మీడియా ద్వారా కుట్రలు కూడా చేయొచ్చా?
- కమర్ వహీద్, సీనియర్ జర్నలిస్ట్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, COBRAPOST.COM
కోబ్రాపోస్ట్ తాజా స్టింగ్ ఆపరేషన్ మీడియా పతనం కథను బయటపెట్టింది. దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి హెచ్చరిక గంటలు మోగించింది.
స్టింగ్ ఆపరేషన్‌లో అత్యంత తీవ్రమైన, ఆందోళన చెందాల్సిన విషయం వెలుగు చూసింది. మీడియా సంస్థలు డబ్బు కోసం దేశానికి, ప్రజాస్వాన్యానికి వ్యతిరేకమైన ఎంత నీచమైన కుట్రను చేయడానికైనా వెనకాడడం లేదనే విషయం బయట పడింది.
ఎన్నికలకు ముందు దేశంలో మతం పేరుతో ప్రజలను ఎలా ఆకర్షించాలనుకున్నారో.. ప్రతిపక్ష నేతల ఇమేజ్ ఎలా నాశనం చేయాలనుకుంటున్నారో స్టింగ్ ఆపరేషన్ చేసిన రిపోర్టర్ బయటపెట్టారు.
తన మాటలను మీడియా సంస్థల యజమానులకు, బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చున్న వారికి చెబితే, వారంతా ఆనందంగా విన్నారని ఆయన చెప్పారు. ఇలా చేయడం దేశానికి వ్యతిరేకమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఎవరికీ ఎందుకు అనిపించలేదు?
అయితే, ఇప్పుడు విడుదలైన స్టింగ్ ఆపరేషన్ వీడియోతో డబ్బు లావాదేవీలు జరిగాయా, లేక వేరే ఏదైనా లావాదేవీలతో మీడియా సంస్థ ఏదైనా తప్పుగా ప్రసారం చేసిందా, లేక ప్రచురించిందా అనేది నిరూపితం కాలేదు.
ఫొటో సోర్స్, Getty Images
పీకల్లోతు కష్టాల్లో దత్తత మీడియా
అసలు ప్రశ్న అదే. ఇప్పటి వరకూ మనం అనుకూల మీడియా గురించి మాట్లాడుకున్నాం. బాకా మీడియా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఐడియాలజీ గురించి మాట్లాడే మీడియా గురించి మాట్లాడదాం. మత సంబంధిత విషయాల్లో, కుల ఘర్షణల్లో, దళితులకు సంబంధించిన విషయాల్లో లేదా రిజర్వేషన్ లాంటి అంశాలలో మీడియా రిపోర్టింగ్ గురించి కూడా కొన్నిసార్లు ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
కార్పొరేట్ మీడియా "ప్రైవేట్ ట్రీటీ", "పెయిడ్ న్యూస్ గురించి మాట్లాడేవారు. మీడియా ఈ సమస్యలన్నింటి నుంచి వెళ్తుండేది, వెళ్లేది. వీటిపై వాదనలు, చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
కానీ కోబ్రాపోస్ట్ తాజా స్టింగ్ ఇప్పుడు పరిస్థితి పీకల్లోతుకు వచ్చిందని తెలిపింది. ఇప్పటికైనా మేలుకోకుంటే పూర్తిగా మునిగిపోవడానికి చాలా కాలం పట్టదు.
పెయిడ్ న్యూస్, అడ్వర్టోరియల్, పేరుతో డబ్బు తీసుకోడానికి అలవాటు పడిపోయిన మీడియా ఏ స్థాయికి చేరిందంటే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీని గెలిపించడానికి అన్ని రకాల కుట్రలు చేయడానికీ తెగిస్తున్నారు. ఎవరో వస్తారు, డబ్బు తీసుకుని పత్రిక, టీవీ ఛానల్, వెబ్ సైట్ ఉపయోగించుకోవాలని అనుకుంటారు. దీనికి ఆ మీడియా సంస్థ అందులో భాగస్వామి అయిపోయేందుకు సిద్ధం అంటుంది.
