పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర పెరుగుతుందా? తగ్గుతుందా?

  • భరత్ శర్మ
  • బీబీసీ ప్రతినిధి
పెట్రోల్ బంక్ కార్టూన్

దేశంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసేవాటిల్లో పెట్రోల్ ధర ఒకటి. పెరిగిన ఉల్లిధరలు ప్రభుత్వాల్ని కదిలించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ప్రజల్లో సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

రాజకీయ నేతల చర్చ కూడా ఇప్పుడు వీటి ధరల వైపే మళ్లింది. నరేంద్ర మోదీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ పెట్రోల్ గురించి మాట్లాడుతూ వాటి ధరలు తగ్గించమని మోదీకి సవాలు విసుర్తున్నారు.

పెరుగుతున్న పెట్రోలు ధరలపైన జోకులు కూడా విస్తృతంగా పేలుతున్నాయి. కొందరు బైక్‌కి పెడల్స్ తగిలించమని సలహా ఇస్తుంటే, ఇంకొందరు ఫుల్‌ట్యాంకు పెట్రోల్ కొట్టిస్తే దానికి బీమా చేయించమని సరదాగా అంటున్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా మోదీ, ఆయన మంత్రులు మాత్రం ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. కానీ ఆ ధరలను ఎలా తగ్గిస్తారనే దానికి మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు.

మోదీ ప్రభుత్వానికి శిరోభారం మరింత పెంచుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా స్తబ్దుగా ఉన్నాయి.

ప్రభుత్వం తలచుకుంటే ట్యాక్స్ తగ్గించి పెట్రోలు డీజిల్ ధరలను నియంత్రించొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ ఆ పని జరగట్లేదు.

ట్యాక్స్‌ గురించి మాట్లాడినప్పుడు జీఎస్టీ కూడా చర్చకు వస్తోంది. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే దానిపైన పన్ను తగ్గుతుందనీ, ఫలితంగా వినియోగదార్లకు లాభం చేకూరుతుందని కొందరు అంటున్నారు.

ఫొటో సోర్స్, IOCL

ఫొటో సోర్స్, IOCL

కానీ ఈ పన్నుల ప్రభావం గురించి మాట్లాడాలంటే అసలు పెట్రోల్‌పై పన్నులు ఏ విధంగా వేస్తారో తెలియాలి. 25-05-2018, శుక్రవారం లెక్కల ప్రకారం దేశ రాజధాని దిల్లీలో ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన పెట్రోల్ ధర లీటరకు 77.83 రూపాయలుంది.

ఈ ధరను విభజిస్తే, డీలర్లకు లీటరు పెట్రోలు 38.17 రూపాయలకు అందుతోంది. దీనికి 19.48 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ, 16.55 రూపాయల వ్యాట్ కలుస్తోంది.

ఈ మొత్తానికి 3.63 రూపాయల డీలర్ కమీషన్‌ను జోడిస్తే మొత్తం లీటరు పెట్రోలు ధర 77.83 రూపాయలకు చేరుతోంది.

ఈ ధరల ప్రభావం కాంగ్రెస్‌కే కాదు, బీజేపీ నేతలకు కూడా బాగా తెలుసు. అందుకే దీనిపై బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా స్పందించారు. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే పన్ను నియంత్రణలో ఉంటుంది కాబట్టి ధరలు కూడా నియంత్రణలో ఉంటాయని వ్యాఖ్యానించారు.

పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కానీ వ్యాట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. అందుకే ఒక్కో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌లు ఒక్కో ధరకు అమ్ముడవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం చమురు ధర ఎంత ఉందో దానిపైన విధించే పన్నులు కూడా దాదాపు అంతే ఉన్నాయి. మొదట ముడి చమురును కొనుగోలు చేసి రిఫైనరీల్లో వాటిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ రూపంలో బయటకు తెస్తారు.

ఆ తరవాత వాటిపైన పన్ను విధించడం మొదలుపెడతారు. మొదట కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్/సేల్స్ ట్యాక్స్ విధిస్తాయి.

దానిపైనే మళ్లీ పెట్రోల్ బంకుల డీలర్ తన కమీషన్‌ను జోడిస్తాడు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల్ని కలిపితే, అవి పెట్రోల్, డీజిల్‌ల అసలు ధరకు దగ్గరగా ఉంటాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే కొద్దీ వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే వ్యాట్‌ను, ఎక్సైజ్ సుంకాన్ని తొలగించి పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఏమవుతుందనే చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ నేతలు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని మాట్లాడటం మొదలుపెట్టారు.

ఒకవేళ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే సామాన్యుడికి మేలే జరగొచ్చు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నష్టపోతాయి.

ఫొటో సోర్స్, Getty Images

శుక్రవారం ధరనే పరిశీలిస్తే దిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సును తొలగిస్తే 77.83 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర 41.8 రూపాయలకు చేరుతుంది. మళ్లీ దీనికి 28శాతం జీఎస్‌టీ వేసినా అది 53.50 రూపాయలకే చేరుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ధరకంటే అది 24.33 రూపాయలు తక్కువ.

77రూపాయలు విలువైన పెట్రోల్ 53రూపాయలకే దొరికితే సామాన్యుడికి అది ఎంత ఊరట కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కానీ పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అంత తేలికేమీ కాదు. దాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలా వద్దా అనే నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే సరిపోదని ‘క్రిసిల్‌’కి చెందిన ఆర్థికవేత్త సునీల్ సిన్హా బీబీసీతో చెప్పారు.

‘ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే ఆ నిర్ణయం తీసుకోగలదు. ఆ కౌన్సిల్‌లో రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కూడా ఉంటారు. పెట్రోల్ ధరలు తగ్గిస్తామని కొందరు నేతలు హామీలిస్తున్నా, వాళ్లు కేవలం ఆ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ వరకూ మాత్రమే తీసుకెళ్లగలరు’ అని సునీల్ సిన్హా అన్నారు.

ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ వస్తే ధరలు తగ్గుతాయి కానీ అలా జరగడం కష్టం అని సునీల్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

లబ్ డబ్బు: చమురు ధర పెరుగుదలతో భవిష్యత్తు ఎలా ఉండనుంది?

‘గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు కూడా వాటి వల్ల వినియోగదారుడికి పెద్దగా మేలు జరగలేదు. ప్రభుత్వానికి వినియోగదారుడి కంటే ఎక్కువ చింత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గురించే ఉంటుంది’ అని ఆయన అన్నారు.

ఆర్థిక నిపుణులు చెప్పేదాని ప్రకారం గతంలో ఉన్న సేల్స్ ట్యాక్స్‌కు మరో పేరే వ్యాట్. దీనికి జీఎస్టీతో ఎలాంటి సంబంధం లేదు. పెట్రోల్‌పై ఎంత వ్యాట్ విధించాలన్నది రాష్ట్రాలు తమంతట తామే నిర్ణయించుకోవచ్చు. తగ్గించాలన్నా, పెంచాలన్నా అది వాళ్ల చేతుల్లో పనే!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)