‘మా రంగా ఎర్రోడే.. కొన్ని విషయాల్లో వెర్రివాడు కూడా!’

  • 27 మే 2018
మాదాల రంగారావు Image copyright Madala ravi

టీ నగర్ పవర్ హౌస్ దగ్గర, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు, మెడకి టై, టక్ చేసుకుని, షూస్ వేసుకుని చేతిలో ఒక ఆల్బం‌తో నిటారుగా నిలబడి అడుగులు వేస్తున్న 'రంగా'నే గుర్తుండిపోయాడు.

ప్రపంచానికి రెడ్ స్టార్ 'మాదాల రంగారావు'. నటుడు, వామపక్ష భావజాలంతో చలన చిత్రాలు నిర్మించిన నిర్మాత.

కానీ, నాకు.. మా అమ్మ చౌదరాణికి, మరికొంతమంది దగ్గిరవారికి తను 'రంగా'.

అలా ఆ రోజుల్లో మాములుగా ఎవరూ కనబడేవారు కాదు. మద్రాసు మహానగరంలో కూడా.

కనబడితే గినబడితే ఏ స్పెన్సర్స్ లోనో, తాజ్ కోరమాండల్ హోటల్లోనో, చోళా షెరాటన్‍, లేదు ఎయిర్‌పోర్ట్ లాంటి చోట్ల మాత్రమే...

ఆ ఆల్బమే చలన చిత్ర జగత్తులోకి ఒక ఎంట్రీ!.

నిర్మాతకో, దర్శకుడికో ఆ ఆల్బం చూపించాలి. అదే వారి పోర్ట్‌ఫోలియో. కానీ, రంగా విషయంలో అలా కాలేదు.

పరిచయం అయిన కొద్ది రోజులలోనే అమ్మ చౌదరాణికి 'పెద్ద కొడుకు' అయిపోయాడు.

Image copyright Madala ravi

రంగా నటుడిగా నిలబడ్డానికి ప్రయత్నిస్తున్న తొలి రోజులవి.

ఆదివిష్ణు గారి నాటకం అనుకుంటాను, "మంచుతెర". విజయరాఘవాచారి రోడ్డులోని ఆంధ్రా క్లబ్‍లో ఒక ఆదివారం సాయంత్రం నాటక ప్రదర్శన.

గుత్తా రామినీడు, గుమ్మడి, కె.ఎస్. ప్రకాశరావు, మరి కొంత మంది చలన చిత్ర రంగ ప్రభుతులు ఆహుతులు. రంగాది అందులో ఒక ముఖ్యమైన పాత్ర.

మద్రాసులోని తెలుగు చలనచిత్ర రంగంలోని ప్రముఖులలో కొందరికి ఒకేసారి, ఒకే చోట తన నటనా కౌశల్యాన్ని చూపించడం, పరిచయం కావడం రంగాకు అదే తొలిసారి.

నాటక ప్రదర్శన అనంతరం దర్శకుడు గుత్తా రామినీడు ఒక మంచి పాత్రనిస్తానని తనకు మాట ఇచ్చారు.

మద్రాసు విశ్వవిద్యాలయం రీడర్‌గా ఉన్న పర్వతనేని గంగాధర రావు గారింటి పక్కనే రంగా ఉండేవాడు (సి.ఐ.టి.నగర్‌లో). ఆ ఇల్లే తరవాత తన ‘యువతరం’కి ప్రొడక్షన్ ఆఫీస్ అయింది.

రంగా తన కుమారుడు రవిని నేను చదువుకున్న మైలాపూర్ కేసరి హై స్కూల్లోనే చేర్పించినట్లు గుర్తు.

రంగాతో పాటు, టి.కృష్ణ, పోకూరి బాబురావు, నర్రా వెంకటేశ్వర్లు, బి.గోపాల్, వందేమాతరం శ్రీనివాస్ తదితరులకు కొంతకాలం రాణీ బుక్ సెంటరే కూడలి. ఒంగోలు నుంచి వచ్చిన నల్లూరి 'అన్న' వీరందరికి ఒక పెద్ద దిక్కు. ప్రజా నాట్యమండలి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండేవాడు.

