#గమ్యం: బార్క్‌లో సైంటిస్టు అయితే మీ భవిత బంగారమే

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
బార్క్‌లో ఉద్యోగం సంపాదించడం ఎలా?
ఫొటో క్యాప్షన్,

ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్సుడ్ రిసెర్చ్ (ఐసీఏఆర్)

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఎలా అనే దానిలో భాగంగా గతవారం డీఆర్‌డీవోలో సైంటిస్టు (బి) ఉద్యోగ ప్రకటన వివరాలపై చర్చించాం. ఈ సిరీస్‌లో భాగంగా ఈ వారం భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) లో సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్లుగా స్థిరపడాలంటే ఏ పరీక్షలు రాయాలి, ఎలా సిద్ధం కావాలి, ఏయే అర్హతలుండాలి... ఇవన్నీ వివరిస్తున్నారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ.

మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

వీడియో క్యాప్షన్,

#గమ్యం: బార్క్‌లో ఉద్యోగం పొందడం ఎలా?

భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) అనేది ప్రధానంగా పరిశోధనకు ఉద్దేశించిన సంస్థ. అందువల్ల ఈ సంస్థలో ఎక్కువమంది సైంటిస్టులే ఉంటారు. వీరికోసం అవసరమైన మిగిలిన సిబ్బంది (వైద్యులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, ఇతరులు) ఉంటారు. ఇతర సిబ్బందిని భర్తీ చేయాలంటే దానికోసం ఓ ప్రకటన జారీ చేస్తారు, పరీక్ష పెడతారు. దాని ద్వారానే ప్రవేశాలు జరుగుతాయి.

కానీ సైంటిస్టు ఉద్యోగాల్లో ప్రవేశాలకు మాత్రం స్పష్టమైన ప్రక్రియ ఉంది. దీనికి ప్రతి సంవత్సరం ప్రకటన వెలువడుతుంది. బార్క్‌లో సైంటిస్టుగా ఉద్యోగం సంపాదించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి గేట్ స్కోరు, రెండోది బార్క్ నిర్వహించే ప్రవేశ పరీక్ష.

బార్క్‌లో శాస్త్రవేత్తగా ప్రవేశించాలంటే రెండు రకాల మార్గాలున్నాయి.

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఒక సంవత్సరంపాటు అందించే ఓరియెంటేషన్ కోర్సు
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారికి రెండేళ్ల ఫెలోషిప్ కోర్సు

ఈ రెండింటికీ ప్రవేశ పరీక్ష ఒక్కటే. మీ ఆసక్తి, పరిజ్ఞానం, ఇంటర్వ్యూలో మీ ప్రతిభ ఆధారంగా ఈ కోర్సుల్లో మీకు ప్రవేశం కల్పిస్తారు.

ఫొటో క్యాప్షన్,

హోమీ భాభా నేషనల్ ఇన్‌స్టిట్యూట్

ఎంపికైనవారికి ముంబయి, కల్పకం, ఇండోర్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న బార్క్ శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ ఉంటుంది. సంవత్సరం పాటు ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్, రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సుడ్ టెక్నాలజీస్ వంటి దేశవ్యాప్తంగా ఉన్న 12 సంస్థల్లో ఎక్కడైనా శాస్త్రవేత్తగా అవకాశం కల్పిస్తారు.

శిక్షణ పూర్తైన తర్వాత మూడేళ్లపాటు బార్క్‌లో పనిచేసేందుకు ముందుగానే ఒప్పందపత్రం (రూ. 4.3 లక్షల విలువైన ఇండెమ్నిటీ బాండ్) సమర్పించాల్సి ఉంటుంది.

రెండేళ్ల కోర్సు పూర్తి చేసినవారికి మరో అద్భుత అవకాశం ఉంది. ఒకవేళ గేట్‌లో మంచి స్కోరు సాధించి, ఐఐటీ వంటి మంచి విద్యాసంస్థలో ఎంటెక్ ప్రవేశం లభిస్తే దానికి కూడా ఈ ఫెలోషిప్‌తో పాటు ప్రత్యేక అలవెన్స్ ఇస్తారు.

ఎంపికైనవారికి రూ.35000 నెలకు స్టైపెండ్, రూ.10000 పుస్తకాలకు ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత మూడేళ్లపాటు బార్క్‌లో పనిచేసేందుకు ముందుగానే ఒప్పందపత్రం (రూ. 8.7 లక్షల విలువైన ఇండెమ్నిటీ బాండ్) సమర్పించాల్సి ఉంటుంది.

ఐటీలో ఇంజనీరింగ్ చేసినవారికి దీనిలో ప్రవేశాలు లేవు. దరఖాస్తు చేసేముందు ఏ రకమైన సైంటిస్ట్ పోస్ట్‌కోసం ప్రకటన వెలువడిందో దానికి సంబంధించిన విద్యార్హతలు మీకున్నాయా లేదా అనే దానిపై స్పష్టత అవసరం.

గేట్ స్కోరు, బార్క్ ప్రవేశ పరీక్ష... రెండింటి ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 40కి పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది.

ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 3 తప్పు సమాధానాలకు 1 మార్కు కట్ చేస్తారు. రెండు గంటల సమయం ఉంటుంది. మీరు ఇంజనీరింగ్‌లో చదివిన సిలబస్ ఆధారంగానే ఈ పరీక్షలో ప్రశ్నలుంటాయి. సాధారణంగా ఇవి అంత కఠినంగా ఏమీ ఉండవు. పాత ప్రశ్నపత్రాలు కూడా బార్క్ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వాటిని తీసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు.

ప్రవేశ పరీక్షలో ఎంపికైనవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. వీటిని అత్యంత సీనియర్లైన శాస్త్రవేత్తలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ మొత్తం ప్రక్రియలో ఇదే అత్యంత కఠినమైన దశ. అతి విశ్వాసం పనికిరాదు. ఏం అడిగారు, ఏం చెప్పాలి, ఏం చెబుతున్నాం వంటి అంశాలపై స్పష్టత అవసరం.

ఈ దశ దాటారంటే మీ భవిష్యత్తుకు బంగారుబాట పడినట్లే!!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)