గ్రౌండ్ రిపోర్ట్: ‘ఆ కేసులు వెనక్కి తీసుకోమంటున్నారు.. లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు’

  • ప్రియాంక దూబే
  • బీబీసీ ప్రతినిధి
ముజఫర్‌నగర్ అల్లర్లు, హిందు, ముస్లిం, మతఘర్షణలు
ఫొటో క్యాప్షన్,

తన తల్లిదండ్రులతో లియాకత్ అలీ ఖాన్ (కుడి చివర్న)

ముజఫర్‌నగర్ ఘర్షణలకు సంబంధించిన కేసులు ఇప్పుడు ఎందుకు వాపసు తీసుకుంటున్నారు? న్యాయం జరుగుతుందని వారికి ఉన్న ఆఖరి ఆశను కూడా ఎందుకు ఛిద్రం చేస్తున్నారు?

దళితులు, ముస్లింలకు సంబంధించిన సమస్యలపై బీబీసీ స్పెషల్ సిరీస్ కథనాల కోసం మేం ముజఫర్‌నగర్, షామలీలోని అల్లర్ల బాధిత కుటుంబాలను కలవడానికి వెళ్లాం.

ఉత్తర ప్రదేశ్ షామలీ జిల్లాలో లిసాడ్, లఖ్ బావడీ గ్రామాల నుంచి వెళ్లిపోయిన ముస్లింల జ్ఞాపకాల్లో సొంత ఇంటి ఆలోచనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.

ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగినపుడు హింసకు కేంద్రంగా మారిన ఈ రెండు గ్రామాల్లోనే ఎక్కువ హత్యలు జరిగాయి.

అల్లర్ల తర్వాత దేశంలో వివిధ ప్రాంతాలకు పారిపోయిన ఇక్కడి ముస్లింలు మెల్లమెల్లగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించడం ప్రారంభించారు.

కానీ పెద్దలు, వృద్ధుల ప్రేమ, పిల్లల అరుపులతో సందడిగా ఉండే ఇంటి ఆలోచనలు ఇప్పుడు వారి మనసులో గూడుకట్టుకున్న ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

ఫొటో క్యాప్షన్,

ఘర్షణల్లో తమ వారిని కోల్పోయిన మున్నీ, శంషాద్ దంపతులు

కాంధలాలో నివసించే శంషాద్, ఆయన భార్య మున్నీలది పిల్లా పెద్దలతో కూడిన ఒక కుటుంబం. అల్లర్లకు ముందు లిసాడ్ గ్రామంలో ఉన్న మున్నీ అత్తామామలు జరీఫన్, నబ్బూలకు తాము పెంచే జంతువులన్నా, తమ ఇల్లన్నా చాలా ఇష్టం. అందుకే అల్లర్లు జరిగినప్పుడు వాళ్లు జంతువుల గురించి భయపడి, ఇల్లు వదలడానికి ఒప్పుకోలేదని మున్నీ తెలిపారు.

లిసాడ్‌ అల్లర్లు చెలరేగిన నాలుగు రోజుల తర్వాత నరికేసిన జరీఫన్ శవం ఒక కాలువలో దొరికింది. హాజీ నబ్బూ హత్యను చూసిన ప్రత్యక్షసాక్షి ఒకరు ఉన్నారు. కానీ ఈ రోజుకూ నబ్బూ శవం ఏమయ్యిందో ఆచూకీ లేదు.

అల్లర్ల అనంతరం లభించిన పరిహారం డబ్బుతో కాంధలాలో కొత్తగా కట్టుకున్న ఇంటి బయట శంషాద్ దీనంగా కూచుని ఉన్నారు. ఇటుకల బట్టీలో పనిచేసే ఆయన ముఖం వాడిపోయి ఉంది.

చెమటను, కన్నీళ్లను తుడుచుకుని ఆయన "2013 డిసెంబర్ 7 రాత్రి, సాయంత్రం గ్రామంలో పుకార్లు మొదలయ్యాయి. ఈ రోజు ముస్లింలను ఊచకోత కోస్తామని జాట్‌లు మాట్లాడుకుంటున్నారు. చీకటి పడుతుండగా గ్రామంలో అంసార్ జులాహేని ఎవరో కత్తితో పొడిచి హత్య చేశారని చెప్పారు. అంతే నాకు ఫోను మీద ఫోన్ రావడం మొదలైంది'' అని వివరించారు.

ఫొటో క్యాప్షన్,

శంషాద్ కేసును వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు

అల్లర్లతో గ్రామంలోని ముస్లింలందరూ ఇళ్లు వదిలి పరుగులు తీశారు.

''ఇంట్లో నా కొడుకు వసీమ్ పెళ్లి కూడా పెట్టుకున్నాం. దాంతో నా కూతురు కూడా అత్తింటి నుంచి వచ్చింది. అంతలోనే మమ్మల్ని అన్ని వైపుల నుంచీ చుట్టుముట్టారని తెలిసింది. చుట్టుపక్కల అల్లకల్లోలం మొదలైంది. గ్రామంలో ముస్లింలందరూ ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. అప్పుడు మేం కూడా ప్రాణాలు కాపాడుకోడానికి పరిగెత్తాం. పిల్లలు ఒక వైపు, మహిళలు ఒకవైపు, మగాళ్లంతా మరోవైపు పరిగెత్తాం. తర్వాత రోజు లిసాడ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాంపులో మేమంతా కలిశాం. కానీ అబ్బూ-అమ్మీ కనిపించలేదు. వాళ్లు ఇల్లు వదిలి రానేలేదు.'' అని శంషాద్ తెలిపారు.

80 ఏళ్ల హాజీ నబ్బూ, 75 ఏళ్ల జరీఫన్ ఇద్దరూ గ్రామంలోని జాట్‌లు తమలాంటి వృద్ధులను చంపకుండా ప్రాణాలతో వదిలేస్తారు అనే అనుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

తమ వారి కడచూపుకు కూడా నోచుకోని మున్సీ

పాత జ్ఞాపకాలను ఆలోచనల్లోంచి తీసేయండి అంటున్నారు

"తర్వాత రోజు ఉదయం అమ్మీ-అబ్బూ ఎలా ఉన్నారో చూద్దామని మా ఇంటి నుంచి ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్లారు. అప్పుడు అమ్మీ-అబ్బూ ప్రాణాలతోనే ఉన్నారు. కానీ మాకు దగ్గరే ఉంటున్న కాసిమ్ దర్జీ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టడం, తర్వాత వాళ్లు మా ఇంటి వైపు రావడం కనిపించింది. దీంతో పిల్లలు ఊరికి దగ్గరగా ఉన్న చెరుకు పొలంలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. అమ్మీ-అబ్బూ కూడా వారి వెనకే పరిగెడుతూ వచ్చారు. ముసలివాళ్లు కావడంతో వేగంగా పరిగెత్తలేకపోయారు. గ్రామంలో ఆందోళనకారులు వారిని పట్టుకుని, నరికి చంపేశారు. తర్వాత మేం చాలా వెతికాం, కానీ వారి శవాలు కూడా దొరకలేదు. నాలుగు రోజుల తర్వాత అమ్మ శవం కాలువలో దొరికిందని తెలిసింది. అబ్బూ ఆచూకీ అయితే ఇప్పటికీ తెలీలేదు" అని శంషాద్ చెప్పారు.

శంషాద్ తల్లిదండ్రుల హత్య కేసు ఫుగానా పోలీస్ స్టేషన్లో నమోదైంది. లిసాడ్ గ్రామంలోని 22 హిందువులపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన 131 కేసులలో శంషాద్ తల్లిదండ్రుల హత్య కేసు కూడా ఉంది.

శంషాద్, ''ఒక్కొక్కరి ఇంటిలో ఇద్దరిద్దరు మరణించారు. అలాంటప్పుడు కేసులను ఎలా వెనక్కి తీసుకుంటాం? మా మీద కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. డబ్బును ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా మేం కేసును ఎలా వెనక్కి తీసుకుంటాం? పాత జ్ఞాపకాలను ఆలోచనల్లోంచి తీసేయండి అని అంటున్నారు. అదెలా సాధ్యం?'' అని ప్రశ్నించారు.

