పోలీసులు కాల్పులు ఎప్పుడు జరుపుతారు? ఎందుకు జరుపుతారు?
- మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
హింసాత్మక ఘటనల్లో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడం చూసే ఉంటారు. కానీ.. ఎలాంటి పరిస్థితుల్లో కాల్పులు జరపాలి? ఆ నిబంధనలు ఏమిటి? కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించాలి?
తమిళనాడు రాష్ట్రం తూత్తుక్కుడి జిల్లాలో స్టెర్లైట్ పరిశ్రమను మూసివేయాలంటూ మే 22న ప్రజలు నిరసనకు దిగారు. వేదాంత రిసోర్సెస్‌కు చెందిన ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా కలెక్టర్ ఆఫీస్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
తమిళనాడు నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే.. ఈ నిరసన తీవ్రమవడంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులు రెండు రోజులపాటు కొనసాగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 13 మంది మరణించారు.
ఫొటో సోర్స్, Getty Images
కొందరు పోలీసులు సాధారణ దుస్తులు ధరించి, ప్రజలపై కాల్పులు జరపుతున్న వీడియోను న్యూస్ ఛానెళ్లు ప్రసారం చేశాయి.
అయితే.. నిరసనకారుల్లో కలిసిపోయిన కొన్ని అసాంఘిక శక్తుల వల్లే కాల్పులు జరపాల్సివచ్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి అన్నారు.
కాల్పుల అనంతరం తమిళనాడు పోలీసు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
''నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించారు. సామాన్య ప్రజలకు, ఆస్తులకు ఎటువంటి ప్రమాదం జరక్కుండా చూడాలని ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశాం. కానీ హింస కొనసాగుతూనే ఉంది. టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ వల్ల కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చింది. కాల్పుల అనంతరం పరిస్థితిని అదుపు చేయగలిగాం'' అన్నది ఆ ప్రకటన సారాంశం.
ఫొటో సోర్స్, Getty Images
అయితే.. పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లో కాల్పులు జరపాలి? అన్న అంశంపై తమిళనాడు పోలీస్ కాలేజ్ మాజీ ఛైర్మన్ సీతణ్ణన్‌ను బీబీసీ కలిసింది.
కాల్పులు ఎప్పుడు జరుపుతారంటే..
ఏదైనా సంఘటన ఉద్రిక్తంగా మారుతున్నపుడు మొదటగా 'సెక్షన్ 144' విధించాలి.
నగరాల్లో అయితే పోలీస్ కమీషనర్, గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్ ఆ దిశగా ఆదేశాలు జారీ చేస్తారు. 8 రకాల సందర్భాల్లో ఈ సెక్షన్ అమలు చేస్తారు.
సెక్షన్ 144 ప్రకారం ఐదుగురు కంటే ఎక్కువ మంది ప్రజలు పోలీసుల అనుమతి లేకుండా ఒకచోట కలవరాదు.
అలా చేస్తే చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. సెక్షన్ 144 అమల్లో ఉన్నపుడు ఎలాంటి నిరసన కార్యక్రమాలను చేసినా, మందిని చెదరగొట్టడానికి క్రిమినల్ ప్రొసీజర్ 129, 130, 131 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చు.
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ - 1973, సెక్షన్ 129 ప్రకారం అలా చర్యలు తీసుకునే అధికారం జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌కు ఉంటుంది.
ఒకవేళ హింస చెలరేగితే, పరిస్థితిని సమీక్షించడానికి సంఘటనా స్థలానికి రావాలని పోలీసులు జిల్లా రెవెన్యూ అధికారిని కోరాలి.
ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితిని అదుపు చేయలేక, లేదా ఆ పరిస్థితుల్లో ఉండలేక జిల్లా రెవెన్యూ అధికారి అక్కడినుంచి వెళ్లిపోతే, అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం.. నిరసనకారులను చెదరగొట్టడం, లేదా అరెస్టు చేసే నిర్ణయాన్ని ఎస్.ఐ.స్థాయి అధికారి తీసుకోవచ్చు.
ఒకవేళ పరిస్థితి అప్పటికీ ఉద్రిక్తంగా ఉంటే, నిరసనకారులను అరెస్టు చేయడానికి లేదా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి కనీస స్థాయిలో సాయుధ బలగాలను రంగంలోకి దింపాలి.
ఒకవేళ పరిస్థితి హింసాత్మకంగా మారితే.. సెక్షన్ 131 ప్రకారం సాయుధ బలగాలు కలెక్టర్ ఆదేశాలను పాటించాలి. ఒకవేళ కలెక్టర్ అందుబాటులో లేకపోతే, ‘సాయుధ బలగాల బెటాలియన్ అధికారుల’ ఆదేశాలను పాటించాలి.
