కాపర్ పరిశ్రమతో క్యాన్సర్ వస్తుందా? స్టెర్లైట్ కార్మికులు ఏమంటున్నారు?

స్టెర్లైట్ పరిశ్రమ

తమిళనాడులోని తీర గ్రామం తూత్తుకుడిలో స్టెర్లైట్ కాపర్ స్మెల్టింగ్ (రాగి కరిగించు) పరిశ్రమ స్థాపనను వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగుతున్నారు. ఆ పరిశ్రమ వల్ల గాలి, భూగర్భజలాలు కలుషితమవుతాయని దానివల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలను ప్రకటించిన తర్వాత తాజా నిరసనలు వెల్లువెత్తాయి. రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆ నిరసనలు 100 రోజులకు చేరినపుడు ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అది మే 22వ తేదీన పెను విషాదంగా ముగిసింది.

నిరసనకారులు నిషేధాన్ని ఉల్లంఘించారని, హింసకు దిగి ప్రభుత్వ వాహనాలకు నిప్పుపెట్టారని పేర్కొంటూ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 13 మంది చనిపోయారు. స్టెర్లైట్‌ యాజమాన్య సంస్థ ఈ పరిశ్రమ కాలుష్యం కలిగించదని చెప్తోంది.

ఈ వివాదంలో మరో కోణం కూడా ఉంది. ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంగతి ఏమిటి? ఈ విషయంపై ఒక కార్మికుడు, మాజీ కార్మికుడు ఇంకొకరు బీబీసీతో మాట్లాడారు.

‘‘ఇది ఐటీ కంపెనీ లాంటిది కాదు. ఒక ఐటీ కంపెనీని మూసివేస్తే.. అందులోని ఉద్యోగులు మరొక ఐటీ కంపెనీలో చేరొచ్చు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇండియాలో రెండే కాపర్ స్మెల్టింగ్ పరిశ్రమలున్నాయి. ఎక్కువ అవకాశాలు లేవు. దీనివల్ల 95 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారు’’ అని స్టెర్లైట్ ఇంజనీర్ నందగోపాల్ బీబీసీతో పేర్కొన్నారు.

జనం లేవనెత్తుతున్న ఆరోపణల గురించి ఏమనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘‘అవి నిజం కాదు. వారిని శాస్త్రీయంగా మాట్లాడాలని అడగండి. అందరూ భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. ఎవరు క్యాన్సర్‌ వ్యాధికి గురైనా కోవిల్‌పట్టి స్టెర్లైట్ దానికి కారణమని ఆరోపిస్తున్నారు. అవి నిరాధార ఆరోపణలు’’ అని ఆయన బదులిచ్చారు.

ఉద్యోగులు వ్యాధులతో బాధపడుతున్నారా? అని అడిగినపుడు.. తనతో సహా ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులంతా మంచి ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. ‘‘పరిశ్రమ లోపల పనిచేస్తున్న మాలో ఎవరికీ క్యాన్సర్ రానపుడు అది వారి మీద ఎలా ప్రభావం చూపుతుంది? జనం ఏ శనివారం రోజైనా వచ్చి పరిశ్రమను పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని ప్లాంట్ యజమాని పిలుపునిస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. దాదాపు 2,500 మంది నుంచి 3,000 మంది వరకూ కార్మికులు పరిశ్రమలోకి వస్తున్నారు. వారందరి పరిస్థితీ అనిశ్చితిగా మారింది’’ అని నందగోపాల్ తెలిపారు. అయితే.. పోలీసుల కాల్పులను తాను సమర్థించటం లేదంటూ ఆ ఘటనపై విచారం వ్యక్తంచేశారు.

స్టెర్లైట్ మాజీ కాంట్రాక్ట్ కార్మికుడు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మాది తూత్తుకుడిలోని తైరేస్‌పురం. నేను 2014లో స్టెర్లైట్ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడిగా చేరాను. మూడేళ్ల పాటు అక్కడ పనిచేశాను. అక్కడ పనిచేసేటపుడు నాకు తరచుగా తలనొప్పి, వాంతులు, నీరసం వచ్చేవి. దీంతో ఆ ఉద్యోగం వదిలేసి తిరునెల్వేలిలో సిమెంట్ ఫ్యాక్టరీలో చేరాను’’ అని చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)