అభిప్రాయం: భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?

  • ఫరాహ్ నఖ్వీ
  • బీబీసీ కోసం
భారత జాతీయ జెండాతో ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ముస్లింల జనాభా 17.2 కోట్లు. ఇది స్పెయిన్, ఇటలీ, బ్రిటన్‌ల మొత్తం జనాభాతో సమానం. ప్రపంచంలో అత్యధిక ముస్లింలు జీవించే దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. భారత్‌కు చెందిన ముస్లింలలో కనిపించే వైవిధ్యం మరే దేశంలోని ముస్లింలలోనూ కనిపించదు.

గత 1400 ఏళ్లలో భారతీయ ముస్లింలు దేశంలోని అన్ని రంగాల్లోనూ ఉమ్మడి చరిత్రలో భాగమై జీవించారు. ప్రపంచంలోని ముస్లింలంతా ఒకటే అని ఇస్లాం భావిస్తుంది. అంటే దీనిని పాటించే వాళ్లంతా ఒకటే అని అర్థం. కానీ భారతీయ ముస్లింలు వేర్వేరు శాఖలుగా చీలిపోవడాన్ని చూస్తే అది ఇస్లాం మౌలిక సూత్రాలకే భిన్నంగా కనిపిస్తుంది. భారత్‌లో ముస్లింలు.. సున్నీలు, షియాలు, బోహ్రాలు, అహ్మదియా, ఇంకా మరెన్నో శాఖలుగా చీలిపోయారు.

ముస్లిం మతగురువులు ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోరు కానీ, వాస్తవం ఏంటంటే, భారత్‌లో ముస్లింలు కూడా హిందువుల్లాగే సామాజికంగా కులాలుగా చీలిపోయి ఉన్నారు. అగ్ర కులాన్ని అష్రఫ్, మధ్య కులాన్ని అజ్లాఫ్ అని పిలవగా, అట్టడుగున ఉన్న వారిని అర్జాల్ అని పిలుస్తారు.

భారత్‌లో ముస్లింలు భౌగోళిక దూరాలను బట్టి కూడా చీలిపోయి ఉన్నారు. వాళ్ల జనాభా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వెదజల్లినట్టుగా ఉంది. అందుకే, తమిళనాడులో ముస్లింలు తమిళం మాట్లాడుతారు. కేరళలో మలయాళం మాట్లాడుతారు. ఉత్తర భారతం నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ముస్లింలు ఎక్కువగా ఉర్దూ మాట్లాడుతారు. దాంతో పాటు వారు తాముండే ప్రాంతాన్ని బట్టి తెలుగు, భోజ్‌పురీ, గుజరాతీ, మరాఠీ, బంగ్లా భాషల్ని కూడా మాట్లాడుతారు. బెంగాల్‌లో ఉండే ముస్లిం బంగ్లా మాట్లాడుతాడు. ఒక సగటు బెంగాలీ లాగే చేపల్ని బాగా ఇష్టపడతాడు. అతడు పంజాబ్‌లో, లేదా దేశంలోని మరే ఇతర ప్రాంతంలో ఉండే ముస్లింకన్నా పూర్తిగా భిన్నంగా ఉంటాడు.

తమ పుట్టుక సమయంలోనే ఇస్లామిక్‌గా ప్రకటించుకున్న పాకిస్తాన్‌కు చెందిన ముస్లింలకు పూర్తి విరుద్ధంగా, సగటు భారతీయ ముస్లిం ఒక ప్రజాస్వామిక దేశంలో జీవిస్తున్నందుకు గర్వంగా భావిస్తాడు. రాజ్యాంగం ప్రకారం భారత్‌లోని పౌరులందరూ సమానం.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

