‘పొయ్యిలోని బూడిదను శానిటరీ ప్యాడ్‌లుగా వాడుతున్నారు..’

  • శ్యాంమోహన్‌
  • బీబీసీ ప్రతినిధి
పరమేశ్వరి, పర్యావరణహిత ప్యాడ్స్

ఫొటో సోర్స్, BBC/SHYAMMOHAN

ఫొటో క్యాప్షన్,

ప్యాడ్‌ల తయారీలో యువతులు

నెలసరి గురించి మాట్లాడడమే తప్పు లేదా సిగ్గు పడాల్సిన విషయం అన్నట్టుగా భావించే రోజుల్లో అమ్మాయిలే ఇప్పుడు నెలసరి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. అంతే కాదు, ఆ ఐదు రోజులు వాడాల్సిన శానిటరీ ప్యాడ్స్‌ని తామే స్వయంగా తయారు చేసుకుంటున్నారు.

రుతుచక్రం 28 రోజులు, రుతుస్రావం సరాసరిన ఐదు రోజులు. ఈ రెండింటినీ కలుపుతూ ఏడాదిలో ఐదవ నెల అయిన మే నెలలో, రుతుచక్రానికి ప్రతీకగా 28వ తేదీని 'మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే' గా నిర్ణయించారు.

రుతుక్రమం సమయంలో మహిళలకు సుమారు 7 శానిటరీ ప్యాడ్‌ల అవసరం ఉంటుంది. అయితే, సామాన్య మహిళలకు వాటిని కొనే స్థోమత లేకపోవడంతో ఇంకా పాతగుడ్డలను, మోటు పద్దతులను ఉపయోగిస్తూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

అయితే, ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా, చౌక ధరకే చెట్టు బెరడుతో తయారైన పర్యావరణహిత శానిటరీ ప్యాడ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

అమెరికాలో పెరిగే కొన్ని జాతుల చెట్ల కలపగుజ్జుతో ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్‌లు తయారుచేస్తున్నారు తెలంగాణ మహిళలు.

''మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌లను సాధారణంగా సింథటిక్‌, ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వాటిని ఎక్కువసేపు ఉంచడం వల్ల అనేక వ్యాధులు సోకే అవకాశం ఉంది. అదే కలపగుజ్జుతో తయారుచేసే ప్యాడ్‌లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అలాగే, మామూలు ప్యాడ్‌లు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి, ఈ ప్యాడ్‌లు మాత్రం తొందరగా భూమిలో కలిసిపోతాయి'' అని చదురుపల్లి పరమేశ్వరి బీబీసీకి తెలిపారు. ఆమె ఈ శానిటరీ ప్యాడ్స్‌ తయారు చేసే కేంద్రాన్ని నిర్వహిస్తున్న షైన్‌ స్యచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు.

ఫొటో సోర్స్, BBC/SHYAMMOHAN

ఆ మహిళలు ఇసుకను వాడుతున్నారు...

ప్యాడ్స్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించే ముందు పరమేశ్వరి కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్లి రుతుక్రమం సమయంలో అక్కడి మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించినపుడు ఆశ్యర్యకరమైన, ఆందోళనకరమైన విషయాలు ఆమె దృష్టికి వచ్చాయి.

''మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొన్ని తండాలకు వెళ్లినపుడు అక్కడి మహిళలు రుతుక్రమం సమయంలో ఇసుకను వస్త్రంలో చుట్టి వాడడం గమనించాను. మరికొందరు జనపనారను వాడటం చూశా. నల్లమల అటవీ ప్రాంతం దేవరకొండలో అయితే మరీ ఘోరంగా కట్టెల పొయ్యిలోని బూడిదను పాతబట్టలో పెట్టి వాడుతున్నారు. దీని వల్ల వాళ్లు బ్యాక్టీరియా సోకి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు'' అని పరమేశ్వరి తెలిపారు.

నాలుగు గంటలకొకసారి ప్యాడ్‌లు మార్చాలి...

రుతుస్రావం సమయంలో నాలుగు గంటలకొకసారి ప్యాడ్‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అలా చేయడం లేదు.

ప్యాడ్స్‌ వాడక పోవడానికి కారణం ఆర్థిక పరిస్థితులు, అవి సామాన్యులకు అందుబాటు ధరల్లో లభ్యం కాకపోవడం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం అని గమనించిన పరమేశ్వరి ప్యాడ్‌ల వాడకంపై అవగాహన కల్పించడం కోసం ఇరవై గ్రామాలు తిరిగారు.

తాము తయారు చేసిన ప్యాడ్స్‌ను స్థానిక విద్యార్థినులకు, చుట్టుపక్కల మహిళలకు ఉచితంగా అందజేశారు. ఆ తరువాత వాళ్ల ఇళ్లకు వెళ్లి వాటి వాడకంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

మొదట్లో ప్యాడ్స్‌ తయారీలో లోపాల కారణంగా పలు రకాల సమస్యలు వచ్చాయి. దీంతో వాటిని గుర్తించి లోపాలను సరిచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులతో శిబిరాలు ఏర్పాటు చేసి పర్యావరణహిత ప్యాడ్‌ల వాడకం వల్ల కలిగే ప్రమోజనాలను వివరించారు.

