గ్రౌండ్ రిపోర్ట్: ‘ఫోన్లనేమో మెసేజ్‌లు వస్తున్నయి.. పోలీసులేమో వాట్ని నమ్మొద్దంటున్నరు’

  • 23 మే 2018
ఆండాళమ్మ Image copyright Sangeetham Prabhakar/BBC

"ఎవరిని నమ్మాలో తెలీడం లేదు. సెల్‌ఫోన్లలో పిల్లల్ని ఎత్తుకు పోతున్నరు అని మెసేజ్‌లు వస్తున్నాయి. పోలీసులేమో వాట్ని నమ్మొదు అంటున్నరు. ఇక్కడ చూస్తెనేమో ఊళ్ళో కొత్తోళ్లు వొస్తే భయమయితుంది" అని 50 ఏళ్ల ఆండాళమ్మ భయం వ్యక్తం చేసింది.

మంగళవారం ఉదయం 7.30 సమయంలో తెలంగాణలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగటం చూసి ఊళ్ళో వాళ్లంతా ఏకమై అతన్ని చితకబాదారు.

"షాప్ తీయగానే వచ్చిండు. ఏం కావాలంటే ఉల్కలే, పల్కలే. పోయి పక్క అరుగుపై కూసున్నడు. మాకు ఎందుకో అనుమానం వచ్చింది. అతని బాగ్ తీసి చూస్తే ఒక బ్లేడ్, కొబ్బరినూనె సీసా ఉండే. ఊళ్ళో ఏం పని? అని అడిగితే సమాధానం ఇవ్వలే. ముందే వాట్సాప్‌లో మెసేజీలు వస్తున్నయి. పంచాయత్ ఆఫీస్ కాడికి తోల్కపోయి పోలీసులకి పట్టిచ్చినం" అని వివరించాడు అదే గ్రామంలో కిరాణా కొట్టు యజమాని జంగారెడ్డి.

అయితే ఊరి జనాలు పిల్లలను ఎత్తుకు వెళ్తున్నాడు అని అనుమానం వచ్చి కొట్టిన వ్యక్తి మతిస్థిమతం లేని వ్యక్తి అని పోలీసులు గుర్తించారు.

"అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. భాష రాకపోవడం వల్లనే గ్రామస్తులకు సమాధానం ఇవ్వలేక పోయాడు. ప్రస్తుతం అతణ్ని చౌటుప్పల్‌లోని ఓ అనాధాశ్రమానికి తరలించాం. జనాలు వాట్సాప్‌లో వస్తున్న మెసేజ్‌లు చూసి భయంతో అతణ్ని నిలదీశారు" అని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎ.వెంకటయ్య తెలిపారు.

‘ఇలా వాట్సాప్‌లో వచ్చే ప్రతిదీ నమ్మితే చాలా ప్రమాదం’

ఇక్కడే కాదు, తెలంగాణలో పలుచోట్ల గత రెండు రోజులుగా మతిస్థిమితం లేని వారిపై దాడులు జరిగాయి. రంగరెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆగేపల్లి పొలిమేరల్లో సోమవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులను హైవే పైన వెళ్తున్న కొందరు చితకబాదారు.

"ఎందుకు కొట్టారు అని అడిగితే వీళ్లిద్దరూ పిల్లలని ఎత్తుకుపోయేటోళ్ళు అన్నారు. వాళ్ల చేతుల్లో ఇనుప చువ్వలు ఉండే. ఈ వాట్సాప్ మెసేజులతో పరేషాన్ అవుతున్నాం" అని ఆగేపల్లి గ్రామానికి చెందిన నాగభూషణ్ తెలిపారు.

అయితే ఇక్కడ కూడా వారిద్దరూ మతిస్థిమితం లేని వ్యక్తులే అని పోలీసులు తెలిపారు.

మంచాల పోలీస్‌స్టేషన్ ఎస్సై రాంబాబు బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ.. "వస్తున్న మెసేజ్‌లు నిజమా, కాదా అని యువత నిర్ధారించుకోవడం లేదు. మా విన్నపం ఒక్కటే. దయచేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి. అనుమానం వస్తే పోలీసులకి ఫోన్ చేయండి. ఇలా వాట్సాప్‌లో వచ్చే ప్రతిదీ నమ్మితే చాలా ప్రమాదం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి'' అని హెచ్చరించారు.

గత కొద్దిరోజులుగా పిల్లలను ఎత్తుకు వెళ్లే ఒక ముఠా ఉత్తర భారతదేశం నుండి వచ్చి తెలుగు రాష్ట్రాలలో సంచరిస్తోందని వాట్సాప్‌లో మెసేజులు, వీడియోలు వస్తున్నాయి.

అయితే అవి అవాస్తవమని, వాటిని నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర పోలీసులు, అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయినా ఆ మెసేజ్‌లు ఒకరి నుంచి ఒకరికి ఫార్వార్డ్ అవుతూనే ఉన్నాయి.

వీటి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే వేర్వేరు సంఘటనల్లో దాదాపు ఆరుగురుని తీవ్రంగా కొట్టారు. వారిలో ఒకరు మరణించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం ట్విట్టర్ ద్వారా "పుకార్లను నమ్మవద్దు. ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే పోలీసులకు తెలియచేయండి" అని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు.

'మాస్ హిస్టీరియాకి దారి తీస్తుంది'

అయితే ఈ వాట్సాప్‌ మెసేజ్‌లు ఎలా వైరల్ అవుతున్నాయన్న దానికి సమాధానం లభించడం లేదు.

"వాట్సాప్ మెసేజ్‌లు ఎక్కడ మొదలు అవుతాయన్నది నిర్ధారించటం కష్టం. కానీ అవి ఒకరి నుండి ఒకరికి ఫార్వర్డ్ అవుతూ వైరల్ అవుతాయి. దీని వెనుక ఎవరు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. మా సైబర్ టీమ్స్ అదే పనిలో ఉన్నారు" అని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వివరించారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లోను ఫేక్ వాట్సాప్ మెసేజ్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. విశాఖపట్నంలో ఆదివారం ఒక బిచ్చగాడిని కొట్టి చంపేసారు. ఈ సంఘటనలో వైజాగ్ పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ పోలీస్ కమిషనర్ టి.యోగానంద్, 'పిల్లలను ఎత్తుకువెళ్ళే ముఠా వైజాగ్‌లో తిరుగుతున్నారు అని వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌లో వాస్తవం లేద'ని వివరించారు.

"మన దేశంలో ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యేది ఎక్కువగా గ్రామాలలోని ప్రజలే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌‌లు అందరికీ అందుబాటులోకి రావడంతో అందరూ సోషల్ మీడియా వినియోగం పెరిగింది. మెసేజ్ ఫార్వర్డ్ చేయటం నేరం కాదు. కానీ ఇలాంటి అవాస్తవాలను అందరికీ పంపడం 'మాస్ హిస్టీరియా' కి దారి తీస్తుంది" అన్నారు తెలంగాణ సీఐడీ సైబర్ టీమ్ సూపరింటెండెంట్ యు.రామ్మోహన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)