపులు.. అడవిలోంచి వీచే గాలులకు నాసికాపుటలను తాకే పనస, మామిడి, జీడిమామిడి పండ్ల సువాసనలు.. మత్తెక్కించే విప్ప పూల ఘుమఘుమలు.. అప్పుడప్పుడు ఆ దారిలోంచి సాగిపోయే ఒకటీఅరా వాహనాలు.

తూర్పుకనుమల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్రదేశం సంప్రదాయ గిరిజన తెగలకు ఆవాసం.

కానీ.. అక్కడ అడుగడుగునా పూర్తిగా భిన్నమైన ముఖాలు కనిపిస్తాయి. ఆ ప్రాంతానికి చెందని భాష వినిపిస్తుంది.

ఇంటి బయట ఉన్ని దుస్తులు అల్లుతున్న మహిళలు.. మొక్కజొన్న పొలాల వద్ద పురుషులు.. ఫుట్‌బాల్ ఆడుకుంటూ పిల్లలు కనిపిస్తుంటారు.

తూర్పు కనుమల్లోని గిరిజన గ్రామాల్లోకి ఫుట్‌బాల్ ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోవద్దు.. ఈ కొత్త భాష, ముఖాలు ఏమిటా అని మెదడుకు పని చెప్పొద్దు.

వారంతా టిబెట్ ప్రజలు.. శరణార్థులుగా వచ్చి ఇక్కడ స్థిరపడినవారు.

Image copyright karthik
చిత్రం శీర్షిక చంద్రగిరిలోని టిబెటన్లు

టిబెట్‌లో ఉన్నట్లే ఉంటుంది..

సుమారు 3,500 మంది టిబెటన్లు నివసిస్తున్న ఈ ప్రాంతం ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉంది. ఆరేడు కిలోమీటర్ల పరిధిలోని 5 ఆవాసాల్లో వీరంతా ఉంటారు.

సంప్రదాయ బౌద్ధ రీతిలో నిర్మించిన ఆలయాలు, కట్టడాలు, బౌద్ధసన్యాసుల వస్త్రధారణలో పిల్లలు కనిపించే అక్కడకు వెళ్తే టిబెట్‌లో ఉన్నట్లు అనిపిస్తుందే తప్ప ఒడిశాలో ఉన్నామన్న భావన ఏమాత్రం కలగదు. అందుకే అంతా దీన్ని మినీ టిబెట్ అని పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటిన వెనువెంటనే ఉండే ఒడిశా పట్టణం పర్లాకిమిడికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉందీ చంద్రగిరి. ఒడిశాలోని బరంపురం నుంచి కూడా ఇంతే దూరంలో(95 కిలోమీటర్లు) ఉంటుంది.

ఇక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఖసాడా, తప్తపాని, గండాహతి వంటి జలపాతాలున్నాయి.

Image copyright karthik

ఇక్కడికెలా వచ్చారు?

చైనా 1959లో టిబెట్‌ను ఆక్రమించుకున్నాక దలైలామా సహా కొందరు టిబెట్ పౌరులు దేశం విడిచి వెళ్లారు. భారత ప్రభుత్వం వారికి ఆశ్రయమిచ్చింది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల కేంద్రంగా ప్రవాసంలో ఉంటూనే భారత ప్రభుత్వ సహకారంతో టిబెట్ పౌరుల ఉన్నతికి పనిచేయడం ప్రారంభించారు. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో టిబెటన్ల కోసం ఆవాసాలు.. అక్కడ పాఠశాలలు, ఆశ్రమాల ఏర్పాటు చేపట్టారు.

ఆ క్రమంలోనే 1963లో ఒడిశాలోని గజపతి జిల్లాలోని చంద్రగిరిలో ఫున్సోక్‌లింగ్ టిబెట్ ఆవాసాన్ని నెలకొల్పారు. సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం తూర్పుకనుమల్లో ఉంది.

కొండ ప్రాంతమైనప్పటికీ ఏడాదికి సగటున 23 సెంటీమీటర్ల వర్షం పడే ఇక్కడి నేలలు వ్యవసాయానికి అనుకూలంగానే ఉంటాయి. మొదట్లో సుమారు 25 మంది టిబెట్ శరణార్థులు ఇక్కడకొచ్చారు. ఇప్పుడు చంద్రగిరి, టాంకిల్‌పదర్, లోబర్సింగి, జిరాంగ, మహేంద్రగడ అనే 5 ఆవాసాల్లో సుమారు 3,500 మంది ఉన్నారు.

Image copyright karthik

వీరంతా ఏం చేస్తారు?

వ్యవసాయం చేయడం ఇక్కడి శరణార్థుల ప్రథమ వృత్తి. ప్రభుత్వం వీరికిచ్చిన భూముల్లో మొక్కజొన్న, వరి, తృణధాన్యాలు పండిస్తారు. ఉన్ని దుస్తులు అల్లడం, విక్రయించడం ద్వారా కూడా ఉపాధి పొందుతారు.

శీతాకాలంలో ఒడిశా, ఉత్తరాంధ్రలోని పట్టణాల్లో స్వెటర్లు, ఊలు టోపీలు వంటివి విక్రయిస్తారు.

మొక్కజొన్నను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తుండడంతో ఈ ప్రాంతాన్నిప్పుడు 'మెయిజ్ బౌల్ ఆఫ్ ఒడిశా'గా పిలుస్తున్నారని స్థానికుడు ప్రేమా ధువా తెలిపారు.

అందుకేనేమో.. ఇక్కడ ఏ ఇంటిని చూసినా పక్కనే నేలకు పదడుగుల ఎత్తున కట్టిన చెక్కతో గదుల్లో మొక్కజొన్న కండెలను నిల్వ చేయడం కనిపిస్తుంది.

కొద్దిమంది టిబెటన్ మాస్టిఫ్, టిబెటన్ ఏప్సస్ వంటి మేలుజాతి కుక్కలను పెంచుతూ ఆసక్తి ఉన్నవారికి వాటిని విక్రయిస్తుంటారు.

Image copyright karthik

పద్మసంభవ మహావిహార ఆలయం

ఇక్కడున్న అయిదు ఆవాసాల్లో పలు బౌద్ధ ఆలయాలున్నాయి. వీటిలో జిరంగలోని పద్మసంభవ మహావిహార ఆలయం ప్రధానమైనది. 2003లో నిర్మాణం ప్రారంభించిన ఈ ఆలయాన్ని 2010లో దలైలామా వచ్చి ఆవిష్కరించారు.

ఇందులో 21 అడుగుల భారీ బుద్ధ విగ్రహం ఉంటుంది. పైకప్పు, గోడలకు బౌద్ధ కళారీతిలో వర్ణరంజకమైన చిత్తరువులు ఉన్నాయి. నిత్య ప్రార్థనలతో పాటు బౌద్ధ ఉత్సవాలన్నీ ఇక్కడ నిర్వహిస్తారు.

ఏడో శతాబ్దంలో జన్మించిన పద్మసంభవుడు మహాయానంలోని వజ్రయాన శాఖను స్థాపించినట్లుగా చెప్తారు. ఒడిశాలోనూ ఈయన బౌద్ధం వ్యాప్తికి కృషి చేసినట్లు చెప్తారు.

200 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవడానికి వీలున్న ఈ ఆలయం ఇక్కడి బౌద్ధతత్వ విద్యకు ప్రధాన కేంద్రం. ఈ ప్రాంగణంలోనే వరుసగా వసతి గృహాలున్నాయి.

Image copyright karthik

స్కూళ్లు, ఆసుపత్రి, వృద్ధాశ్రమం అన్నీ..

'ది టిబెటన్ కోపరేటివ్ సొసైటీ ఆఫ్ చంద్రగిరి' పేరిట ఏర్పడిన సహకార సంఘం ఇక్కడ ఒక చేతివృత్తుల కేంద్రం, డెయిరీ, పౌల్ట్రీ, వాహనాల వర్క్‌షాప్, ఆసుపత్రి, వృద్ధాశ్రమం నిర్వహిస్తోంది. వీటితో పాటు పాఠశాలలూ ఉన్నాయి.

ఇక్కడి ఆశ్రమాల్లో విద్యాబోధన దాదాపుగా సాధారణ పాఠశాల విద్యాలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ టిబెట్ సాహిత్యం, బౌద్ధం కూడా బోధిస్తారు. వీటితో పాటు చిత్రలేఖనం, అందమైన చేతిరాతకు ప్రాధాన్యమిస్తారు.

బౌద్ధ తత్వం నేర్చుకోవడానికి ఇది మంచి ప్రదేశమని, బౌద్ధంలో పీజీ స్థాయి కోర్సులు ఇక్కడ అభ్యసించే వీలుందని బుద్ధిస్ట్ ఫిలాసపీ అభ్యసిస్తున్న సోనమ్ నోర్బూ అనే విద్యార్థి తెలిపారు.

ఇక్కడి మైదానాల్లో ఫుట్‌బాల్ ఆడే యువ బౌద్ధసన్యాసులను కదిపితే ఆడేందుకు మిమ్మల్నీ ఆహ్వానిస్తారు.

Image copyright karthik

మా ఇతర కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.