టి.కృష్ణ, రంగా మొదట్లో కలిసే ఉన్నా, కాలక్రమంలో ఎవరి తరహాలో వారు తమదైన శైలిలో దర్శక, నిర్మాతల వైవిధ్యమైన పంథాలమూలంగా తలా ఒక మార్గం ఎంచుకున్నారు.

Image copyright Madala ravi

90లలో అనుకుంటా.. ఒక రోజు సాయంత్రం తన వెస్పా స్కూటర్ వేసుకుని మా ఇంటికి వచ్చాడు. ఏదో మాటలమీద, "అనిల్‌తో సినిమా తీయిస్తానమ్మా, ' అని మా అమ్మతో అన్నాడు. నేను నవ్వేసాను.

అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఎప్పటి లాగానే నవ్వుతూనే అన్నాడు, "నువ్వు కాదన్నా నేను వాడిని నిర్మాతని చేస్తాను! లాభాలన్నీ నీవీ, అప్పులన్నీ నావే!" అని నవ్వుతునే అన్నాడు.

"అమ్మా, నీకు తలకొరివి పెట్టాల్సిన పెద్దకొడుకుని నేనేనమ్మా! అనిల్ కాదు. నేను తనతో సినిమా తీయిస్తాను. నీ మీద ఒట్టు!" అని నవ్వుతూ అమ్మ నెత్తిన చెయ్యి పెట్టి ఒట్టేసాడు.

అమ్మ నవ్వుతూనే అంది, "సరేలే, వాడితో నువ్వు తీయించినప్పుడు, నేను చూసినప్పుడు సంగతి కదా!"అని.

ఏదైనా మీటింగ్‍కి వెళ్లేటప్పుడు తన మెడ చుట్టూ ఎర్రటి స్కార్ఫ్ ఉండేది. ఒకసారి ఏదో బయట ఊర్లో పార్టీ మీటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది.

"రా, మనిద్దరం వెళ్లి సూట‌కేస్ కొనుక్కోద్దాం," అని నన్ను లాక్కెళ్లాడు. నార్త్ ఉస్మాన్ రోడ్డులోని వివేక్ అండ్ కో కి వెళ్లాం. వి.ఐ.పి. సూట్ కేసులు పెద్దవే. వాటిల్లో కొట్టొచ్చినట్లు ఉన్న ఎర్ర రంగు సూట‌కేసు తీసుకున్నాడు.

నేనడిగాను, "రంగన్నా, ఎందుకు ఎప్పుడూ ఆ ఎరుపే వాడుతావు! నువ్వు "ఎర్రోడివని ప్రంపంచానికి తెలుసుగా?" అని.

"నేను ఎర్రోడిని అని ప్రపంచానికి తెలియడం వేరు. నేను ఎర్రోడిగానే బతుకుతాను అని ప్రపంచానికి చెప్పడం వేరు!" అని అన్నాడు.

మా రంగా ఎర్రోడే. కొన్ని విషయాల్లో వెర్రివాడు కూడా! తనని నమ్ముకున్న వాళ్లకి నేనున్నాని.. వాళ్ల వెమ్మటే నిలబడ్డాడు.

తనని కాటేసినవాళ్లని కూడా క్షమించి, ఉద్యోగాలిప్పించాడు కూడా! కాకపోతే నన్ను నిర్మాత‌గా చూసుకోకుండానే వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా

మన భవిష్యత్ ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి

అమెరికాలో ప్రాణాలు తీసే పోలీసులు శిక్షల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు

కరోనావైరస్: దిల్లీలో వైద్య వ్యవస్థ విఫలమైందా.. కేజ్రీవాల్ ప్రభుత్వం టెస్టుల్ని ఎందుకు తగ్గిస్తోంది

‘యోగా, సూర్య నమస్కారాలు క్రైస్తవానికి సరిపడవు.. ఒక క్రైస్తవుడి జీవితంలో యోగాకు స్థానం లేదు’ - గ్రీకు చర్చి

కరోనావైరస్: ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లగలరా

2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా

WHO: కరోనావైరస్ నిబంధనల్లో పెనుమార్పు.. పబ్లిక్‌ ప్లేసుల్లో మాస్కుల వాడకం తప్పనిసరి - కేసుల్లో ఇటలీని దాటిన భారత్

వీడియో: కరోనావైరస్‌ - ఆహారం కరువై గ్రామాలకు వలస వెళ్తున్న ఏనుగులు