నగ్న చిత్రాలు పంపించండని ఫేస్‌బుక్ ఎందుకు అడుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
'మీ నగ్న చిత్రాలు మాకు పంపించండి' అని ఫేస్‌బుక్ తన బ్రిటిష్ యూజర్లను అడుగుతోంది. ఎవరైనా మీపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం మీకు సంబంధించిన ఇంటిమేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా నిరోధించేందుకే మా ఈ ప్రయత్నం అని అది చెబుతోంది.
ఎవరైనా మీ ఇంటిమేట్ ఫొటోలను పోస్ట్ చేస్తారేమోనని మీకు అనిపిస్తే, ఈ విషయం మిమ్మల్ని బాధపెడుతున్నట్టయితే, మీరు ఆ యూజర్‌ను బ్లాక్ చేయొచ్చు.
పిల్లలపై జరిగే అరాచకాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేయకుండా నిరోధించడానికి ఈ టెక్నిక్ ముందు నుంచే ఉపయోగంలో ఉంది.
ఫేస్‌బుక్‌లో ఆస్ట్రేలియాలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించారు. ఇప్పుడు దీన్ని బ్రిటన్, అమెరికా, కెనడాలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. "బ్రిటన్ ప్రజలకు ఇది ఓపెన్ ఆఫర్" అని ఫేస్‌బుక్ ప్రతినిధి 'బీబీసీ న్యూస్ బీట్'కు తెలిపారు.
ఆస్ట్రేలియాలో దీన్ని ఎలా అమలు చేశారు అనే దానిపై ఫేస్‌బుక్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ప్రజల విశ్వాసం పొందాలంటే ఇలా చేయడం తప్పనిసరి అని ఫేస్‌బుక్ భావిస్తోంది.
మీరు కూడా ఫేస్‌బుక్‌కు మీ ఇంటిమేట్ ఫొటో పంపడానికి సిద్ధంగా ఉన్నారా?
మీరు పంపిన ఆ ఫొటోతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దాన్ని వేరే ఎవరితోనూ షేర్ చేసుకోరని మీకు విశ్వాసం ఉందా?

ఫొటో సోర్స్, FACEBOOK
ఈ ఐడియా ఎలా పనిచేస్తుంది?
మీకు ఏ ఫొటో గురించైనా భయంగా అనిపిస్తుంటే... అంటే గతంలో మీరు మీ ఫ్రెండ్/పార్ట్‌నర్‌తో షేర్ చేసుకున్న ఫొటోను ఆ వ్యక్తి మీపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారేమో అని మీకు ఆందోళనగా ఉంటే మీకు ఫేస్‌బుక్ ఒక సలహా ఇస్తుంది.
మొదట మీరు మీ పార్ట్‌నర్‌తో మాట్లాడండని ఫేస్‌బుక్ మీకు సలహా ఇస్తుంది. ప్రతీకారం తీర్చుకోడానికి ఇంటిమేట్ ఫొటోలు షేర్ చేసే వారిపై ఫిర్యాదు చేయడానికి బ్రిటన్‌లో హెల్ప్‌లైన్ ఉంది.
హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఫేస్‌బుక్ సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు. తర్వాత మీకు వారొక లింక్ పంపిస్తారు. దీన్లో మీరు ఆ ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
నగ్న చిత్రాలను ఎవరు చూస్తారు?
"ఫొటోను ఐదుగురు సభ్యుల బృందం చూస్తుంది. ఈ ఐదుగురూ శిక్షణ పొందిన సమీక్షకులు. ప్రతి ఫొటోకూ వాళ్లు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఇస్తారు. దీన్ని హాష్ అంటారు" అని ఫేస్‌బుక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ సేఫ్టీ ఎంటిగాన్ డేవిస్ 'న్యూస్ బీట్'కు చెప్పారు.
ఆ తర్వాత డేటాబేస్ రూపంలో ఒక కోడ్ స్టోర్ చేస్తారు. ఎవరైనా ఆ ఫొటోను అప్‌లోడ్ చేయాలని ప్రయత్నిస్తే ఆ కోడ్ అతడిని గుర్తిస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లో వారు ప్రవేశించకుండా బ్లాక్ చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఐడియా పనిచేస్తుందా?
"దీనికి నూటికి నూరు శాతం గ్యారంటీ ఇవ్వలేమని" ఎంటిగాన్ డేవిస్ అంగీకరించారు. ఫొటోను మార్ఫింగ్ చేస్తే అది అసలు ఫొటోకు భిన్నంగా తయారవుతుందని చెప్పారు. అప్పుడు దాన్ని గుర్తించలేదు. ఇది మరింత సమర్థంగా పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
"మీరు లీక్ అవుతుందని భయపడుతున్న ఆ ఫొటో మీ దగ్గర ఉన్నప్పుడే ఈ టెక్నాలజీ పని చేస్తుంది" అని ఎంటిగాన్ చెప్పారు. ఉదాహరణకు ఎక్స్ తన మొబైల్ నుంచి ఒక ఫొటో అప్‌లోడ్ చేస్తే, అది మీ దగ్గర లేనట్టయితే, ఈ ఐడియా అసలు పని చేయదు" ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)