ఫొటో క్యాప్షన్,

మతఘర్షణల్లో కాలు పోగొట్టుకున్న లియాకత్ ఖాన్

మేం షామ్లీ జిల్లాలోని కైరానా వార్డ్ నెంబర్ 8 లో ఉంటున్న 40 ఏళ్ల లియాకత్ ఖాన్‌ను కలిశాం. షామ్లీ జిల్లాలోని లఖ్ బావడీ గ్రామానికి చెందిన లియాకత్, ఘర్షణల అనంతరం షామ్లీలో వచ్చి నివసిస్తున్నారు. ఘర్షణలతో లియాకత్, ఒక కాలితో పాటు ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయారు.

సెప్టెంబర్, 2013 నాటి అల్లర్లను తల్చుకుంటూ, ''మమ్మల్ని చంపేస్తారన్న వార్తలు గ్రామంలో వ్యాపించడంతో మా చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా మా ఇంటిలో గుమికూడారు. ఆ రాత్రి మా ఇంటిపై జరిగిన దాడిలో మా పొరుగున ఉండే దిల్‌షాద్‌ను, ఇక్రా అనే చిన్నపిల్లను, ఆ పిల్ల తల్లిని చంపేశారు. నాపై కూడా కత్తితో దాడి చేశారు. మొదట కత్తితో నా పొట్టను కోశారు. ఆ తర్వాత నా కాలు నరికారు. '' అని వివరించారు.

ప్రభుత్వం కేసును వెనక్కి తీసుకుంటున్న విషయంపై లియాకత్, ''నేను కేసును వెనక్కి తీసుకునేది లేదు. నాకు న్యాయం కావాలి. నా కాలు నరికేశారు. నా ఒంటిపై మొత్తం గాయాలున్నాయి. నా జీవనోపాధి పోయింది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కేసును ఎలా వెనక్కి తీసుకుంటుంది? '' అని ప్రశ్నించారు.

ఫొటో క్యాప్షన్,

సర్వస్వం కోల్పోయిన ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులు

కేసును వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వ వాదన

2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లలో 62 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయుల్లో ఎక్కువ మంది ముస్లింలే. హింస అనంతరం, సమాజ్‌వాదీ ప్రభుత్వం 1455 మందిపై 503 కేసులు నమోదు చేసింది.

ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించి 131 కేసులను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ 131 కేసులలో ఎక్కువ భాగం నిందితులు హిందువులే. వీరిపై హత్య, హత్యాయత్నం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, లూటీ తదితర అభియోగాలు నమోదు చేశారు.

ప్రభుత్వం కేసులను వెనక్కి తీసుకునే ప్రయత్నాలతో అల్లర్లలో నష్టపోయిన కుటుంబాలలో దు:ఖం, ఆక్రోశం పెల్లుబుకుతోంది.

ఈ కేసులను వెనక్కి తీసుకునే ప్రయత్నాల్లో భాగంగా గత ఫిబ్రవరిలో కొంత మంది జాట్ నేతలు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. బీజేపీ ఎంపీ సంజీవ్ బల్యాన్, బుడానా శాసనసభ్యుడు ఉమేశ్ మాలిక్ వారి వెంట ఉన్నారు.

సీఎంను కలిసిన అనంతరం బల్యాన్, మొత్తం 179 కేసులను వెనక్కు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ 179 కేసుల్లో నిందితులుగా ఉన్న మొత్తం 850 మంది హిందువులే.

వీరు సీఎంను కలిసిన కొన్ని రోజుల తర్వాత కేసులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.

ఉత్తరప్రదేశ్ న్యాయశాఖ మంత్రి బ్రజేశ్ పాఠక్, కొన్ని రాజకీయ ప్రేరేపిత కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితుల పిల్లలు

రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే..

అమెరికా సంస్థ 'యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం' ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో మతస్వేచ్ఛపై సమర్పించిన నివేదికలో - మతపరమైన ఘర్షణల బాధితులకు న్యాయం జరిగేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపింది. ఇలాంటి అల్లర్లు ఎక్కువగా ఆయన పార్టీకే చెందిన నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే చోటు చేసుకున్నాయని పేర్కొంది.

లండన్‌కు చెందిన 'మైనారిటీ రైట్స్ గ్రూప్ ఇంటర్నేషనల్' ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో, గత ఐదేళ్లలో భారతదేశంలో మతఘర్షణలు పెరిగిపోయినట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, 2016లో దేశంలో మొత్తం 700 మతఘర్షణలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వీటిలో బాధితులు ఎక్కువగా ముస్లింలే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)