ఫొటో సోర్స్, Getty Images
'తమిళనాడు పోలీసు శిక్షణా చట్టం 73 ఏం చెబుతుందంటే..'
01. ముందుగా.. నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రకటించాలి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాలి.
02. నిరసనకారులు అందుకు నిరాకరిస్తే, అప్పుడు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాలి.
03. అప్పటిక్కూడా నిరసనకారులు అక్కడే ఉంటే, 'వజ్ర' లాంటి వాహనాలను రంగంలోకి దింపి, నిరసనకారులను చెదరగొట్టడానికి వాటర్ కెనాన్‌లను వాడుతారు.
04. 'వజ్ర వాహనం'తో కూడా ఫలితం లేకపోతే అప్పుడు లాఠీ ఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టాలి.
05. పైన పేర్కొన్న ఏ మార్గమూ నిరసనకారులను అదుపు చేయలేకపోయినా, ప్రజా జీవితానికి, ఆస్తులకు భంగం వాటిల్లే పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరపవచ్చు.
అయితే.. కాల్పులు జరపడం అన్నది కేవలం నిరసనకారులను చెదరగొట్టడానికి మాత్రమే కానీ, వాళ్లను చంపడానికి ఉద్దేశించినది కాదు.
అందుకే.. కాల్పులు జరుపుతున్నపుడు నిరసనకారుల నడుముకు వీలయినంత కిందభాగంలో కాల్చాలని పోలీసులకు శిక్షణలో చెబుతారు.
ఫొటో సోర్స్, Getty Images
గతంలో కొందరు నిరసనకారులపై టియర్ గ్యాస్ యోగిస్తున్న పోలీసులు (ఫైల్)
ఐపీసీ సెక్షన్ 100, 103 ప్రకారం పోలీసులు కాల్పులు జరపవచ్చు.
''సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మొదటగా 'పెల్లెట్ షాట్స్'ను ప్రయోగిస్తారు. ఒక్క పెల్లెట్ షాట్‌ను ప్రయోగిస్తే, అది బహుళ సంఖ్యలో విడిపోయి ఎక్కువ మందిని గాయపరుస్తుంది. కానీ చనిపోయే ప్రమాదం ఉండదు. తూత్తుక్కుడి సంఘటనలో పోలీసులు ఈ పెల్లెట్ షాట్స్‌ను పెద్ద సంఖ్యలో వాడివుంటే, ఇన్ని ప్రాణాలు పోయుండేవి కావు. కానీ సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులకే ఆ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది'' అని సీతణ్ణన్ అన్నారు.
అలాంటి సందర్భాల్లో పోలీసులు సాధారణ రైఫిల్స్‌ను వాడుతారు కానీ.. సెమీ-ఆటోమేటిక్, ఆటో-రీ ఫిల్లింగ్ ఆటోమేటిక్ రైఫిల్స్ వాడరు.
ఫొటో సోర్స్, Getty Images
గతంలో కొందరు నిరసనకారులపై నీరు ప్రయోగిస్తున్న పోలీసులు (ఫైల్)
మీడియాలో ప్రసారమైన వీడియోల్లో చూస్తే.. తూత్తుక్కుడి సంఘటనలో పోలీసులు ఆటోమేటిక్ రైఫిల్స్ వాడారు. సాధారణంగా ఇలాంటి రైఫిల్స్‌ను టెర్రరిస్టులతో పోరాడే సమయాల్లో వాడుతారు. సాధారణ రైఫిళ్లకు మాటిమాటికీ బుల్లెట్లను లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోడ్ చేసుకునే సమయంలో శత్రువులు మనపై కాల్పులు జరపొచ్చు. అలాంటి సందర్భంలోనే ఆటోమేటిక్ రైఫిళ్లను వాడుతారు''
''నిరసనకారులు సాధారణంగా పెట్రోల్ బాంబులు, రాళ్లు, కట్టెలను పోలీసులపై విసురుతారు. కానీ అలాంటివారిపై పోలీసులు ఆటోమేటిక్ రైఫిళ్లను ఎందుకు వాడారో నాకు అర్థం కావడం లేదు'' అని సీతణ్ణన్ అన్నారు.
అయితే.. అక్కడి పరిస్థితి తీవ్రతను బట్టి మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని సీతణ్ణన్ అన్నారు. కానీ తూత్తుక్కుడి కాల్పుల సందర్భం ఆయనకు తెలియదు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)