బీబీసీ ఇంటర్వ్యూ: ‘బాబ్రీ వద్ద హిందువులను ఆలయాన్ని కట్టుకోనివ్వండి’

బాబ్రీ మసీద్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. అందులో.. బాబ్రీ మసీదు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అంశాలపై ఆయన మాట్లాడారు.

బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు బయట మాత్రమే పరిష్కరించడం సాధ్యమవుతుందని, పురుషులు మద్యం తాగడం వల్లనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.

బాబ్రీ మసీదు వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు 62 ఏళ్ల ఈ యోగా గురువు ప్రయత్నిస్తున్నారు. హిందూ, ముస్లిం నాయకులను కూడా కలుస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

బాబ్రీ మసీదు వివాదంపై 2010లో అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీం కోర్టులో 4 సివిల్ సూట్స్ దాఖలయ్యాయి. ఈ కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతోపాటుగా జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నాజిర్‌లు విచారిస్తున్నారు.

2018 అక్టోబరులో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ విరమణ చేయనున్నారు. అయితే.. తన రిటైర్మెంట్ లోపలే ఈ కేసుపై తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి.

ఇరు వర్గాల మధ్య సంధి ప్రయత్నాలు సానుకూల ఫలితాలనే ఇస్తాయని బీబీసీ ఇంటర్వ్యూలో శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.

సంధి ప్రయత్నాల్లో భాగంగా.. తాను ఇంతవరకూ 500మంది ముస్లిం మత నాయకులు, మేధావులను కలిశానని, వారంతా తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారని రవిశంకర్ అన్నారు. కానీ కక్షిదారుల్లో ఒకరైన సున్నీ వక్ఫ్ బోర్డ్ మాత్రం.. తాము కోర్టు తీర్పును మాత్రమే అంగీకరిస్తామన్నట్లు రవిశంకర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసు తీర్పు.. ప్రజలను ఐక్యం చేయదని రవిశంకర్ అభిప్రాయపడ్డారు.

''ఈ కేసులో ఒకరు గెలిస్తే సంబరాలు చేసుకోవడం, మరొకరు ఓడితే దు:ఖపడడం అన్నది మంచిది కాదు. మేం అందర్నీ సంప్రదించాక ఓ ప్రతిపాదనను సిద్ధం చేశాం. మా ప్రతిపాదనలో ఓటమి అన్నది ఉండదు. విజయం అందరిదీ. వివాదాస్పద ప్రాంతంలో హిందువులు ఆలయాన్ని నిర్మించుకోవచ్చు, ముస్లింలు మసీదును కూడా నిర్మించుకోవచ్చు. ఇదే మా సంధి ప్రతిపాదన'' అని రవిశంకర్ అన్నారు.

రవిశంకర్ ప్రతిపాదన ప్రకారం, రామ మందిరం విషయంలో తమ దావాను ముస్లింలు ఉపసంహరించుకుంటారు. అందుకు బదులుగా.. వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించడం జరుగుతుంది.

ఈ ప్రతిపాదన పట్ల చాలా మంది సానుకూలంగా స్పందించారు. షియా ముస్లిం వర్గీయులు ఈ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికే సుముఖంగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. మరోవైపు సుప్రీం కోర్టు ఈ కేసును ఒక స్థల వివాదంగా మాత్రమే పరిగణిస్తోందన్నారు.

ఫొటో సోర్స్, AFP

150కుపైగా దేశాల్లో రవిశంకర్ ఆశ్రమ శాఖలు ఉన్నాయి. యోగా ద్వారా ఈ దేశాల్లో శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్, ఇరాక్, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వెళ్లి, అక్కడ నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కొలంబియా ప్రభుత్వం, తిరుగుబాటుదారులకు(ఎఫ్.ఎ.ఆర్.సి) మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో కూడా రవిశంకర్ పాత్ర ఉంది.

గత సంవత్సరం నుంచి అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు రవిశంకర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇరు మతాలకు చెందిన నాయకులతో మాట్లాడుతున్నారు. అయితే.. బీజేపీ.. రవిశంకర్‌ వెనక ఉండి నడిపిస్తోందన్న విమర్శలు వచ్చాయి. కానీ ఈ విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తన ప్రయత్నాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో.. రవిశంకర్ హిందువుల పక్షపాతి అన్న అనుమానం కూడా ముస్లింలకు ఉంది. ఈ అనుమానాలను ఆయన ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images

''ఇది తప్పు అభిప్రాయం. నేను ఎవరి వైపు లేను. కేవలం దేశం వైపే ఉన్నాను. ఆధ్యాత్మిక గురువులు పారదర్శకంగా ఉంటారు'' అన్నారు.

కానీ.. రవిశంకర్ బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడని కొందరు ముస్లిం వర్గీయులు భావిస్తున్నారు. అందుకే శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సంధి వ్యవహారంలో నిస్పాక్షికంగా వ్యవహరించరని వారి అనుమానం. మరోవైపు.. రామ మందిర నిర్మాణం అంశం బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉండనే ఉంది!

ఈ వివాదాస్పద నిర్మాణాన్ని ఒక మ్యూజియంగా మార్చాలని కొందరు సలహా ఇస్తున్నారు. కానీ ఈ సలహాతో రవిశంకర్ ఏకీభవిస్తారా? అలా కుదరదని ఆయన అంటున్నారు.

''మనం ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో దేవాలయం ఉంది. మసీదు ఎక్కడుంది? అక్కడ శ్రీరాముడు కూర్చుని ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని లక్షలాది హిందువులు పూజిస్తున్నారు. వారి విశ్వాసాన్ని గౌరవించాలి కదా..''

రవిశంకర్ ప్రతిపాదనకు చాలా మంది ముస్లింలు అంగీకరించవచ్చు. కానీ బాబ్రీ మసీదును హిందువులకు అప్పగిస్తే.. దేశంలోని కాశీ, మధుర లాంటి వివాదాస్పద ప్రాంతాలను తమకు అప్పగించాలంటూ హిందువులు డిమాండ్ చేస్తారేమోనని ముస్లింలు భయపడుతున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ..

''ఈ విషయాన్ని నేను కూడా విన్నాను. కానీ బాబ్రీ మసీదు డిమాండ్‌ను దయచేసి విరమించుకోండి. ఆ ప్రాంతంలో హిందువులు ఆలయాన్ని కట్టుకోనివ్వండి. అలా చేస్తే ముస్లింలు తమ స్నేహశీలతను చాటుకున్నట్లు అవుతుంది.

కాశీ, మధుర లాంటి మరిన్ని వివాదాస్పద ఆధ్యాత్మిక ప్రాంతాలను హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేసే వాళ్లను ఆపలేనని రవిశంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Art of Living

''వాళ్లను ఆపడానికి నేనెవర్ని? ఒక భరోసా ఇవ్వడానికి నేనెవర్ని? ఈ దేశంలో డిమాండ్ చేసే హక్కు అందరికీ ఉంది'' అన్నారు. కానీ.. వ్యక్తిగతంగా తాను అలాంటి డిమాండ్లను ప్రోత్సహించనని అన్నారు.

శ్రీరాముడి జన్మస్థానంగా భావించి, హిందువులు పూజించే ప్రాంతం మీదనే.. మొఘల్ చక్రవర్తి బాబర్ బాబ్రీ మసీదును నిర్మించాడని చెబుతారు.

1949లో ఈ వివాదం మొదలైంది. కానీ ఏళ్లు గడుస్తున్నా, ఈ సమస్యకు పరిష్కారం కనపడటం లేదు.

మహిళలపై అత్యాచారాలకు కారణం మద్యం : రవిశంకర్

మహిళలపై అత్యాచారాలు జరగడానికి ప్రధాన కారణం మద్యం, మత్తు పదార్థాలేనని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. దిల్లీలోని తీహార్ జైల్లో రవిశంకర్ యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు.

''అందులో.. మహిళలపై నేరాలు చేసినవారిలో 95 శాతం మంది ఆ నేరాలు చేసినపుడు మద్యం మత్తులో లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నవారే'' అన్నారు.

మహిళలపై అఘాయిత్యాలను నిరోధించడానికి సంపూర్ణ మద్య నిషేధమే మార్గమన్నారు.