ఫొటో సోర్స్, cobrapost.com
1975లో అత్యవసర స్థితి సమయంలో..
మీడియాలోని ఒక పెద్ద భాగం ప్రభుత్వానికి బాకా ఊదుతున్నట్టు మీకు పదే పదే అనిపిస్తుంటే, దాని వల్ల ఒక విషయం స్పష్టం అవుతోంది. ప్రభుత్వం చేసే పనులను గమనించడానికి బదులు ప్రత్యేకంగా కొందరు (మీడియా సంస్థలు) విపక్ష నేతలను విమర్శించడంలో, వారిపై బురద చల్లడంలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఒడిలో కూచుని ఆ మీడియా సంస్థలు రెచ్చిపోతున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి భావనలను కొట్టిపారేయలేం.
ఎందుకంటే కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో ఒక అపరిచత వ్యక్తి మీడియా సంస్థలతో ఇంత సులభంగా డర్టీ గేమ్ ఆడగలిగాడంటే, ఏదైనా ప్రభుత్వం అనుకుంటే, మీడియాను ఎంత సులభంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చనే విషయాన్ని మీరు ఊహించవచ్చు. ఈ రోజు వారి దగ్గర ధనంతోపాటూ, అధికారం కూడా ఉంది.
ఈ రోజు ఏ అనుకూల మీడియా గురించి మాట్లాడున్నామంటే వాటిలోని ఒక రూపాన్ని మనం 43 ఏళ్ల క్రితం 1975లో అత్యవసర స్థితి సమయంలో చూశాం. అప్పట్లో దేశంలో చాలా మీడియా సంస్థలు, దిగ్గజ సంపాదకులు ఇందిరాగాంధీ ప్రభుత్వం ముందు లొంగిపోవాల్సి వచ్చింది.
ఫొటో సోర్స్, Getty Images
మీడియా రిపోర్ట్‌ను ఎలా నమ్మగలం
అప్పుడు శిక్షలు, జైలుకు వెళ్లాలనే భయం ఉండేది. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పట్లో డబ్బుకు ఎవరూ అమ్ముడు పోలేదు, కేవలం భయంతో అలా చేశారు. వారి భయం తీరిపోగానే, అంతకు ముందులాగే నిష్పక్షపాత, నిర్భయ ప్రెస్ మళ్లీ తిరిగి తమ గొంతు వినిపించింది.
కానీ కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌తో ఈ ప్రభుత్వ పాలనలోనే కాదు, భవిష్యత్తులో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, అధికారంలో ఉండేది ఏ పార్టీ అయినా దానికి సంబంధించిన ఏ కూటమికి అయినా మీడియా నుంచి ఎప్పుడు కావాలన్నా, ఎలా కావాలన్నా ప్రచారం చేయగలమని మీడియా సంస్థలు స్పష్టమైన సంకేతాన్నిచ్చాయి.
అంటే మీడియాకూ పీఆర్ కంపెనీలకు తేడా ఏముంది. అలాంటప్పుడు, మీడియా రిపోర్టులను ఎవరైనా ఎందుకు నమ్ముతారు. మీడియా విశ్వసనీయత, దాని గౌరవానికి సంబంధించి ఇంత పెద్ద సమస్య ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
న్యూట్రల్‌గా ఉండాలి
కోబ్రాపోస్ట్ స్టింగ్ వల్ల మరికొన్ని విషయాలు కూడా బట్టబయలయ్యాయి. ఉదాహరణకు కొందరైతే ఒక మాట కూడా అన్నారు. మేం ప్రభుత్వానికి చాలా చాలా మద్దతుగా ఉంటాం అని చెప్పారు.
లేదంటే మనం కనీసం న్యూట్రల్‌గా అయినా కనిపించాలి అని అన్నారు. అంటే నిజానికి న్యూట్రల్ ఉన్నా, లేకున్నా, అలా ఉన్నట్టు చూపించాలి. ఇలా ఒకరు చాలా పెద్ద హిందుత్వవాదిగా చెప్పుకున్నారు. ఇది మీడియా ఆబ్జెక్టివిటీ, దాని నైతికతపై చాలా పెద్ద ప్రశ్న కాదా.
