‘అమ్మాయిలను చూస్తే నాకెందుకు ఆకర్షణ కలగటం లేదు?’

  • 24 మే 2018
ఆర్టికల్ 377 Image copyright AFP

"మేమేమీ తప్పు చేయటం లేదు. మేమెందుకు భయపడాలి? మా శారీరక ప్రాధాన్యతలు, కోరికలు, అవసరాలను నేరంగా పరిగణించే పద్దతికి ఈ సమాజం, చట్ట సభలూ కూడా స్వస్తి పలకాలి".

ఈ మాటలు అంటున్నది ఐపీసీ సెక్షన్ 377 కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఐఐటీ విద్యార్థుల్లో ఒకరైన కృష్ణ.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణ ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

సమాజంలో అపోహలు, చాదస్తాల మధ్య తాను తన బాల్యాన్ని ఒక అభద్రతా భావంతో గడిపానని తన భయాలను, ప్రయాణాన్ని ‘బీబీసీ’తో పంచుకున్నారు.

"నేను మాత్రమే ఇలా ఆలోచిస్తున్నానా? నాకెందుకు అమ్మాయిలను చూస్తే ఆకర్షణ కలగటం లేదు. ఇలాంటి ప్రశ్నలెన్నో నన్ను తొలిచేవి. నాకేమీ అర్ధం అయ్యేది కాదు. ఎవరితో పంచుకోవాలో తెలియదు".

"చిన్నపుడు స్కూల్‌లో తోటి విద్యార్థులు నన్ను, నా ప్రవర్తనను వేళాకోళం చేసి ఏడిపించేవారు. ఒక సారి నేను అమ్మాయిలా ప్రవర్తిస్తానని మూకుమ్మడిగా ఏడిపించారు. ఏడుపొక్కటే తక్కువ".

"ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయేవాడిని. ఇంటికి వెళ్లి ఒంటరిగా నాలో నేను మధన పడుతూ ఉండేవాడిని".

‘నేనేదో తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనే ఆత్మాన్యూనతా భావంతో బాధ పడుతూ ఉండేవాడిని’ అని చెప్పారు.

Image copyright Getty Images

"ఒక సారి పరీక్షల సమయంలో నేను ఉదాసీనంగా ఉండటం చూసి నా తల్లి తండ్రులు ఏమి జరిగిందని నన్ను ప్రశ్నించారు. కానీ నా బాధను వాళ్ళతో పంచుకోలేకపోయాను. ఇప్పటికీ నా తల్లితండ్రులకు నా గురించి తెలియదు".

నా మనసులో జరుగుతున్న అంతర్మథనాన్ని ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాదు. ఏమి చెబితే ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం. నేను ఐఐటీ అనే ఒక విశాల ప్రపంచంలోకి వచ్చేవరకు, అలా భయంతోనే బతకాల్సి వచ్చింది.

తాను మాత్రమే కాదు, తన లాంటి వాళ్ళు మరెంత మందో ఉన్నారని ఇక్కడకి వచ్చాకే తెలిసింది అంటాడు కృష్ణ.

తన లోపల జరుగుతున్న సంఘర్షణకు టెక్నాలజీ ముందుగా సహాయ పడిందని, తాను ఎల్జీబీటీలకు సంబంధించిన యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టి, ఇదంతా సహజమే అనే విషయాన్ని తెలుసుకున్నానని తెలిపారు.

నెమ్మదిగా కొంత మంది స్నేహితులు చెప్పగా విని ఐఐటీలలో తమ కోసమే ఉన్న గ్రూప్‌లలో చేరానని చెప్పాడు.

ఇక్కడ చేరిన తర్వాత నెమ్మదిగా తనకి కాస్త ఆత్మ స్థైర్యం వచ్చిందని వివరించాడు.

తన తోటి ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌లకి, పార్టీలకు వెళుతూ ఉంటానని ఇప్పుడు తనకి చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.

Image copyright Getty Images

"అందం వేరు, ఆకర్షణ వేరు. ఒక అమ్మాయి అందంగా తయారు అయితే అందంగా ఉన్నావని మెచ్చుకుంటాను. అంత మాత్రం చేత నాకు తన పై ఏమీ శారీరక ఆకర్షణ ఉండదు", అని అంటాడు కృష్ణ.

అయితే చట్టం ఈ విషయాన్ని ఇంకా నేరంగా పరిగణించటం వలన తాము స్వేచ్ఛగా తిరిగే అవకాశం కోల్పోతున్నామని విచారం వ్యక్తం చేశారు.

తన గురించి ఇప్పటికి కేవలం తన అన్నయ్యకి మాత్రమే తెలుసనీ, ఇంటిలో ఇంకా తెలియదని చెప్పారు.

తెలియని వయస్సులో తన మరదలిని పెళ్లి చేసుకుంటానని ఇంటిలో చెప్పినప్పటికీ , ఒక్క సారి తన గురించి తాను తెలుసుకున్న తరువాత, అసలు కారణం చెప్పకుండా పెళ్లి చేసుకోను అని మాత్రమే చెప్పానని చెప్పాడు.

నాకు తెలిసిన ఇద్దరు స్నేహితులు తల్లి తండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకుని విడాకుల వరకు వచ్చే పరిస్థితిలో ఉన్నారని, నిజాలు దాచి మరొకరి జీవితాన్ని తమ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కడైనా మాకు అవకాశం ఉంటుందా? సెక్షన్ 377 ని సడలించి స్వలింగ సంపర్కాన్ని న్యాయబద్ధం చేస్తే మేము కూడా అన్ని రంగాలలో మిగిలిన వారిలాగే ఏ భయం లేకుండా ముందుకు దూసుకుని వెళ్లగలమని అభిప్రాయం పడ్డారు.

Image copyright Getty Images

"మాకేమి ప్రత్యేక హక్కులు అక్కరలేదు. కేవలం మా శారీరక అవసరాలను ఒక నేరం గా చూసే పద్దతిని మానుకుంటే చాలని కృష్ణ కోరుతున్నారు.

మమ్మల్ని సమాజంలో ఒక భాగం గా చూస్తే తాము ఏ విధమైన ఒత్తిడి లేకుండా జీవించగలమని అన్నారు.

ఇప్పుడు అందరికి తెలియడం ద్వారా తన తల్లి తండ్రులకు కూడా తెలుస్తుందేమో అని ప్రశ్నిస్తే, ఎలాగో ఒకలా ఎపుడో ఒకప్పుడు తెలియాలి కదా అని , ఇలాగే తెలుసుకుంటే మంచిది అని అన్నాడు.

మే 14న 20 మంది ఐఐటీకి చెందిన విద్యార్థులు ఐపీసీ సెక్షన్ 377ని క్రిమినల్ నేర పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ సెక్షన్ కింద స్వలింగ సంపర్కం , స్త్రీ, పురుషుల మధ్య అసహజ సెక్స్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తుంది.

ఐఐటీలో ఉన్న గే, ట్రాన్సజెండర్, బైసెక్సువల్ వర్గాలకు చెందిన ప్రవ్రిత్తి అనే గ్రూప్ కి చెందిన సభ్యులు ఈ పిటిషన్ వేశారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)