ప్రెస్‌రివ్యూ: రైల్వే స్టేషన్లలో శానిటరీ న్యాప్కిన్లు, కండోమ్‌ల అమ్మకం

  • 27 మే 2018
Image copyright iStock
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే ప్యాడ్లు(శానిటరీ న్యాప్కిన్లు) అమ్మాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది. ఈ మేరకు కొత్త టాయిలెట్‌ విధానాన్ని రూపొందించినట్లు చెప్పింది.

రైల్వే స్టేషన్లలో, వాటి బయట ఉండే టాయిలెట్ల వద్ద చిన్న దుకాణం ఏర్పాటు చేసి ప్యాడ్లు, పురుషుల కోసం కండోమ్‌లు అమ్మాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకే కాకుండా, స్టేషన్‌ పరిసరాల్లో నివసించే వారికీ వీటిని అమ్మనుంది.

ఒక దుకాణాన్ని స్టేషన్‌ లోపల, మరో దుకాణాన్ని స్టేషన్‌ బయట రైల్వేశాఖ ఏర్పాటు చేయనుంది. ఇక, అన్ని రైల్వే స్టేషన్లలో పురుషులకు, స్త్రీలకు, దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు నిర్మించాలని, అందులో ఇండియన్‌, వెస్టర్న్‌ మరుగుదొడ్డి ఉండాలని పాలసీలో పేర్కొంది.

Image copyright Facebook/Mahanati

ఏపీ: మహానటికి పన్నురాయితీ

'మహానటి' చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని 'ప్రజాశక్తి' తెలిపింది.

శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో మహానటి చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.

''మానవత్వానికి, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం మహానటి సావిత్రి. ఈ చిత్రంతో ఆమె గొప్పతనాన్ని ఈ తరానికీ తెలియజేశారు. 30 మంది మహిళలు ఈ చిత్ర నిర్మాణంలో పనిచేయడం అద్భుతం'' అని చంద్రబాబు తెలిపారు. ఈ సినిమాతో అందరి మనసులూ కదిలించారన్నారు.

తూత్తుక్కుడి కాల్పులకు ఆదేశించిందెవరో ప్రధాని చెప్పాలి: విశాల్

తమిళనాడులోని తూత్తుక్కుడిలో ఇటీవల జరిగిన కాల్పులకు ఆదేశాలు ఇచ్చిందెవరో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని, తమిళనాడు ప్రభుత్వాన్ని సినీ నటుడు విశాల్ డిమాండ్ చేశారని 'ఈనాడు' ఒక వార్తాకథనంలో పేర్కొంది.

విశాల్ శనివారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడారు. ''ఈ మధ్య సమాజంలో జరిగే ఘటనలపైనా బలమైన వాణిని వినిపిస్తున్నారు. ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?'' అని మీడియా ప్రశ్నించగా- సమాజంలో జరిగే ఘటనలపై ఓ ఓటర్‌గా, ఓ పౌరుడిగా ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన బదులిచ్చారు.

''ఈ మధ్య తూత్తుక్కుడిలో జరిగిన ఘటనలో అధికారికంగా 13 మంది చనిపోయారని అంటున్నారు. అనధికారికంగా ఆ సంఖ్య ఎక్కువే. అసలు ఆ ఘటన జరగడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్క ప్రశ్న అడుగుతాను. ఆ రోజు అక్కడ కాల్పులు జరపాలనే ఆదేశాలు ఎవరిచ్చారు? ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రశ్నకు జవాబు చెప్పే తీరాలంటాను'' అని విశాల్ చెప్పారు.

జమ్మూకశ్మీర్‌ Image copyright AFP

పీఎంవో నుంచి ఫోన్‌.. పేటీఎం యూజర్ల డేటా అడిగారు

నిరుడు కశ్మీర్‌లో రాళ్ళు విసిరిన ఘటన నేపథ్యంలో యూజర్‌ డేటాను తమతో పంచుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కోరిందని డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ పేటీఏం సీనియర్‌ అధికారి ఒకరు చెబుతున్న స్టింగ్‌ వీడియోను శుక్రవారం 'కోబ్రాపోస్ట్‌' విడుదల చేసిందని ‘నవ తెలంగాణ’ ఒక వార్తా కథనంలో పేర్కొంది.

కోబ్రాపోస్ట్‌ విలేఖరినని చెప్పుకుంటూ తనను కలిసిన వ్యక్తికి పేటీఏం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్ శేఖర్‌ శర్మ ఈ విషయం చెబుతున్నట్లు వీడియోలో ఉంది. కాగా, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదని పేటీఎం శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది. వీడియోలో కనిపించిన వ్యక్తి తమ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంటా, కాదా అనేది ఆ ప్రకటన నిర్ధరించలేదు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు కోరితే తప్ప డేటాను ఎవరికీ ఇవ్వబోమని ఆ ప్రకటన పేర్కొంది.

వీడియోలో ఏముంది?

కొందరు యూజర్ల వ్యక్తిగత డేటాను పీఎంవో అడిగిందని, వారిలో రాళ్ళు విసిరిన వారెవరైనా ఉన్నారేమోనని గుర్తించేందుకే అడిగినట్టు తెలిపిందని శేఖర్ ఈ వీడియోలో చెప్పారని నవ తెలంగాణ రాసింది. ''ఈ చర్య గోప్యతా నిబంధనల ఉల్లంఘన కాగలదని, పైగా కంపెనీ డేటా రక్షణ విధానాన్ని అతిక్రమించడమేనని పేటీఎం అధికారి అంగీకరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలకు చెందిన ఉన్నతస్థాయిలోని వారితో తనకు సంబంధాలున్నాయని శేఖర్‌ అంగీకరించినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. పేటీఎం యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించడం, పంచుకోవడం లేదా అద్దెకు ఇవ్వడం చేయబోమని పేటీఎం ప్రస్తుత గోప్యతా విధానం పేర్కొంటోంది'' అని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘అత్యాచారానికి గురయ్యాక నిద్రపోయాననటం.. భారత మహిళ తీరులా లేదు’: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు.. ఉపసంహరణ

చైనా వైద్య పరికరాలు భారత్‌లో ఓడల నుంచి దిగటం లేదు.. ఎందుకంటే...

చైనా, బ్రిటన్ మధ్య ‘హాంకాంగ్’ చిచ్చు... ప్రపంచ క్రమం మారిపోతుందా?

వెస్ట్‌ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఎందుకు కలుపుకుంటోంది?

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు విజయం సాధించటం ఎలా?

కరోనావైరస్‌కు చైనా సంప్రదాయ వైద్యం.. ‘విజయవంతం’ అంటున్న చైనా

ప్రియాంకా గాంధీకి డెడ్‌లైన్.. 'లుటియన్స్ దిల్లీ' ఇల్లు ఖాళీ చేయాలన్న కేంద్రం

కోటిన్నర జీతం ఇచ్చే ఉద్యోగం వదులుకుని.. పోరు బాట పట్టిన మహిళా న్యాయవాది

PUBG గేమ్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసిన 17 ఏళ్ల కుర్రాడు