డొనాల్డ్ ట్రంప్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు

అయితే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తోంది. ఫొటోల ద్వారా మాత్రమే వాస్తవాల్ని వర్ణించే ఈ సెల్ఫీ యుగం చేయాల్సినంత నష్టం చేసింది. నేడు భారతదేశంలోని ముస్లింలు వైవిధ్యభరితమైన తమ గుర్తింపును కూకటివేళ్లతో పెకిలించేసి, ఆ స్థానంలో అంతర్జాతీయ ముస్లిం ఐక్యతకు సంబంధించిన చిత్రాలను ముందుకు తెస్తున్నారు. ఈరోజు వారు హిజాబ్, గడ్డం, టోపీ, నమాజ్, మదర్సాలు, జిహాద్ వంటి గుర్తింపుకు చేరువవుతున్నారు. ఇలా ముస్లింలంతా ఒకలాగా కనిపించే ఇమేజ్ మనకు ప్రతి చోటా కనిపిస్తోంది. పోల్చడం ద్వారా రాజకీయాలు చేసే, ఎల్లప్పుడూ కొన్ని ప్రత్యేకమైన విషయాల్ని మాత్రమే నొక్కి చెప్పే నేతల పనిని ఈ మారుతున్న వాతావరణం మరింత సులువు చేస్తోంది.

ప్రపంచమంతటా తీవ్రవాదం తరహా జాతీయవాదాన్ని తలకెత్తుకున్న ఉద్యమాలకు గుంపుల్ని పోగు చేయాలన్నా, విజయం సాధించాలన్నా 'మరొకరు' ఎప్పుడూ కావాల్సి ఉంటుంది. వారికి వ్యతిరేకంగా వాతావరణం తయారు చేయాల్సి ఉంటుంది. వారికి వ్యతిరేకంగా జనాల్ని రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. చారిత్రకంగా చూస్తే ఇలాంటి ఉద్యమాలకు యూదులు, నల్లజాతివారు, జిప్సీలు, వలసదారులు లక్ష్యంగా ఉంటూ వచ్చారు. అయితే భారత్‌లో హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకురావడం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే, ముస్లింలు ఒంటరై పోతున్నారు. వారిని వేరు చేస్తున్నారు.

ఈ విద్వేషపు వాతావరణానికి మూలాలు కూడా భారత్‌లోనే ఉన్నాయి. మన వలసవాద చరిత్రలోనే ముస్లింల పట్ల ద్వేషానికి బీజాలు పడ్డాయి. నేడు మొత్తం ప్రపంచంలోనే ఇస్లాంకు వ్యతిరేకంగా భయం, ద్వేషంలతో కూడిన వాతావరణం తయారైంది. కాబట్టి భారత్‌లో కూడా జాతీయవాదం పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడంలో రాజకీయ సౌలభ్యం ఏర్పడింది. ఇదొక కొత్త యుగపు పోరాటం. ట్విటర్‌లో హూంకరిస్తున్నట్టు కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

సచార్ కమిటీ రిపోర్టుతో మొదలైన చర్చ

అయితే, భారతీయ ముస్లింల కష్టాలు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతోనే మొదలు కాలేదు. అవి చాలా ముందుగానే మొదలయ్యాయి. ప్రగతికాముక భారత రాజ్యాంగ హామీలు వన్నె కోల్పోయే క్రమం చాలా ముందుగానే మొదలైంది. కులం, మతం పేరుతో సమాజంలో అంతరాలు బహిరంగంగా కనిపించడం ఎప్పుడో మొదలైంది. ఈ అంతరాలు సమాజంలో ముందు నుంచే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ కుల, మత అంతరాలు మన సామాజిక డీఎన్‌ఏలోనే అంతర్భాగం.

మునుపటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లింల పట్ల దయాభావం చూపాయి గానీ అవి వారిని నిర్లక్ష్యం కూడా చేశాయి. మునుపటి ప్రభుత్వాలు కూడా ముస్లింల పట్ల వివక్ష చూపాయి. ఈ పార్టీలు, ప్రభుత్వాలు ముస్లింలను ఓట్లు అడుగుతూ వచ్చాయి కానీ సమానత్వం, న్యాయం, అభివృద్ధి వంటివి వారికి ఇస్తామని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. పైగా ముస్లింలను ఎల్లప్పుడూ వారి మతం పేరుతోనే రెచ్చగొట్టాయి. ఆపై, మీ మత గుర్తింపును కాపాడుతామనే హామీలిస్తూ ఓట్లు అడిగేవి. ఈ క్రమంలో ముస్లిం సమాజపు అభివృద్ధి గిడసబారిపోయింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆధునికత వంటి వాటిలో భారతీయ ముస్లింలు మిగతా వారికన్నా వెనుకబడుతూ వచ్చారు.

2006లో వెలువడిన సచార్‌ కమిటీ రిపోర్టు మొట్టమొదటిసారిగా ముస్లింల స్థితిగతులపై ప్రమాద ఘంటిక గట్టిగా మోగించింది. ఈ రిపోర్టు వచ్చాకే ముస్లిం సమాజంలో వెనుకబాటుతనంపై చర్చ మొదలైంది. ముస్లింలను ఒక మత-సాంస్కృతిక సమూహంగా చూడకుండా, వారి అభివృద్ధిపై చూపు సారించారు. ఈ చిత్రం చాలా భయంకరమైంది.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

దళితులు, ఆదివాసుల తర్వాత మూడో స్థానంలో ముస్లింలు

2001 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలలో అక్షరాస్యత కేవలం 59.1 శాతంగా ఉంది. ఇది భారత్‌లోని మరే ఇతర సామాజిక గ్రూపుతోకన్నా చాలా తక్కువ. 2011 జనాభా లెక్కలలో ముస్లింల అక్షరాస్యత 68.5 శాతంగా నమోదైంది. అయితే ఇప్పటికీ భారత్‌లోని ఇతర సముదాయాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 6-14 ఏళ్ల వయసున్న 25 శాతం ముస్లిం పిల్లలు స్కూలు ముఖమైనా చూడలేదు లేదా వారు మొదట్లోనే స్కూలు మానేశారు. దేశంలోని పేరున్న కాలేజీల్లో కేవలం 2 శాతం ముస్లింలే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకుంటారు.

ముస్లింలకు ఉద్యోగాలు కూడా చాలా తక్కువ లభిస్తాయి. సగటు తలసరి ఖర్చులో కూడా వారిది జాతీయ సగటుకన్నా చాలా తక్కువ. అత్యున్నత స్థాయి ప్రభుత్వ సేవల్లో ముస్లింల ఉనికి దాదాపు లేదని చెప్పొచ్చు. దేశ జనాభాలో ముస్లింలు 13.4 శాతం ఉండగా, ఐఏఎస్‌లలో వారి శాతం కేవలం 3, విదేశీ సేవలో 1.8, ఐపీఎస్ అధికారుల్లో వారి శాతం 4 కన్నా తక్కువే.

సచార్‌ కమిటీ రిపోర్టు వెలువడ్డ తర్వాత కూడా రాజకీయ వాగ్దానాలు బాగానే చేశారు. కానీ నిర్దిష్ట ఫలితం ఏదీ రాలేదు. సచార్‌ కమిటీ సిఫారసులను ఏ మేరకు అమలు చేశారు, ముస్లింల స్థితిగతుల్లో ఏ మేరకు మార్పులు వచ్చాయి, వంటి వాటి అధ్యయనం కోసం 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కుండూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిపోర్టులో మరింత దయనీయమైన సమాచారం వెలువడింది. సచార్‌ కమిటీ రిపోర్టు వచ్చాక కూడా భారతీయ ముస్లింల స్థితిగతుల్లో లేశమాత్రంగా కూడా మార్పు రాలేదు. ముస్లింలలో పేదరికం దేశ సగటుకన్నా ఎక్కువ. ముస్లిం సముదాయంలో ఆదాయం, ఖర్చు, వినియోగాల విషయానికొస్తే, వారు దళితులు, ఆదివాసుల తర్వాత మూడో స్థానంలో ఉన్నారు. పరిస్థితులు ఇలా ఉండగా, 2014 సాధారణ ఎన్నికలకు ముందు మతతత్వ హింసకు సంబంధించిన ఘటనలు పెరిగాయి.

ముస్లిం రిజర్వేషన్ల కోసం నిరసన

ఫొటో సోర్స్, Getty Images

జోస్యం చెప్పినట్టుగా రుజువైంది

మత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగస్వామ్యానికి సంబంధించన గణాంకాలు వెల్లడి చేయడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలు ఎంత మంది ఉన్నారో చెప్పలేం కానీ వారి శాతం 4 కన్నా ఎక్కువ లేదని కుండూ కమిటీ వెల్లడి చేసింది.

ముస్లిం సమాజపు అభివృద్ధి, భద్రతల విషయాల్లో కుండూ కమిటీ తన రిపోర్టులో చెప్పిన విషయాలు జోస్యం చెప్పినట్టుగా రుజువయ్యాయి. కమిటీ తన నివేదిక చివరలో ఇలా రాసింది, "ముస్లిం అల్పసంఖ్యాకుల అభివృద్ధి వారి భద్రత పునాదిపై జరగాలి. కృత్రిమ ధృవీకరణకు అంతం పలుకుతామని చెప్పే జాతీయ రాజకీయ హామీని అమలులోకి తేవడం ద్వారా మనం వారిలో నమ్మకాన్ని పాదుకొల్పాలి."

ఇది అక్షరాలా భవిష్యవాణి చెప్పినట్టుగా రుజువైంది.

2014లో ప్రభుత్వం మారిన తర్వాత దేశంలో పరిస్థితే పూర్తిగా మారిపోయింది. ముస్లింల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు వారి పిల్లలు స్కూలు మానెయ్యడం గురించి గానీ, వారి ఆదాయాలు పడిపోతుండడం గురించి గానీ మాటమాత్రంగా కూడా ప్రస్తావించరు. వారి ప్రాణాలను, స్వతంత్రతనూ కాపాడడం గురించి, వారికి న్యాయం అందజేసే విషయం గురించి చర్చ జరుగుతుంది. 2014 తర్వాత ముస్లింలపై విద్వేషపూరిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముస్లింలను కొట్టి చంపడం, ఇలాంటి ఘటనల వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఏ మాత్రం సిగ్గు పడకుండా వీటిపై విజయోత్సవాలు జరుపుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

ఇది గుంపు రాజ్యం

ముస్లిం అయినందుకు లేదా ముస్లిం లాగా కనిపించినందుకు జనాలపై బస్సుల్లో, రైళ్లలో, హైవేలపై దాడులు జరిగాయి. ఆవు మాంసం తీసుకెళ్తున్నట్టుగా అనుమానం కలిగినంత మాత్రానే వారిని పట్టుకొని కొట్టిన ఘటనలు జరిగాయి. వ్యాపారం రీత్యా పశువులను మేళాల లోంచి చట్టబద్ధంగా కొని తీసుకెళ్లే వారిపై కూడా దాడులు జరిగాయి. నిజానికి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న భారతదేశంలో పశువుల వ్యాపారం చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఇది గుంపు రాజ్యం. చట్టబద్ధమైన రాజ్యం కాదు మరి.

ఇలాంటి ఘటనలన్నింటిలోనూ పోలీసులు వ్యవహరించే తీరు పక్షపాతంతోనే ఉంటుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇలాంటి దౌర్జన్యాలకు గురైన బాధితులపైనే పోలీసులు గోరక్షణ చట్టం కింద (భారత్‌లోని 29 రాష్ట్రాలకు గాను 24 రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం ఉంది) కేసు నమోదు చేస్తారు. చాలా కేసుల్లో పోలీసులకు లభించే సాక్ష్యం గుంపుల అరుపులూ, కేకలే. ఒత్తిడి పెరిగినప్పుడు పోలీసులు అన్యమనస్కంగానే అనుమానితులపై కేసు నమోదు చేస్తారు. నిజానికి పోలీసుల వద్ద కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉంటాయి. విద్వేషపూరిత హింసకు గురై చనిపోయిన, గాయపడిన వారు కళ్లెదుట ఉన్నా పోలీసులు కేసు నమోదు చేయడానికి తటపటాయిస్తారు.

భారత్‌లో అల్పసంఖ్యాకులపై హింస కొత్త విషయమేమీ కాదు. కానీ ఇలాంటి ఘటనలు సాధారణంగా మారిపోవడం, వీటిపై ప్రభుత్వం పూర్తిగా మౌనం వహించడం మాత్రం కొత్త విషయమే. మొదట్లో ఒకటీ, అరగా జరిగే ఘటనలు ఇప్పుడు రోజువారీగా జరిగే ఘటనలుగా మారిపోయాయి.

పెళ్లి వేడుకలో ముస్లిం యువతి

ఫొటో సోర్స్, Getty Images

విద్వేష పూరిత వ్యాఖ్యలు సర్వ సాధారణం అయిపోయాయి

మరోవైపు జనంలో మరో తరహా ప్రచారం మొదలుపెట్టారు. హిందూ అమ్మాయిలను మభ్యపెట్టి, వారిని ముస్లింలుగా మార్చి ఉగ్రవాద కార్యకలాపాల్లో వారిని భాగం చేయాలనే అంతర్జాతీయ కుట్రలో ముస్లిం యువకులు భాగమయ్యారనేదే ఆ ప్రచారం. హిందూ మితవాదులు దీనిని 'లవ్ జిహాద్' అని అంటున్నారు. ఈ సంస్థలకు చెందిన వ్యక్తులు యువ జంటలపై బాహాటంగానే దాడులకు పాల్పడుతున్నారు. ముస్లిం పురుషులను పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయిలు జిహాదీ ఫ్యాక్టరీలో భాగమయ్యారంటూ వారిపై కేసులు కూడా పెట్టారు.

ముస్లింలకు వ్యతిరేకంగా అధికార బీజేపీ నేతలు, మంత్రులు విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికీ కొత్తగా అనిపించడం లేదు. భారత దేశాన్ని హిందువుల నుంచి లాక్కోడానికే ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని ఒక రాజస్థాన్ ఎమ్మెల్యే అన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా ముస్లిం కుటుంబాలను ఆపాలని ఆ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంత్రి కూడా ముస్లింలపై మాటల దాడి చేశారు. ఓటర్ల ముందు ఇప్పుడు రెండు దారులే ఉన్నాయన్న ఆయన, వారు రామజాదే (హిందువులు)ను ఎంచుకోవాలి, లేదంటే హరాంజాదే (ముస్లింలు)ను ఎంచుకోవాలని అన్నారు. ఇలాంటి విద్వేష పూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏర్పడిన చట్టాన్ని క్రమంగా పట్టించుకోవడం మానేశారు.

నమాజ్ చేస్తున్న ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

ద్వేషిస్తూ, దాడులు చేయటంతోనే జనం సంతోషిస్తారు!!

ఇది చూస్తుంటే ముస్లింలకు వ్యతిరేకంగా అన్ని ప్రత్యామ్నాయాలూ తెరిచినట్టుంది. పుస్తకాలను తిరగరాస్తున్నారు. రహదారుల పేర్లు మార్చేస్తున్నారు. చరిత్రను బహిరంగంగా కొల్లగొడుతున్నారు. చక్రవర్తులు మంచి వాళ్లయినా, చెడ్డవాళ్లయినా, వాళ్లు ముస్లింలా, హిందువులా అనేదే చూస్తున్నారు. ముస్లిం ఉపాధి కోరినా, న్యాయం కోరినా, మాల్‌లోకి వెళ్లినా, రైల్లో వెళ్లినా, ఇంటర్నెట్‌లో చాటింగ్ చేసినా, జీన్స్ వేసుకున్నా లేక తను ముస్లిం అని చెప్పుకున్నా, తమ ప్రజాస్వామ్య హక్కులు కోరడం కూడా వారికి ప్రమాదకరం కావచ్చు. వాళ్లపై సోషల్ మీడియాలో ట్రోల్ కావచ్చు. జనం వారిపై దాడి కూడా చేయచ్చు.

ఇదంతా ఎందుకు, ఈ మంటలు ఎలా రేగుతున్నాయి.

దీనికి ఒక సమాధానం. భారతీయ సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి. ఆక్స్‌ఫామ్ ప్రపంచ అసమానతల నివేదిక 2018 ప్రకారం భారతదేశంలోని ఒక శాతం ప్రజల దగ్గర దేశంలోని 58 శాతం సంపద చిక్కుకుని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో విశ్వాసం ఎలా ఏర్పడుతుంది.

