అభిప్రాయం: ‘ప్రచారానికే మొదటి ప్రాధాన్యం’

  • 29 మే 2018
నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం Image copyright Getty Images

ప్రభుత్వం చేసే పని, ప్రచారం ఎంత నిష్పత్తిలో ఉండాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రచారంపై చేసే ఖర్చు విషయంలో మాత్రం గత ప్రభుత్వాల రికార్డులన్నీ బద్దలు చేసింది. 2014, మే లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ ప్రభుత్వం 3750 కోట్ల రూపాయలను ప్రచారంపై ఖర్చు చేసింది. ఇది విజయవంతమైన మిషన్ మంగళయాన్ ఖర్చుకన్నా ఏడు రెట్లు అధికం.

ప్రచారంపై ఖర్చు కొత్తదేమీ కాదు, అది చెడ్డదీ కాదు. కాకుంటే ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారం 'మొదట ప్రచారం, తరువాతే పని' అన్న చందంగా ఉంది.

అన్ని రికార్డులూ బద్దలు

గత సాధారణ ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం కూడా ప్రచారంపై చాలా ఖర్చు చేసింది.

మొదటిసారిగా 2013-14లో ప్రచారంపై ప్రభుత్వం చేసే ఖర్చు రూ.1000 కోట్లు దాటింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం దానిని రూ.1500 కోట్లకు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఇది కేవలం ప్రచారంపై ప్రభుత్వం చేసిన ఖర్చు మాత్రమే. పార్టీ తరఫున చేసిన ఖర్చు దీనికి అదనం.

చిత్రం శీర్షిక ప్రభుత్వం ప్రచారం

ఒక్కటైపోయిన ప్రభుత్వం, దేశం, బీజేపీ, నరేంద్ర మోదీ

నిజానికి మౌలిక సదుపాయాలపై చేయాల్సిన ఖర్చును ఇలా ప్రచారంపై ఖర్చు చేయడాన్ని అరికట్టడానికి ప్రజా పద్దుల కమిటీ ఉంది. కానీ వాటి పని అవి చేస్తే ఇక చెప్పుకోవడానికి ఏముంది?

అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా ప్రచారం చేసుకోవడం కనిపించదు. అక్కడ ప్రభుత్వ పథకాలలో రాజకీయ నేతల ఫొటోలను ఉపయోగించుకోవడానికి వీల్లేదు.

మోదీ నాలుగేళ్ల ప్రభుత్వ విజయోత్సవాలు దాదాపు అన్ని పత్రికల్లో మొదటి పేజీల్లో రంగురంగుల ప్రకటనల రూపంలో వచ్చాయి.

ఈ ప్రచారంలో ప్రభుత్వం ఏది, పార్టీ ఏది అన్న అంతరం పూర్తిగా మాయమైంది. ప్రభుత్వం, దేశం, బీజేపీ, నరేంద్ర మోదీ అన్నవి ఒక్కటైపోయాయి.

అయితే ఈ ప్రకటనలను నిశితంగా గమనిస్తే, వాటి కింద ఉన్న 54 అంశాల ద్వారా మోదీ నాయకత్వంలో దేశ ప్రతిష్ట శిఖరాగ్రాలకు చేరుతోందని చెప్పడానికి ప్రయత్నించారు. అయితే వాటిని చదివితే, ప్రభుత్వం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న విషయాలు కనిపిస్తాయి.

Image copyright Getty Images

'ప్రపంచం నూతన భారతదేశాన్ని గమనిస్తోంది'

ప్రభుత్వ ప్రచారంలో - 'యువశక్తితో మారుతున్న భారతదేశం', 'యువశక్తి పురోగమించడానికి అద్భుత అవకాశాలు', 'విశ్వవ్యాప్తంగా అభివృద్ధికి కేంద్రంగా మారిన భారత్', 'ప్రపంచమంతా యోగను ఉత్సాహంగా స్వీకరించింది' వంటి వాక్యాలు కనిపిస్తాయి.

మొదటి మూడూ సాధించిన విజయాలు కాదు, నినాదాలు. ఇక యోగ అనేది ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డాలర్ల మార్కెట్‌గా ఉంది. బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా తమ విజయంగా చెప్పుకుంటోంది.

దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు - ప్రభుత్వ, ప్రైవేట్, పర్సనల్ రంగాల్లో యువత కోసం ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి అంటోంది.

దాంతో పాటు ప్రభుత్వం ఉపాధి రంగంలో మరో కొత్త విభాగాన్ని కలిపింది - అదే 'పర్సనల్'. దీనినే మోదీ విమర్శకులు 'ప్రధానిమంత్రి పకోడా రోజ్‌గార్ యోజన' అని ఎద్దేవా చేస్తుంటారు. కానీ వ్యంగాన్ని పక్కన పెడితే, పకోడీ విక్రేతల ఉద్యమాన్ని ప్రభుత్వం తన ఖాతాలోకి ఎలా వేసుకుంటుంది?

Image copyright Getty Images

అంతా మిథ్య

మొత్తం 54 అంశాలలో, చాలావాటిని కొంచెం పరిశీలిస్తే చాలు, అదంతా అబద్ధం లేదా మిథ్య అని అర్థమైపోతుంది.