''మద్యం, డ్రగ్స్‌ను నిషేధించకుండా మహిళలపై జరిగే నేరాలను అరికట్టడం అసాధ్యం.''

కానీ ఈ వాదనతో మహిళా హక్కుల ఉద్యమకారులు, 'ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్‌'కు చెందిన కవితా కృష్ణన్ విభేదించారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు మద్యం, లేదా డ్రగ్స్ కారణం అనడం సరికాదని, ఇది ప్రజల దృష్టిని మళ్లించడమేనని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

''ఏ ప్రాతిపదికన తీహార్ జైల్లోని నిందితుల గురించి మాట్లాడుతున్నారు? బహుశా తీహార్ జైల్లోని నిందితులను మద్యం బాధితులుగా చిత్రించాలన్నది వారి అభిమతమేమో! వాళ్లు చేసిన నేరాలకు మద్యాన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుంది'' అన్నారు.

మద్య నిషేధం మహిళలపై జరిగే నేరాలను నియంత్రించలేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. గుజరాత్‌లో మద్య నిషేధం మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించలేకపోయింది.

కానీ.. మహిళలపై జరుగుతున్న హింసలో మద్యం, మత్తు పదార్థాల ప్రభావం కొంతమేర ఉంటుందని సామాజిక కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. కానీ.. ఇలాంటి సందర్భాల్లో తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న ధీమా, మహిళలపై తమకు సర్వాధికారాలు ఉంటాయన్న ఆలోచనా విధానం ఈ నేరాలకు కారణమవుతోందని వాళ్లు భావిస్తున్నారు.

8 ఏళ్ల బాలికను రేప్ చేసి, హత్య చేసిన కఠువా ఘటనలో ఎవరూ మద్యం మత్తులో లేరు. ఈ సంఘటన గురించి మాట్లాడుతూ.. ఈ కేసులోని నిందితులు పిచ్చెక్కినవాళ్లు అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆధ్యాత్మిక గురువులుగా చలామణి అవుతూ మహిళలపై రేప్ చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆశారామ్, డేరా బాబాలకు అత్యాచార నేరం కింద కఠిన శిక్షలు విధించారు.

ఈ విషయమై స్పందిస్తూ.. చెడ్డవాళ్లు ఎక్కడైనా ఉంటారు. పురాణాల్లో సీతను అపహరించడానికి వచ్చిన రావణుడు కూడా సన్యాసి వేషంలోనే వచ్చాడు. వైద్యరంగంలో చాలా మంది డాక్టర్లు పేషెంట్ల కిడ్నీలు అమ్ముకుంటున్నారు. మీడియా రంగంలో కూడా డబ్బు కోసం తప్పుడు వార్తలు రాసే విలేకరులు ఉన్నట్లే ఆధ్యాత్మిక రంగంలో కూడా మోసగాళ్లు ఉన్నారు'' అన్నారు.

ఫొటో సోర్స్, Art of Living

2016లో యమునా నదీతీరంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఉత్సవాల్లో వాతావరణ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలు రవిశంకర్‌పై ఉన్నాయి. ఆ ఉత్సవాల కారణంగా 420 ఎకరాల్లోని పచ్చదనం నాశనం అయ్యిందని 7మంది శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కానీ దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన ఇద్దరు సభ్యుల కమిటీ.. రవిశంకర్‌కు క్లీన్ ఛిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది.

కానీ ఈ విషయాన్ని రవిశంకర్ ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పచ్చగా ఉందని, ఆ ప్రాంతం నాశనమయ్యిందన్న దాఖలాలే లేవు.. అని ఆయన అన్నారు.

తాను ఏ తప్పు చేయలేదని, తనంటే గిట్టని వాళ్లే వివాదాలు సృష్టిస్తున్నారని రవిశంకర్ అన్నారు.

దేశవ్యాప్తంగా నదుల ప్రక్షాళన కార్యక్రమాన్ని తాను నిర్వహిస్తున్నామన్నారు.

‘‘2009లో యమునా నదిలోనుంచి 500 టన్నుల చెత్తను బయటకి తీశాం. మొత్తం 35 నదులలో మా కార్యక్రమం సాగుతోంది'' అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)