'మాదాల రంగారావు లేకుంటే గాయకుడిగా నేనెక్కడ?': వందేమాతరం శ్రీనివాస్

  • 28 మే 2018
వందేమాతరం Image copyright Facebook/Madala Ravi

"మాదాల రంగారావు లేకపోతే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నేను లేను" అని ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు.

తెలుగు సినీరంగంలో 'రెడ్ స్టార్'గా పేరు గాంచిన మాదాల రంగారావు (69) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారన్న విషయం తెలిసిందే.

మాదాల తీసిన 'ఎర్ర' సినిమాలకు ఎలా ప్రత్యేకత ఉందో ఆయన సినిమాల్లో పాటలకూ అంతే ప్రత్యేకత ఉంది.

గ్రామసీమల్లో జనాలు పాడుకునే పాటల బాణీలే మాదాల సినిమాలకు పేరు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1980-90 దశకాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పాటలు బాగా ప్రజాదరణ పొందాయి.

మాదాల సినిమాల్లో పాటల ప్రత్యేకత గురించి ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌తో బీబీసీ మాట్లాడింది.

"మాదాల తన కోసం కాకుండా ప్రజల కోసమే సినిమాలు తీశారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమాలకు నన్ను పరిచయం చేసింది ఆయనే. ఆయనతో నాది నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం" అని వందేమాతరం అన్నారు.

మాదాల నిర్మించిన 'స్వరాజ్యం' సినిమాలో తొలిసారి పాడిన ఆయన ఇప్పటి వరకు 3000కు పైగా పాటలు పాడారు.

Image copyright Madala Ravi

'తొలి ఎర్ర హీరో రంగారావే'

1980లో మాదాల రంగారావు నిర్మించిన తొలి సినిమా 'యువతరం కదిలింది' ఆనాటికి ఓ సంచలనం. అప్పటి వరకు ఎక్కువగా పగ-ప్రతీకారాలు, ప్రేమ వంటి అంశాలే కథావస్తువులుగా కొనసాగుతున్న తెలుగు సినిమాను ఆయనో మలుపు తిప్పారు.

మాదాల సినీరంగ ప్రయాణం గురించి ఆయన సహచరుడు, ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో బీబీసీ మాట్లాడింది.

"ఒంగోలు సమీపంలోని మైనంపాడు గ్రామం ఆయన జన్మస్థలం. పుట్టింది 'అగ్ర' కుల, భూస్వామ్య కుటుంబంలో అయినప్పటికీ బాల్యం నుంచే ఆయన పేద, బడుగుల జీవితాల గురించి ఆలోచించేవారు" అని ఆయన చెప్పారు.

‘‘ఆనాటికి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉండడమే దీనికి నేపథ్యం’’ అని అన్నారు.

ప్రజానాట్యమండలికి చెందిన నల్లూరికి మాదాల రంగారావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నిర్మించిన చాలా చిత్రాల్లో నల్లూరి నటించారు.

భుజానికి ఓ జోలెసంచి వేలాడేసుకొని తెల్లటి లాల్చీ, పైజామాలో కనిపించే నల్లూరి 'మాస్టారు' పాత్ర మాదాల తీసిన ప్రతి సినిమాలోనూ ఉండేదంటే అతిశయోక్తి కాదు.

మాదాలతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ నల్లూరి .. "అప్పటి వరకు నాటకాలు వేయడం, వేయించడం మాత్రమే తెలిసిన నన్ను సినిమాల్లోకి లాగింది రంగారావే. నీతో ఎలాగైనా సినిమాల్లో వేషాలు వేయిస్తా అంటూ ప్రతి సినిమాలోనూ నాకోసం ఓ పాత్రను సృష్టించే వాడాయన" అని గుర్తు చేసుకున్నారు.

Image copyright Madala Ravi

శ్రీశ్రీతో దోస్తీ

ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడే ఆయన కమ్యూనిస్టు భావజాలంవైపు మొగ్గుచూపడం ప్రారంభమైందని నల్లూరి తెలిపారు.

హాస్టల్లో ఉంటున్న సమయంలో ఆయన తన మిత్రబృందంతో కలిసి తరచూ నాటకాలు వేసేవారని, వారు వేసిన నాటకాలకు బాగా ప్రజాదరణ లభించిందని ఆయన చెప్పారు.

"అప్పుడే ఆయన ఏఐఎస్ఎఫ్‌ విద్యార్థి సంఘంలో చేరారు. ఆ రోజుల్లో ఒంగోలులో ఏఐఎస్ఎఫ్ బలంగా ఉండేది."

"ఆ అబ్బాయి హైస్కూల్‌లో చదివేటప్పటి నుంచే నాకు బాగా పరిచయం. శర్మ కాలేజీలో సాంస్కృతిక కార్యకలాపాలు బాగా జరుగుతుండేవి. నేనూ వారితో నాటకాలు వేయించేవాడిని."

"మాదాల బృందం వేసిన 'సంభవామీ యుగే యుగే' అనే నాటకం చాలా ప్రజాదరణ పొందింది. దాన్ని దాదాపు 60-70 సార్లు వేశాం. తమిళంలో చో రామస్వామి రాసిన నాటకం దానికి మూలం. బొల్లిముంత శివరామకృష్ణ దాన్ని తెలుగీకరించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది. దేశం కాంట్రాక్టర్ల రాజ్యంగా మారిపోతోంది’ అనేది ఆ నాటకంలో విషయం. రంగారావు విష్ణుమూర్తి వేషం వేసేవారు."