ఫొటో సోర్స్, BBC/SHYAMMOHAN

కలపగుజ్జు ఎక్కడి నుండి వస్తుంది?

మహిళల ఆరోగ్యానికి రక్షణ, పర్యావరణహితం - అనే రెండు లక్ష్యాలతో కేంద్ర ఐటీ శాఖ చేపట్టిన పథకం 'స్త్రీ స్వాభిమాన్‌'.

ఇందులో భాగంగా 2017 సెప్టెంబర్‌లో భారతదేశంలో తొలిసారిగా షైన్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణహిత ప్యాడ్స్‌ తయారీని ప్రారంభించారు. అది విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈ పథకం కింద ప్యాడ్‌ల తయారీ ప్రారంభించారు.

అమెరికా నుండి దిగుమతి చేసుకున్న చెట్ల గుజ్జును రంగారెడ్డిజిల్లా, తుర్కయాంజల్‌లోని షైన్‌ సంస్థకు తరలిస్తారు. అక్కడ 8 దశల్లో గుజ్జును ప్యాడ్‌గా రూపొందిస్తారు. వీటిని పూర్తిగా చేతితోనే తయారు చేస్తున్నారు.

ప్రస్తుతం పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు 40 నుండి 50వేల ప్యాడ్‌లను ఉత్పత్తి చేసి గ్రామాలకు పంపుతున్నారు.

ఫొటో సోర్స్, BBC/SHYAMMOHAN

ఫొటో క్యాప్షన్,

కేవలం ప్యాడ్‌లు విక్రయించడమే కాకుండా 'షైన్' వాటిపై అవగాహన కూడా కల్పిస్తుంది

కల్లుగీత కార్మికుడి కూతురు...

పరమేశ్వరి ఓ దిగువ మధ్యతరగతి మహిళ. జీవితంలో ఆమె ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తోటి మహిళలకు చేయూతనివ్వాలని షైన్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఔత్సాహిక మహిళలకు ఉపాధి బాట చూపుతున్నారు.

ఆమె జీవన చిత్రం ఆమె మాటల్లోనే - ''మా నాన్న కల్లుగీత కార్మికుడు, అమ్మ వ్యవసాయ కూలీ. నాన్నకి పక్షవాతం రావడంతో అమ్మ మీదే కుటుంబ భారం పడింది. ఆమె కష్టాలు చూడలేక కూలీ పనులకెళుతూ చదువుకున్నా. పలు వత్తివిద్యా కోర్సులూ నేర్చుకున్నా. నాలుగేళ్ల క్రితం 'సొసైటీ ఫర్‌ హెల్పింగ్‌ ఇంటిగ్రిటీ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌' సంస్ధను ప్రారంభించి, పేదమహిళలకు టైలరింగ్‌ నేర్పించడం మొదలుపెట్టాం. ఐదు వేలమందికి శిక్షణ ఇచ్చాం. బ్యూటీ కోర్సులూ, కంప్యూటర్‌ బేసిక్స్‌ కూడా నేర్పించాం. నా భర్త లెక్చరర్‌గా పనిచేస్తూ నన్ను ప్రోత్సహించారు. దేశంలో 10 రాష్ట్రాల్లో శానిటరీ ప్యాడ్‌ల తయారీ ప్రారంభించగా నిర్వహణ, అవగాహన కార్యక్రమాల విషయంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నుండి 'స్త్రీ స్వాభిమాన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు' కూడా పొందాను. భవిష్యత్తులో మహిళలకు నైపుణ్య శిక్షణలతో పాటు ఆరోగ్యం-పరిశుభ్రతలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను'' అని వివరించారు.

ఇప్పుడు వీరి సంస్థ ఎన్‌ఎస్‌డీసీ (నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)లో భాగస్వామి.

ఫొటో సోర్స్, BBC/SHYAMMOHAN

ఫొటో క్యాప్షన్,

'స్త్రీ స్వాభిమాన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు'తో పరమేశ్వరి

అందుబాటు ధరలో...

మార్కెట్‌లో దొరికే ఇతర రకాల శానిటరీ ప్యాడ్‌ల ధర ఎక్కువగా ఉంటోంది. అందుకే పేద మహిళలందరికీ అందుబాటులో ఉండేలా షైన్ సంస్థ ఎనిమిది ప్యాడ్‌ల ప్యాక్‌ను రూ.28కే అందజేస్తోంది.

''మేం కేవలం ప్యాడ్‌లు విక్రయించి ఆగిపోం. వాటి వాడకం పట్ల అవగాహన కల్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. మనదేశంలో ప్రతి ఏడు నిముషాలకు ఒక మహిళ సెర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. యవ్వన దశ నుండీ ప్రారంభమయ్యే నెలసరి గురించి బాలికలు తప్పని సరిగా అవగాహన కలిగి ఉంటే సెర్వైకల్‌ క్యాన్సర్‌ని నివారించవచ్చు. మహిళలు రుతుస్రావం విషయంలో సిగ్గుపడకుండా అవగాహన పెంచుకోవాలి'' అంటారు పరమేశ్వరి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)