ఫిట్‌నెస్ ఛాలెంజ్: సవాల్ విసిరిన కోహ్లీ... స్వీకరించిన మోదీ!

  • 24 మే 2018
యోగా చేస్తున్న మోదీ Image copyright Getty Images

కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అథ్లెట్లు ట్విటర్‌లో ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నారు. వ్యాయామం చేస్తూ వీడియోలు తీసి పోస్టు చేస్తున్నారు. వాళ్లు మరికొందరికి సవాల్ విసురుతున్నారు.

తాజాగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రధాని మోదీ కూడా ప్రకటించారు.

క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పుష్-అప్స్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసి.. "ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కూడా వ్యాయామం చేస్తూ ఫొటోలు, వీడియోలను #FitnessChallenge అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో మీ స్నేహితులతో పంచుకోండి" అంటూ ట్వీట్ చేశారు.

ఇదిగో నా వీడియో.. అంటూ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌లకు సవాల్ చేశారు.

ఆయన సవాల్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.

మంత్రి సవాల్‌ను స్వీకరించిన కోహ్లీ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలాగే.. తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోహ్లీ సవాల్ విసిరారు.

అందుకు స్పందించిన ప్రధాని మోదీ.. "మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్! త్వరలోనే నా వీడియోను షేర్ చేస్తాను" అని ట్వీట్ చేశారు.

అయితే, కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరించిన మోదీకి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరో ఛాలెంజ్ విసిరారు.

"విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని స్వీకరించడం చాలా సంతోషం. మీకు నేను మరో సవాలు చేస్తున్నాను: ఇంధన ధరలు తగ్గించండి. లేదంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంది. మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాను" అని రాహుల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో #fitnesschallenge అనే హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించారు. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తాను పుష్- అప్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

తాను ఫిట్‌గా ఉండటానికి కారణం యోగానే అని మరో మంత్రి పీయూష్ గోయల్ తాను యోగా చేస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు సారధి మిథాలీ రాజ్ కూడా తాను ఓ వీడియోను పోస్ట్ చేశారు.

తాను పుష్ అప్స్ చేస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన స్నేహితులకు సవాల్ చేశారు.

కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సవాల్‌కు స్పందించిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పొద్దున్నే వీధిలో సైకిల్ తొక్కుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)