"ఆ తర్వాత ఆయన విశాఖ వెళ్లి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏలో చేరారు. నీలం రాజశేఖర్ రెడ్డితో ప్రబావితుడై ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారు" అని నల్లూరి తెలిపారు.

"ఆ తర్వాత మాదాల చెన్నై వెళ్లి సొంతంగా సినిమాలు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు. మిత్రుల సహకారంతో ఆయన 'యువతరం కదలిగింది' సినిమా తీశారు. అది 100 రోజులు ఆడింది. ఆ తర్వాత 'ఎర్రమల్లెలు' తీశారు. అదీ 100 రోజులు ఆడింది. ఆ తర్వాత 'విప్లవశంఖం', 'ప్రజాశక్తి', 'మహా ప్రస్థానం' ఇలా 8-9 సినిమాలు చేశారు. అయితే వాటిలో కొన్ని అంతగా ఆడలేదు" అన్నారు నల్లూరి.

"ప్రముఖ కవి శ్రీశ్రీ పాటలు మాదాల సినిమాలో ఎక్కువగా ఉండేవి. ఆయన మాదాలకు చాలా సన్నిహితుడు, స్నేహితుడు. మాదాలకు శ్రీశ్రీ అండదండలు లభించాయి. మహాప్రస్థానం సినిమాకు మాటలు కూడా ఆయన శ్రీశ్రీతోనే రాయించారు" అని నల్లూరి తెలిపారు.

శ్రీశ్రీ రాసిన 'కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు' పాట మాదాల నిర్మించిన 'విప్లవశంఖం' సినిమాలో ఓ హైలైట్.

సినిమాలను స్టూడియోల్లో కాకుండా మొత్తంగా ఔట్‌డోర్‌లోనే పూర్తి చేసే ఓ కొత్త సాంప్రదాయానికి కూడా మాదాల పునాది వేశారని ఆయనన్నారు.

"ఆయన తీసిన కొన్ని సినిమాలు ఒంగోలు పరిసర గ్రామాల్లోనే షూట్ చేశారు. వారికి గ్రామస్థుల సహకారం లభించడమే కాదు. సినిమాకు అవసరమైన కొన్ని పాత్రలు కూడా గ్రామస్థులే స్వచ్ఛందంగా వేసేవారు."

Image copyright Madala Ravi

'విప్లవ శంఖం' చూసిన నాటి రాష్ట్రపతి నీలం

మాదాల వరుసగా 'విప్లవ' సినిమాలు తీస్తుండడంతో సెన్సార్ బోర్డు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆయన 1982లో నిర్మించిన 'విప్లవ శంఖం' సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. దాంతో ఈ సినిమాలో కొన్ని కత్తిరింపులు కూడా చేయాల్సి వచ్చింది.

"ఆ తర్వాత మేం దిల్లీకి వెళ్లి ఈ సినిమాను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి చూపించాం" అని నల్లూరి తెలిపారు.

Image copyright Madala Ravi

'అడవిలో పూసే ఎర్రపూలను సినిమా వనంలో పూయించాడు'

'భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాల దోపిడీ, దౌర్జన్యాల పట్ల అట్టడుగు సమూహాల్లో ఉండే ఆగ్రహావేశాలను తెరపైకి ఎక్కించడం ద్వారా మాదాల ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు' అని సీనియర్ పాత్రికేయుడు శ్రీరామమూర్తి అన్నారు.

"ఆనాటికి సోషలిస్టు, సమానత్వ భావాలతో కొందరు సినిమాలు తీసినప్పటికీ సెల్యులాయిడ్‌పై ఎర్ర జెండా చేత పట్టుకున్న తొలి హీరో మాత్రం రంగారావే."

ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు భావజాలమే ఆయనలోని కళకు సానపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఆయన సాధారణ తెలుగు ప్రేక్షకులకు 'ఎర్ర' స్పృహ కలిగించారు. ఆ తర్వాత నారాయణమూర్తి లాంటి వారికి ఆయన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు" అని శ్రీరామమూర్తి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ నష్టం.. విమర్శించిన మూడు కీలక వైద్య, ఆరోగ్య సంస్థలు

క‌రోనావైర‌స్ విజృంభిస్తున్న వేళ ప్రజలు సామాన్య జీవితం గడపడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు

బంకర్‌‌లో దాక్కున్న ట్రంప్.. వైట్‌హౌస్ సమీపంలో హింసాత్మక ఘటనలతో జాగ్రత్తపడిన భద్రతా సిబ్బంది

భార‌త్‌లో కేసులు పెరుగుతున్నా లాక్‌డౌన్‌ను ఎందుకు స‌డ‌లిస్తున్నారు

ప్రైవేటు రోదసినౌకలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వ్యోమగాములు

ఇండియాలో ఆన్‌లైన్ మోసాలు 600 శాతం పెరిగాయి.. ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి

క్రికెట్ మళ్లీ మొదలైతే ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు

రైళ్లు మొదలయ్యాయి.. ప్రయాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలేమిటి?

వలస కూలీలకు సహనం లేదు - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్