ఈరోజు దేశంలో మూడు కోట్ల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. 2018 మేలో పరీక్ష ఫలితాలు రావడంతో ఇప్పుడు నిరుద్యోగుల బ్యాచ్ మరొకటి బయటికొచ్చింది. మరో షాక్ ఇచ్చింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధి ఆశలు తక్కువే కనిపిస్తాయి. అలాంటప్పుడు ఇతరులను ద్వేషిస్తూ, వారిపై దాడులు చేయడంతోనే జనం సంతోషిస్తారు. ముఖ్యంగా దేశ ప్రయోజనాల కోసమే మీరిది చేస్తున్నారని అన్నప్పుడు, ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇక లక్ష్యం భారతదేశాన్ని విభజించిన, భారత్‌కు అతిపెద్ద శత్రువు అయిన, పాకిస్తాన్‌ ముస్లింలతో సంబంధం ఉన్న ఆ జీహాదీ ముస్లిమే అయితే, ఇంకేం చెప్పగలం.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభలో ఇప్పటివరకూ ముస్లింల అతి తక్కువ ప్రాతినిథ్యం ఇదే

పాలకులు దాడి చేస్తున్న వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినపుడు ఇది మరింత బలంగా అవుతుంది. హిందుత్వవాద భావజాలం కూడా ఇలాంటి దాడులు చేసేలా పురికొల్పుతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వం అదే హిందూవాద భావజాలాన్ని నమ్ముతుంది. దాని ప్రకారం దేశంపై మొదటి హక్కు హిందువులదే, మిగతా వారంతా తల వంచుకుని ఉండాలి, ఏం చెబితే అది చేయాలి.

భారతీయ ముస్లింలకు అతిపెద్ద దెబ్బ, రాజకీయంగా వారి ఓట్లకు ప్రాధాన్యం లేకుండా పోతుండడమే. 2014లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకుండా బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఇలా, పూర్తి ఆధిక్యం సాధించిన ఒక పార్టీకి లోక్‌సభలో ముస్లిం ఎంపీనే లేకపోవడం అనేది భారత దేశంలో మొదటిసారి జరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 4 శాతం ముస్లిం ఎంపీలే ఎన్నికయ్యారు. దేశంలో 14.2 శాతం ఉన్న ముస్లిం జనాభా నిష్పత్తి ప్రకారం లోక్‌సభలో ఇప్పటివరకూ ముస్లింల అతి తక్కువ ప్రాతినిథ్యం ఇదే.

భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా 19.2 శాతం. కానీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. అయినా చాలా సులభంగా ఆ పార్టీ ఆధిక్యం సాధించింది. కాషాయం ధరించే యోగిని ఆ పార్టీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినపుడు ముస్లింలకు పుండుపై కారం చల్లినట్టు అనిపించింది. యోగిపై ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో కులమతాల పేరుతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన (ఐపీసీ సెక్షన్ 153A) ఆరోపణ కూడా ఉంది.

ప్రార్థనలు చేస్తున్న ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

ముస్లింలు కేవలం భారతదేశ గత స్మృతులే కాదు

మెజారిటీ ప్రకారం ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటారో, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు పంపకాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, చట్టబద్ధమైన పాలన, నిష్పక్ష మీడియా లాంటి వ్యవస్థలు ఉండవు. ఇలాంటి చోట మైనారిటీల కష్టాలు పెరుగుతాయి. ఈ పరిస్థితులు మెజారిటీ వర్గాలను నిరంకుశత్వం వైపు తీసుకెళ్తాయి. ఈరోజు కూడా భారత రాజ్యాంగం దేశ పౌరులకు అతిపెద్ద రక్షణగా నిలుస్తోంది. కానీ, ఒక ప్రతిపాదిత చట్టం, మతాలకు అతీతమైన దేశంలో పార్లమెంటు పునాదులను బలహీనం అయ్యేలా చేయగలదు. ప్రతిపాదిత పౌరసత్వం (సవరణ) బిల్లు 2016లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, చివరికి క్రైస్తవులకు కూడా భారత పౌరసత్వం ఇవ్వడం గురించి ప్రస్తావించారు. కానీ ఈ దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంపై మాత్రం నిషేధం విధించాలన్నారు.

ఈ విద్వేషంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కానీ ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రస్తుత మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానితోపాటూ భారతీయుల ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న మైనారిటీలు ముఖ్యంగా మైనారిటీ ముస్లింలు కేవలం భారతదేశ గత స్మృతులే కాదు, దాని ప్రజాస్వామ్య భవిష్యత్తుకు కూడా అవసరమే. ఈ అంశాన్ని అవగతం చేసుకుని సుదీర్ఘ కాలంగా ఉన్న నిశ్శబ్దాన్ని భారతదేశం పటాపంచలు చేస్తుందనే ఆశ ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)