ప్రెస్‌రివ్యూ: 'ఆ వార్తల్లో నిజం లేదు..తెలంగాణ రాష్ట్రంలో నిపా వైరస్ జాడలేదు’

నిపా వైరస్ బారిన పడకుండా ముక్కుకు మాస్కులు ధరించిన వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

కేరళను వణికిస్తున్న నిపా వైరస్ శుక్రవారం హైదరాబాద్‌లో కలకలం రేపిందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

కేరళకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తితోపాటు మరొకరు జ్వరంతో బాధపడుతుండడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత చర్యగా వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పూణెకు పంపించారు. అయితే వారిద్దరీకి నిపా వైరస్ లక్షణాలు లేవని, రిపోర్టు పూర్తిగా నెగిటివ్ వచ్చిందని హైదరాబాద్ జిల్లా ఎపిడమిక్, సర్వేలెన్స్ అధికారి డాక్టర్ హర్షవర్ధన్ యాదవ్ స్పష్టం చేశారు.

ఢిల్లీకి చెందిన సరాయువాహి హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వృత్తిరిత్యా ఇటీవల కేరళకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు జ్వరం రావడంతో చికిత్స కోసం ఓ కార్పొరేట్ హాస్పటల్‌కు వెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన వైద్యులు నిపా అనుమానంతో నల్లకుంటలోని ఫీవర్ హాస్పటల్‌కు రెఫర్ చేశారు.

మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్ అనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. ఆయనకు కూడా నిపా లక్షణాలున్నట్టు వైద్యులు అనుమానించారు. సమాచారం అందుకున్న డాక్టర్ హర్షవర్ధన్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో హుటాహుటిన నిమ్స్, ఫీవర్ హాస్పిటళ్లకు చేరుకుని అనుమానిత రోగుల నుంచి రక్తం, లాలాజల నమూనాలు సేకరించారు. నమూనాలను తీసుకొని కారులో పూణెకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు నివేదికలు వచ్చాయని, వారిద్దరికీ నిపా వైరస్ లక్షణాలు లేవని వెల్లడించారు. వారికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కూడా లేవన్నారు.

నగరంలో నిపా వైరస్ వ్యాపించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, పుకార్లు నమ్మొద్దని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పాజిటివ్ కేసులూ నమోదు కాలేదని స్పష్టంచేశారు. తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవన్నారు.

ఫొటో సోర్స్, ysjagan/facebook

పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు పెడతా - వైఎస్ జగన్

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారని సాక్షి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

171వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన బహిరంగ సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

''స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ సరైన విధంగా గౌరవించలేదు. పాదయాత్ర చేస్తున్న నా దగ్గరికి వచ్చిన క్షత్రియ కులస్తులు ఇదే విషయాన్ని గుర్తుచేశారు. రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం..'' అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగానే కొద్ది రోజుల కిందట కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని నిమ్మకూరులో జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images

అండమాన్‌ను తాకిన రుతుపవనాలు

మండుటెండలతో సతమతమయ్యే జనానికి చల్లటి వార్త.. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశాన్ని పలకరించబోతున్నాయి అని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోకి ఇవి ప్రవేశించాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 29న కేరళ తీరాన్ని అవి తాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోపక్క రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది.

స్మార్ట్‌ వాచీలు వద్దు!

క్రికెటర్లు, అధికారులు మైదానంతో పాటు డ్రెస్సింగ్‌ రూముల్లో స్మార్ట్‌ వాచీలు సహా ఎలాంటి సమాచార సాధనాలు వాడకుండా ఐసీసీ నిషేధం విధించిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఇప్పటిదాకా మైదానంలోకి మాత్రమే స్మార్ట్‌ వాచీలు, మొబైల్‌ ఫోన్లకు అనుమతి నిరాకరించిన ఐసీసీ ఇప్పుడు డ్రెస్సింగ్‌ రూముల్లో కూడా వాటిని వాడకూడదని ఆదేశించింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ క్రికెటర్లు స్మార్ట్‌ వాచీలు ధరించడం చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా అధికారులు.. అలాంటి వాచీలు వాడకూడదని పాక్‌ క్రికెటర్లను ఆదేశించారు. 'ఆటగాళ్లు, అధికారులు ఉండే ప్రాంతాల్లో సమాచార సాధనాలు వాడటం నిషిద్ధం. ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయిన ఎలాంటి పరికరాలను క్రీడాకారులు సదరు ప్రాంతాల్లో వాడకూడదు. ఫోన్‌కు, వై-ఫైకి అనుసంధానించి ఉన్న స్మార్ట్‌ వాచీలతో గానీ, మరే ఇతర సాధనాలతో కూడా సమాచారాన్ని స్వీకరించకూడదు. అందువల్ల.. అలాంటి పరికరాలతో పాటు తమ మొబైల్‌ ఫోన్లను మ్యాచ్‌ రోజుల్లో మైదానానికి వచ్చిన వెంటనే క్రికెటర్లు సంబంధిత అధికారులకు అప్పగించాలి' అని శుక్రవారం ప్రకటించింది. అయితే, తమ విధి నిర్వహణలో భాగంగా సహచరులతో సంభాషించేందుకు అధికారులకు ప్రత్యేక పరికరాలను వాడేందుకు అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)