భారత్‌లోని అసమానతలను అంతరిక్షంలోంచి చూడొచ్చు

  • 29 మే 2018
2012లో భారతదేశంలో రాత్రి వెలుగులు Image copyright NASA

అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై కనిపించే వెలుతురును బట్టి అసమానతలను లెక్కకట్టవచ్చని ఆర్థికవేత్తలైన ప్రవీణ్ చక్రవర్తి, వివే దెహెజియా అంటున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ రక్షణ శాఖ ఉపగ్రహ కార్యక్రమం నుంచి సేకరించిన కొన్ని చిత్రాలను వారు ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు.

అమెరికా ఉపగ్రహం రోజుకు 14 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ, రాత్రిళ్లు సెన్సర్ల సహాయంతో భూమిపైనున్న వెలుతురును ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలపై వారు భారతదేశపు పటాన్ని సూపర్ ఇంపోజ్ చేశారు. వాటి ద్వారా - ఏయే జిల్లాలలో, ఏ సమయంలో ఎంత వెలుతురు ఉందన్న వివరాల సాయంతో ఒక ప్రత్యేకమైన డేటాను తయారు చేశారు.

ఆ వెలుతురు డేటా ఆధారంగా వారు దేశంలోని 12 రాష్ట్రాలలోని 387 జిల్లాలను పరిశీలించారు. ఈ జిల్లాల జనాభా మొత్తం దేశ జనాభాలో 85 శాతం. దేశం మొత్తం జీడీపీలో వీటి వాటా 80 శాతం. సుమారు 87 శాతం పార్లమెంటరీ సీట్లు ఈ జిల్లాలలోనే ఉన్నాయి. ఈ డేటాను ఉపయోగించి ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు, దేశంలోని వైవిధ్యతను అక్షరబద్ధం చేశారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక రాత్రి వెలుగులు భారతదేశంలోని అసమానతలను వెల్లడిస్తున్నాయి

సాధారణంగా ప్రకాశవంతంగా ఉన్న ప్రాంతాలలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని భావిస్తారు. భారతదేశంలోని ఎక్కువ భాగం రాత్రిళ్లు చీకటిగా ఉంటుంది. అంటే అక్కడ ఆర్థిక లావాదేవీలు, తద్వారా ఆదాయం తక్కువగా ఉందని అర్థం.

అంతరిక్షం నుంచి దేశంలో వెలుతురు ఉన్న ప్రాంతాలను పరిశీలించినపుడు, ఆయా రాష్ట్రాల మధ్య, అలాగే ఆయా రాష్ట్రాలలోనే భారీ అసమానతలు ఉన్నట్లు గుర్తించారు.

ముంబై, బెంగళూరుల వెలుతురుతో పోలిస్తే, 12 రాష్ట్రాలలోని 380 జిల్లాల సగటు వెలుతురు ఐదో వంతు మాత్రమే ఉంది.

ప్రకాశవంతంగా ఉన్న మొదటి 10 శాతం జిల్లాల వెలుతురుతో పోలిస్తే, 90 శాతం జిల్లాల వెలుతురు కేవలం మూడోవంతు మాత్రమే ఉంది. అంతే కాకుండా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఏడాది, అంటే 1992 - 2013 మధ్యకాలంలో ఈ వెలుతురులో అంతరం చాలా ఎక్కువగా ఉంది.

1991కు ముందు వివిధ రాష్ట్రాల ఆదాయాల మధ్య అంతరం కొంచెం తగ్గినట్లు కనిపించినా, ఆ తర్వాత క్రమంగా వాటి మధ్య అంతరాలు పెరుగుతూ పోయింది. ఈ ఆర్థికవేత్తల ప్రకారం - 2014 నాటికి మూడు అత్యంత ధనిక రాష్ట్రాల(కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర)లో వ్యక్తుల సగటు ఆదాయం, మూడు అత్యంత పేద రాష్ట్రాల(బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్) సగటు ఆదాయంకన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంది.

భారతదేశంలో ఆర్థిక లావాదేవీలను కొలవడానికి రాత్రి వెలుతురును ఉపయోగించుకోవడం మంచి ఆలోచన అని డాక్టర్ దెహెజియా పేర్కొన్నారు.

Image copyright AFP

ఇలా అభివృద్ధిని కొలవడానికి వివిధ పద్ధతులను ఆశ్రయించడం చాలా కాలంగా ఉంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ కూడా విద్యుత్ వినియోగాన్ని ఆర్థిక లావాదేవీల సూచికగా తీసుకుంటుంది.

అయితే రాత్రి వెలుగు అనేక సవాళ్లను విసురుతుంది. చంద్రుని దశలను బట్టి, భూమిపై వెలుతురును కొలవడంలో మార్పులు ఉంటాయి. అంతే కాకుండా నీటి ఆవిరి, ఒజోన్ తదితర కారణంగా కూడా వెలుతురును కొలవడంలో మార్పులు ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో ఉపగ్రహాలపై ఉండే సెన్సర్లు అతి తక్కువ వెలుతురును కూడా పట్టుకోగలుగుతున్నాయి.

ఇటీవల పరిశోధకులు రాత్రిళ్లు కనిపించే వెలుతురు సాయంతో నగరాలు ఎలా క్రమంగా విస్తరిస్తున్నాయో గుర్తించడానికి అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలను ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా ఈ వెలుతురును - ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు, కర్బన ఉద్గారాలను మ్యాపింగ్ చేయడానికి, విపత్తు నివారణ చర్యల కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు.

యేల్ యూనివర్సిటీకి చెందిన భరతేందు పాండే, '‘మరో మాటలో చెప్పాలంటే భూమికి 800 కిలోమీటర్ల పైనుంచి మనం గమనించే రాత్రి దృశ్యాలు, మానవ కార్యకలాపాల గురించి వేరే ఏ డేటా చెప్పలేని విషయాలను తెలియజేస్తాయి'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు