గ్రౌండ్ రిపోర్ట్: 'ఆమె నిరసనలో పాల్గొనలేదు.. అయినా కాల్చి చంపారు'

తప్పు ప్రజలదా, పోలీసులదా?

ఫొటో సోర్స్, Jayakumar/BBC

ఫొటో క్యాప్షన్,

స్టెర్లైట్ పరిశ్రమ వ్యతిరేక నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన ఝాన్సీ.

తమిళనాడులోని తూతుక్కుడి జిల్లా థిరేస్‌పురం గ్రామంలోకి అడుగుపెడుతుంటే... చెల్లాచెదురుగా పడిఉన్న శరీరభాగాలు, ఛిద్రమైన తల, మెదడు కనిపించాయి. ఇవన్నీ ఝాన్సీకి చెందిన అవయవాలు అని గ్రామస్తులు చెప్పారు.

ఝాన్సీ ఎవరో తెలుసా? ఈనెల 22న జరిగిన స్టెర్లైట్ పరిశ్రమ వ్యతిరేక నిరసనల్లో చనిపోయిన మహిళ. కానీ నిజానికి ఆ నిరసనలతో ఆమెకు ఏమీ సంబంధం లేదు. ఆమె అందులో పాల్గొనలేదు.

ఝాన్సీ వయసు 48ఏళ్లు. తన సోదరి ఇంటికి వెళ్లడానికి తన ఇంట్లోనుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలోనే జరిగిన పోలీసు కాల్పుల్లో ఆమె మరణించారు.

మత్స్యకారుల కుటుంబాలు ఎక్కువగా నివసించే థిరేస్‌పురం... జిల్లా కలెక్టర్ నివాసానికి 2 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడ నిన్న జరిగిన కాల్పుల ఘటన నుంచి ఆ గ్రామస్థులు ఇంకా తేరుకోలేదు.

ఫొటో క్యాప్షన్,

తమిళనాడులోని తూతుక్కుడి జిల్లాలో స్టెర్లైట్ పరిశ్రమ వ్యతిరేక నిరసన

'ఆమె అసలు నిరసనల్లో పాల్గొనలేదు!'

"అంతా పది నిమిషాల్లో జరిగిపోయింది. ఝాన్సీ నేలపై పడిపోయింది. నలుగురు పోలీసులు ఆమె శరీరాన్ని ఓ జంతువును లాగినట్లు ఈడ్చుకుంటూ వాహనంలో పడేశారు" అని ఓ ప్రత్యక్ష సాక్షి ఆ భయానక దృశ్యాన్ని గురించి బీబీసీకి వివరించారు.

ఉదయం మొదలైన ఈ నిరసన సాయంత్రానికి పూర్తైంది. దీనిలో పాల్గొన్న ప్రజలంతా తమ ఇళ్లకు చేరుకున్నారు. కానీ విచిత్రంగా పోలీసులు అప్పుడు కాల్పులు మొదలుపెట్టారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో ఝాన్సీతో పాటు మరో బాలుడు కూడా మరణించాడని వారంటున్నారు.

"ఝాన్సీ భర్త జేసుబాలన్ ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేదు. ఆయనతో మేం మాట్లాడలేకపోతున్నాం" అని ఇరుగుపొరుగు అంటున్నారు.

"పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత మేం ఇంట్లోంచి బయటకు వచ్చాం. అప్పుడే ఝాన్సీని వెతుకుతున్న ఆమె భర్త కనిపించారు. చుట్టుపక్కల వాళ్లను అడిగాం. అప్పుడు వాళ్లు చెప్పారు.. ఆమె చనిపోయింది అని. ఆమె మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉందని ఆ తర్వాత కొద్దిసేపటికి తెలిసింది. ఆమె మృతదేహంలో తలలోని కొన్ని భాగాలు, ఒక కన్ను లేవు" అని ఝాన్సీ బంధువు జాన్సన్ తెలిపారు.

"ఝాన్సీపై చాలా దగ్గర నుంచి కాల్పులు జరిగాయి అనే విషయం ఆమె తలపై తగిలిన గాయం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. శాంతియుతంగా నిరసన చేయడానికి మేం ఇక్కడకు వచ్చాం. కానీ ఆమె ఈ నిరసనలో అసలు పాల్గొనలేదు. మరి ఆమెనెందుకు కాల్చి చంపినట్లు?" అని జాన్సన్ ప్రశ్నిస్తున్నారు.

ఎందరో అరెస్టయ్యారు, మరెందరో జాడ లేకుండా పోయారు!

గ్రామంలోకి వచ్చిన పోలీసులు కనిపించిన యువకులను తమ వెంట తీసుకెళ్లారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

"మా గ్రామంలో చాలామంది కనిపించకుండా పోయారు. వాళ్లంతా పోలీసుల అదుపులో ఉన్నారని మాకు సమాచారం అందుతోంది. మేం అక్కడకు వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు తమవారిని హింసిస్తారేమోనని మాకు చాలా భయంగా ఉంది. మేం శాంతియుతంగానే ఉన్నాం. పోలీసులే హింసను సృష్టించారు" అని ఓ వ్యక్తి తెలిపారు. తన సోదరుడు గురించి ఎంత వెతికినా జాడ దొరకలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే భయంగా ఉందని ఆయన అంటున్నారు.

హెచ్చరించాం, వినలేదు: డీజీపీ

రోడ్ రోకో చేస్తూ, రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను అదుపుచేయడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తమిళనాడు పోలీసు డైరెక్టర్ జనరల్ టీకే రాజేంద్రన్ తెలిపారు.

"ఆందోళనకారుల్లో కొందరు థిరేస్‌పురం వైపు వెళ్లి, రహదారులను దిగ్బంధించారు. వాళ్లంతా రాళ్లను రువ్వడం ప్రారంభించారు. ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో మేం వారిని హెచ్చరించాం. కానీ వారు మా మాటలను లెక్కచేయలేదు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో, వారిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది" అని రాజేంద్రన్ చెప్పారు.

పోలీసులు సరైన రీతిలో హెచ్చరికలు జారీచేసి ఉంటే ఝాన్సీ తన ఇంట్లోకి వెళ్లిపోయి ఉండేవారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఝాన్సీ మరణంతో ఆమె కుటుంబంలోనే కాదు, మొత్తం గ్రామం అంతా విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)