ప్రెస్‌రివ్యూ: ఈరోజే క్వాలిఫయర్ 2 మ్యాచ్.. గెలవకుండానే ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా!?

  • 25 మే 2018
Image copyright Getty Images

హాట్ స్టార్ యాప్‌లో తాజాగా వచ్చిన ఓ ప్రోమో హాట్ టాపిక్‌గా మారింది. రెండో క్వాలిఫయర్ జరగకుండానే ఫైనల్లో చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయంటూ ఓ ప్రోమో హాట్‌స్టార్‌లో ప్రసారం కావడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు అనుబంధ సంస్థలో ఇలాంటి ప్రకటన రావడంతో మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్వాలిఫయర్‌1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఇంకా నాకౌట్ కాలేదు.

ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై నెగ్గిన కోల్‌కతా రెండో క్వాలిఫయర్‌లో సన్ ‌రైజర్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన టీం టైటిల్ పోరులో చెన్నైతో తలపడనుంది. కానీ, రెండో క్వాలిఫయర్ ఫలితం తేలకుండానే ఫైనల్‌లో కోల్‌కతా అనే ప్రకటన రావడంతో మ్యాచ్ ఫిక్సయిందంటూ అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నాలిక్కరుచుకున్న హాట్‌స్టార్... వెబ్‌సైట్ నుంచి ఆ వీడియోను తొలగించింది. కానీ, అధికారిక బ్రాడ్ కాస్టర్ తయారు చేసిన ప్రకటన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలకు తావిస్తోందని అభిమానులు ఆరోపిస్తున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక వాట్సప్

పోలీసుల ప్రశ్నకు మొహం చాటేసిన 'వాట్సప్'

వాట్సప్‌ మొహం చాటేసింది. ఆగంతకులు వచ్చారంటూ తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న సందేశాల జన్మరహస్యం చెప్పేందుకు నిరాకరించింది అని ఈనాడు వెల్లడించింది.

తమవద్ద అలాంటి సమాచారం ఏదీ లేదంటూ తెలంగాణ పోలీసుశాఖ ఈమెయిల్‌కు బదులిచ్చినట్లు తెలిసింది.

ఇంత గందరగోళానికి కారణమైన వాట్సప్‌ సందేశం పుట్టుపూర్వోత్తరాలపై పోలీసులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

థాయ్‌లాండ్‌లో నాలుగేళ్ళ క్రితం చక్కర్లు కొట్టిన సందేశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది.

2014లో థాయ్‌లాండ్‌లో ఇలాంటి సందేశమే బెంబేలెత్తించింది. చిన్నపిల్లల శరీరాలను కోసి అవయవాలను ఎగుమతి చేసే ముఠాలు సంచరిస్తున్నాయని చెబుతూ దానికి సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో మతిస్థిమితంలేని ఒక యువతిని స్థానికులు నిర్భందించారు. తాను పిల్లల్ని కిడ్నాప్‌ చేస్తానని ఆమె చెప్పడంతో ప్రజలు హడలిపోయారు.

ఇదే విషయాన్ని విశాఖపట్నంలో పోలీసు ఒకరు సిబ్బందిని అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో తమ వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టుకున్నారు. తదుపరి విచారణలో ఆ యువతికి మతిస్థిమితంలేదని తేలింది.

ఈలోపే సదరు పోలీసు పెట్టిన సందేశం బయటకు పొక్కింది. ఈ సందేశానికి.. థాయ్‌లాండ్‌లో పంపిణీ అయిన పిల్లలశరీరాలను కొసిన ఫొటోలను కలగాపులగం చేసి అప్రమత్తంగా ఉండాలంటూ సందేశాలు పంపడం మొదలైనట్లు ప్రాథమికంగా గుర్తించారు అని ఈనాడు తెలిపింది.

Image copyright Getty Images

'మళ్లీ మోదీ.. వద్దే వద్దు'!

దేశవ్యాప్తంగా మోదీ-వ్యతిరేకత కమ్ముకుంటోందా? వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆశాభంగం తప్పదా? ఏబీపీ న్యూస్‌-సీఎస్‌డీఎస్‌ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

''ఎన్‌డీఏకు (మోదీకి) మరో అవకాశం ఇవ్వరాదని కోరుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది'' అన్నది ఏబీపీ న్యూస్ సర్వే సారాంశం.

''ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 32 శాతం మంది మోదీకి ఓటేస్తామని చెప్పారు.

ఈ ఏడాది మొదట్లో ఇదే ప్రశ్న వేసినపుడు 34 శాతం మంది తాము బీజేపీకే ఓటేస్తామని చెప్పారని, కేవలం నాలుగునెలల వ్యవధిలో రెండు శాతం తగ్గుదల మోదీకి తగ్గుతున్న ఆదరణను సూచిస్తోందని'' సర్వే విశ్లేషించింది.

సర్వే ద్వారా 19 రాష్ట్రాల్లో 15,859 మందిని ప్రశ్నించారు. అందులో 47 శాతం మంది మోదీ సర్కార్‌కు రెండో ఇన్నింగ్స్‌కు అర్హత లేదని అభిప్రాయపడ్డారు.

39 శాతం మంది మరో అవకాశం ఇవ్వవచ్చని అన్నారు. మిగిలిన 14 శాతం మంది ఏ అభిప్రాయమూ వెల్లడించలేదు.

2013 జూలైలో జరిపిన సర్వేకు తాజా సర్వేకు చాలా పోలికలు ఉన్నాయి. ఆనాడు యూపీఏకు మరో ఛాన్స్‌ ఇవ్వాలని 39 శాతం మంది, ఇవ్వవద్దని 31 శాతం మంది పేర్కొనగా 30 శాతం మంది ఏ అభిప్రాయమూ చెప్పలేదు. అప్పట్లోలాగే ఇప్పటిలాగే తేడా 8 శాతమే. అప్పటి ఎన్నికల్లో యూపీఏ ఘోరంగా ఓడిపోయింది.

వ్యాపార (బనియా) వర్గాలపై జీఎస్టీ దెబ్బ, నోట్ల రద్దు దెబ్బ బలంగా పడ్డాయి. దేశంలో మోదీ వ్యతిరేక గాలి కూడా బలంగా వీస్తోందని, ఇది మైనారిటీల్లో మరీ ఎక్కువగా ఉందని ఏబీపీ సర్వే కూడా వెల్లడించిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

'తెలంగాణలో అడ్డదారిలో టీచర్ల బదిలీలు'!

విద్యాశాఖలో అడ్డదారి బదిలీలకు తెరలేచింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఏకంగా వందలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ గుట్టుగా ఉత్తర్వులు జారీ చేసిందని సాక్షి పేర్కొంది.

ప్రస్తుతం ఉద్యోగులకు సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. బదిలీ మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమ బదిలీల ప్రక్రియ విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది.

బుధవారం రాత్రి దాదాపు 100 మంది టీచర్లను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 150 మంది టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

ప్రస్తుతం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో అత్యధికులు అంతర్‌ జిల్లా (ఇతర జిల్లాలకు) బదిలీలు పొందగా.. మరికొందరు జిల్లా పరిధి (విత్‌ ఇన్‌ డిస్ట్రిక్ట్‌)లో బదిలీ అయ్యారు.

కాగా, అడ్డదారి బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఎస్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీఆర్‌టీయూ సంఘాల నేతలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బదిలీల రద్దుకు ఆందోళన చేస్తామని ప్రకటించారు.

జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించాయిని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మన భవిష్యత్ ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి

అమెరికాలో ప్రాణాలు తీసే పోలీసులు శిక్షల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు

కరోనావైరస్: దిల్లీలో వైద్య వ్యవస్థ విఫలమైందా.. కేజ్రీవాల్ ప్రభుత్వం టెస్టుల్ని ఎందుకు తగ్గిస్తోంది

‘యోగా, సూర్య నమస్కారాలు క్రైస్తవానికి సరిపడవు.. ఒక క్రైస్తవుడి జీవితంలో యోగాకు స్థానం లేదు’ - గ్రీకు చర్చి

కరోనావైరస్: ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లగలరా

2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా

WHO: కరోనావైరస్ నిబంధనల్లో పెనుమార్పు.. పబ్లిక్‌ ప్లేసుల్లో మాస్కుల వాడకం తప్పనిసరి - కేసుల్లో ఇటలీని దాటిన భారత్

వీడియో: కరోనావైరస్‌ - ఆహారం కరువై గ్రామాలకు వలస వెళ్తున్న ఏనుగులు

మాస్క్ పెట్టుకోలేదని ఓ వ్యక్తి గొంతుపై మోకాలు పెట్టి కూర్చున్న పోలీసు : ప్రెస్ రివ్యూ