ప్రతి గ్రామంలో విద్యుత్ విషయాన్ని తీసుకుందాం. భారతదేశంలో విద్యుత్ లేని గ్రామాల గురించి కథనాలు ప్రసారం చేయని టీవీ ఛానెల్ లేదు. దేశంలో ఇప్పటికీ ఇంకా సుమారు 3 కోట్ల ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. వాటిలో కోటి ఇళ్లు ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్నాయి.

అదే విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలో 7 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. నిజానికి క్షేత్రస్థాయిలో ఎన్ని మరుగుదొడ్లు నిర్మించారు, వాటిలో ఎన్నింటికి నీటి సరఫరా ఉంది, వాటిలో ఎన్ని పని చేస్తున్నాయి అన్న వివరాలు మాత్రం లేవు. వాటిని నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మని వాళ్లు నమ్మరు.

అయితే ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి. పరిశుభ్రతను ఈ ప్రభుత్వం ఒక జాతీయ అజెండాగా మార్చింది. పగలూ రాత్రి ప్రచారంతో ప్రజల ధోరణిలో మార్పు వచ్చింది. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.

మోదీ ప్రభుత్వంలో విజయవంతమైన మరో పథకం ఉజ్వల పథకం. దీని కింద ప్రభుత్వం 3.75 కోట్ల మంది పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించింది.

ప్రభుత్వం తమ విజయాలుగా చెప్పుకుంటున్న మొత్తం 54 అంశాలలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మూడుసార్లు ప్రస్తావించారు. 7 కోట్ల మరుగుదొడ్లను, ఉజ్వల పథకాన్ని రెండేసిసార్లు ప్రస్తావించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్వచ్ఛ భారత్‌పై ప్రభుత్వం గొప్పలు

ఇవీ ప్రభుత్వ విజయాలేనా?

'భారతదేశంలో ఏసీ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యతో పోలిస్తే, విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరిగింది' అని ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఇది చదివితే నవ్వు రాదూ? రైళ్లను ప్రభుత్వం నడుపుతుంటే విమానాలను నడిపేది ఎయిర్ ఇండియా కాకుండా మిగతావన్నీ ప్రైవేట్ సంస్థలే.

అంతే కాకుండా 2017-18 సంవత్సరం రైల్వేలకు భద్రతపరంగా అత్యుత్తమ ఏడాదిగా పేర్కొన్నారు. కానీ అది కూడా వాస్తవదూరమే.

అదే విధంగా 'ఎక్కువ మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు' అంటూ దానినీ తమ ఖాతాలో వేసుకున్నారు.

కొన్ని వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 'ఇప్పటివరకు ఎన్నడూ లేనంత ఎక్కువ నల్లధనం బయటపడింది' అన్నది. కానీ నిజం ఏమిటంటే, మొత్తం ధనం రిజర్వ్ బ్యాంక్‌కు చేరింది. దానిని ఇంకా లెక్కపెట్టడం పూర్తి కాలేదు.

'ఇది వెనుకబడిన వర్గాల వారి ప్రభుత్వం', 'ఎస్సీ, ఎస్టీ చట్టం బలోపేతం చేశాం' లాంటి ప్రకటనలూ ప్రశ్నార్ధకమే. మరి దళితుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందంటున్న బీజేపీ దళిత ఎంపీలు అబద్ధం చెబుతున్నారా?

ప్రభుత్వం రైతు శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నాం అంటుండగా, వ్యవసాయం అభివృద్ధి రేటు నాలుగేళ్లలో 5.6 శాతం నుంచి 3 శాతానికి పడిపోయింది.

Image copyright Getty Images

హామీల సంగతేంటి?

విడిభాగాలతో తయారు చేసిన సింహం గుర్తుందా? మోదీ ప్రభుత్వం ప్రకటించుకున్న 54 అంశాలలో పాపం ఆ సింహానికి స్థానం దక్కలేదు. గత నాలుగేళ్లలో పారిశ్రామిక ఉత్పాదనపరంగా కానీ, ఎగుమతుల పరంగా కానీ ఆశాజనకమైన ధోరణి కనిపించడం లేదు.

ఉమాభారతి నమామి గంగా, 'డిజిటల్ ఇండియా' ప్రచారం ఊసు లేదు. స్కిల్ ఇండియా పథకం కింద కోటి మందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు కానీ వాళ్లకు ఉద్యోగాల మాటేమిటి?

నాలుగేళ్ల కాలంలో ఏ ప్రభుత్వమైనా, ఏమీ చేయలేదని చెప్పలేం. ఈ ప్రభుత్వం కూడా జనసురక్ష పథకం, రహదారులను మెరుగుపరచడం, స్టెంట్ల ధరలను తగ్గించడం లాంటి అనేక పనులు చేసింది.

రాజకీయ పార్టీలు చాలా హామీలు చేస్తాయి. ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. కానీ విచక్షణ కలిగిన పౌరులు ప్రచార హోరును పట్టించుకోకుండా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)