అయినా మీడియా హిందుత్వవాదంతో ఉండడం, లేదా మీడియాలో హిందుత్వ ధోరణి ఉండడం కూడా కొత్త విషయమేమీ కాదు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం తీవ్రంగా ఉన్నప్పుడు, 1990 నుంచి 92 వరకూ ఆ సమయంలో మీడియాలోని ఒక పెద్ద వర్గం, ముఖ్యంగా హిందీ మీడియా చాలా మతపరమైన, పక్షపాత ధోరణితో రిపోర్టింగ్ చేసింది.
ఇదే అన్వేషణలో ప్రెస్ కౌన్సిల్ చాలా చోట్లకు తన టీమ్‌ను పంపించాల్సి వచ్చింది. కానీ బాబ్రీ మసీద్ ధ్వంసం తర్వాత మెల్లమెల్లగా పరిస్థితులు చక్కబడేకొద్దీ, మీడియాలో వచ్చిన మతపరమైన వేడి చల్లారిపోయింది.
ఫొటో సోర్స్, Getty Images
హిందుత్వవాద ఎజెండాలో భాగస్వామ్యం
ఇప్పుడు అలాంటి వేడి మళ్లీ కనిపిస్తోంది. కానీ అప్పుడు అవి వ్యూహం ప్రకారం చేసినవి కావు. కానీ ఇప్పుడు వ్యూహం ప్రకారం చేసే అవకాశాలు చాలా ఎక్కువయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని జేఎన్‌యూ అంశంలో, వీడియో మార్ఫింగ్ రూపంలో మనం చూశాం.
కోబ్రాపోస్ట్ మామూలు స్టింగ్ చేసినప్పుడు అందులో మీడియా సంస్థలు హిందుత్వవాద ఎజెండాలో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అంటే అది చాలా ప్రమాదకరమైన అవకాశంగా కనిపిస్తోంది. మీడియా వ్యూహం ప్రకారం చేసే మతపరమైన దుశ్చర్యకు మాధ్యమం కాబోతోందా?
ఈ ప్రశ్న చాలా తీవ్రమైనది. అయినా మీడియా మార్కెటింగ్, అందులోని సంపాదకుడు, మీడియా సంస్థలు వేరే వ్యాపారాలు చేసుకోవడంపై చాలా ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ వీటి గురించి ఎవరూ పట్టించుకోరు. కనీసం చర్యలు కూడా తీసుకోరు.
కానీ ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవడం మనందరికీ ఒక పెద్ద ప్రమాదం అవుతుంది. ఇది మీడియాకు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అస్థిత్వమే ప్రమాదంలో పడింది.
ఫొటో సోర్స్, Getty Images
నిజాయితీ ఉన్న మీడియా లేకుండా పోయింది
దేశంలో స్వేచ్ఛ, నిజాయితీ ఉన్న మీడియా అనేది లేనప్పుడు, ప్రజాస్వామ్య మనుగడను ఊహించుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మొదట మీడియాను కాపాడండి.
మీడియాను ఎలా కాపాడుకోవాలి. రాత్రికి రాత్రే పరిస్థితి మారాలంటే అది సాధ్యం కాదు. కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభించాలి. మీడియాను కాపాడడానికి మొదటి మార్గం ఒక్కటే, ఎడిటర్ పేరున సంస్థకు మళ్లీ ప్రాణం పోయడం, దాన్ని బలోపేతం చేయడం.
మీడియాలో ఆదాయం తీసుకొచ్చేవారికి, వార్తలు తీసుకొచ్చే వారికి మధ్య ఒక పెద్ద గోడ ఉండాలి. మీడియా అంతర్గత విధులను, స్వయం ప్రతిపత్తిని మానిటరింగ్ చేసేందుకు ఏదైనా స్వతంత్ర, తటస్థ, విశ్వసనీయత ఉన్న మెకానిజం ఉండాలి. ఇదంతా ఎలా సాధ్యం. గమ్యం చాలా దూరం ఉంది. కానీ మొదట మీరూ, మనం మొదట దాని గురించి ఆలోచించడం ప్రారంభించాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)