ప్రెస్ రివ్యూ: హోదాపై బాబు ముప్పైయారు సార్లు మాటమార్చారంటూ పవన్ కల్యాణ్ మండిపాటు

  • 28 మే 2018
Image copyright facebook.com/janasenaparty

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు 36 సార్లు మాటమార్చారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించినట్టు 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

ఓటుకు నోటు కేసులో భయపడే కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించలేదని పవన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన వైసీపీతోనైనా, బీజేపీతోనైనా కలిసే పోటీచేస్తారని వ్యాఖ్యానించారు.

"ఆంధ్రప్రదేశ్‌.. దేశంలో అంతర్భాగమే. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు. రాష్ట్రానికి హోదా ఇవ్వకుంటే మరింత వెనక్కి పోతుంది. ప్రధానమంత్రి గారూ.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనకబడింది" అని అన్నారు.

"హోదా కోసం జనసేన పోరాడితే టీడీపీ తక్కువచేసి మాట్లాడింది. ఇప్పుడేమో ధర్మపోరాట దీక్షలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాల వల్ల కేంద్రం వద్ద అలుసైపోయాం" అని పవన్ వ్యాఖ్యానించారు.

మోదీ ప్రభుత్వం విభజన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

"రాష్ట్రంలో ఇసుకమాఫియా డబ్బంతా టీడీపీ నేతల వద్దే ఉంది. భూమి కనపడితే చాలు లొట్టలేసుకుని మరీ పంచుకుంటున్నారు" పవన్ కల్యాణ్ ఆరోపించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

"అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేస్తాం. మా తండ్రి కానిస్టేబుల్‌. ఉద్యోగి కష్టాలు మాకు బాగా తెలుసు. సీపీఎస్‌తో ఉద్యోగులు ఎంత నష్టపోతున్నారో అర్థమైంది" అన్నారు.

శ్రీకాకుళం జిల్లా పోరుయాత్రలో భాగంగా ఆదివారం నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటించారు.

Image copyright Getty Images

డబ్బు కట్టలేదని మృతుడి అవయవాలు కాజేశారు!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని చికిత్సకైన ఖర్చును కుటుంబ సభ్యులు చెల్లించలేక పోవడంతో సదరు ఆసుపత్రి ఆ యువకుడి శరీరం నుంచి అవయవాలను కాజేసిందంటూ 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం పట్టణంలో చోటుచేసుకుంది.

కేరళ పాలక్కాడ్‌ జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామానికి చెందిన మణికంఠన్‌(24) రోడ్డు ప్రమాదంలో ఇటీవల తీవ్రంగా గాయపడగా సేలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

చనిపోయే సమయానికి మణికంఠన్‌ చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చవ్వగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సుకు మరో రూ. 25 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం మణికంఠన్‌ కుటుంబీకులను కోరింది.

ఆ డబ్బును తాము కట్టలేమని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులను మోసం చేసి కొన్ని పత్రాలపై ఆసుపత్రి యాజమాన్యం సంతకాలు చేయించుకుంది.

అనంతరం ఆ మృతదేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలను తీసుకుంది.

ఈ విషయాన్ని ఇంటికెళ్లాక గుర్తించిన మణికంఠన్‌ కుటుంబీకులు వెంటనే పాలక్కాడ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం సీఎం పినరయి విజయన్‌ దృష్టికి వెళ్లింది. ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాస్తూ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అధికారులు విచారణ జరిపి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించారని సాక్షి తెలిపింది.

Image copyright STR/AFP/Getty Images

నాలాంటి వాళ్లని తయారు చేసి చిత్రసీమలోకి వదులుతా: వర్మ

''నన్నందరూ ప్రేమగా సెల్యులాయిడ్‌ టెర్రరిస్ట్‌ అంటుంటారు. నాలాంటివాళ్లని మరింతమందిని తయారు చేసి చిత్రసీమలోకి వదులుతా'' అని రాంగోపాల్‌ వర్మ అన్నారని 'ఈనాడు' రాసింది.

ఆ కథనం ప్రకారం.. వర్మ ఇప్పుడో సినిమా స్కూల్‌ ప్రారంభించనున్నారు. అదే.. 'ఆర్జీవీ అన్‌స్కూల్‌'. శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానుంది. దీనికి వర్మ క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేయనున్నారు.

"ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టిట్యూట్ల వాళ్లంతా అతి పురాతనమైన పద్ధతులనే అనుసరిస్తున్నారనిపిస్తోంది. 'ఆర్జీవీ అన్‌స్కూల్‌' భిన్నంగా ఉండబోతోంది. ప్రత్యేకించి పాఠాలు, తరగతి గదులు ఉండవు. ఇక్కడ ఏం నేర్పరు. మీలో ఉన్న ప్రతిభని వెలికితీసే ప్రయత్నం చేస్తారు.

హైదరాబాద్‌, ముంబయి, అమెరికాల్లో స్కూల్‌ నిర్వహించబోతున్నాం. అడ్మిషన్లు ఎప్పుడు, ఆ విధానం ఏమిటన్నది మరో ఇరవై రోజుల్లో చెబుతాం" అని రామ్ గోపాల్ వర్మ వివరించారు.

చంద్రబాబు Image copyright facebook.com/tdp.ncbn.official

కమలనాథులకు మళ్లీ అధికారం కల్లే: చంద్రబాబు

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే అసలే లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

'కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం పెద్దగా లేదు. భాజపా అసలే రాదు. ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్లే. మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ఈ పార్టీల్లో సమర్థులైన నాయకులున్నారు. వారిని ఎవరూ దెబ్బతీయలేరు. అలా చేయాలనుకుంటే వారు బొబ్బిలిపులిగా ఎదురు తిరుగతారు. కొండవీటి సింహాలై గర్జిస్తారు. కర్ణాటకలో అదే జరిగింది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు జాతి ప్రయోజనాల కోసం ఒకే వేదికపైకి వచ్చాయి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

విజయవాడలో ఆదివారం ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన ప్రారంభోపనాస్యం చేశారు.

"తిరుపతి వెంకటేశ్వర స్వామి నగల దొంగతనం జరిగిందని, లేని వజ్రాలు ఉన్నాయని బురద జల్లుతున్నారు. ఇదంతా భాజపా కుట్ర. పురావస్తుశాఖ పరిధిలోకి తితిదేను తీసుకుంటామని నోటీసిచ్చి ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయాన్నీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ కబ్జా చేయాలనుకున్నారు" అని చంద్రబాబు ఆరోపించారని ఈనాడు తన కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వలస కార్మికుల ఆకలి, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఏం చర్యలు చేపట్టారు?: సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

‘పాకిస్తాన్‘ మిడతల దండుపై యుద్ధానికి సిద్ధం.. సరిహద్దులోనే సంహరించాలి: కేసీఆర్

''లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేదు.. ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగతనం చేశా''

‘‘మోదీ జీ.. అది నా పావురం.. వెనక్కు ఇప్పించండి’’ - పాకిస్తాన్ గ్రామస్తుడి వినతి

‘ఫాల్కన్’ రాకెట్ మీద ‘క్రూ డ్రాగన్’ అంతరిక్షయానం: నాసా ‘ప్రైవేటు’ మిషన్ గురించి 10 ప్రశ్నలు

వీడియో: కరోనావైరస్ - 3డీ ఫేస్ మాస్కులు ఇవి

భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ

మోదీ 2.0: ఏడాది పాలనలో కనిపించిన ధోరణులు ఇవీ...

బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి