కుమారస్వామి ఇంటర్వ్యూ: అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదు

  • 28 మే 2018
కుమారస్వామి Image copyright MANJUNATH KIRAN/GettyImages

దేశంలో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని, అవినీతిపరులైన విపక్ష నాయకులంతా ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడాన్ని కర్ణాటక సీఎం కుమారస్వామి తప్పుబట్టారు.

"ఎవరా మాట అనేది? గత నాలుగేళ్ల కాలంలో ఆయనేం చేశారు? ఇప్పుడు దేశంలో అవినీతి లేదంటారా? ఆయన మంత్రివర్గ సహచరుల్లోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారస్వామి అన్నారు.

"కర్ణాటకలో అడ్డదారులు తొక్కి యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నించిన మోదీ, అమిత్ షాలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మోదీ ఇప్పుడు అవినీతిని ఎలా అడ్డుకుంటారట?" అని కుమారస్వామి ప్రశ్నించారు.

Image copyright @INCIndia

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. "నల్లధనం, అవినీతిపై మేం చేస్తున్న పోరాటం బద్ధ శత్రువులు ఇప్పుడు స్నేహితులుగా మారేలా చేసింది. మా పోరాటం వాళ్లను ఏకం చేసి, ఒకే వేదికపైకి వచ్చేలా చేసింది. భారీ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు చేతులు కలుపుతున్నారు" అని మోదీ అన్నారు.

ఇటీవల బెంగళూరులో జరిగిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 23 పార్టీల నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, దిల్లీ ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ, తదితర నాయకులు ఉన్నారు.

కటక్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చేసినవే.

Image copyright Getty Images

"దేశ ప్రయోజనాల కోసమే కూటమి"

"వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఒక్కచోటుకి రావడం అనేది.. ఒక ఉమ్మడి వేదికను తయారు చేసే చిన్న ప్రయత్నం. అది ఏదో ఒక్క నాయకుడి స్వప్రయోజనం కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం. ఆ వేదిక విజయవంతం అయ్యేందుకు మొన్నటి కార్యక్రమం దోహదపడుతుంది" అని కుమారస్వామి అన్నారు.

మోదీకి వ్యతిరేకంగా ఒక నేతను నిలబెట్టడం కంటే, ఉమ్మడిగా ముందుకెళ్లడమే ఉత్తమమన్న ఆలోచనతోనే విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని కుమారస్వామి తెలిపారు.

దేశవ్యాప్తంగా అనేక సమస్యలున్నాయి. అలాగే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన ప్రత్యేక సమస్యలు నెలకొని ఉన్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా ఆ సమస్యలపై దృష్టిపెడితే ప్రజలు మనల్ని నమ్ముతారని ఆయన వివరించారు.

"జాతీయ స్థాయిలో ఆ కూటమికి తాను ఉత్ర్పేరకం లాంటి వ్యక్తినేమీ కాబోనని ఆయన అంటున్నారు.

"ఆ కూటమిలో నేను చాలా చిన్న వ్యక్తిని. కర్ణాటకను అభివృద్ధి చేయడం వరకే నేను పరిమితం. మా నాన్న(మాజీ ప్రధాని దేవె గౌడ)కు సొంత పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో ఆయన ఉత్ర్పేరకంగా పనిచేయొచ్చు" అని కుమారస్వామి అన్నారు.

అయితే, కర్ణాటక విషయంలో "మేము(కాంగ్రెస్, జేడీ(ఎస్)) పరస్పర అవగాహనతో కలిసి పనిచేస్తాం. ఏ సమస్య వచ్చినా, పరిష్కరించేందుకు నేను ప్రయత్నిస్తా. అది దేవె గౌడ, సోనియా గాంధీల దాకా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు" అని అన్నారు.

Image copyright Getty Images

స్వామి.. రుణ మాఫీ హామీ ఏమయ్యింది?

పారిశ్రామికవేత్తలకు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ప్రకటించినట్టుగానే.. అన్నదాతలను కూడా ఆదుకోవాల్సిన అవసరముందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.

"రుణ మాఫీ అనేది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. గత మూడేళ్లుగా కర్ణాటకలో రైతులు కరవు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రూ.58,000 కోట్ల పంట నష్టపోయారు.

"రైతులకు మార్కెటింగ్ సదుపాయం మాత్రమే కాదు, వ్యవసాయ పద్ధతులు మారాలి. ఆ మార్పు రాకపోతే, రైతు కుటుంబాల సమస్యలను పరిష్కరించలేం. ఈ విషయంలో రైతులను ఒప్పించాల్సిన అవసరముంది" అని ఆయన అన్నారు.

ఎన్నికలకు ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కుమారస్వామి, మాట మీద నిలబడలేదంటూ బీజేపీ రాష్ట్రవ్యాప్త(బెంగళూరు మినహా) బంద్‌కు పిలుపునిచ్చింది.

అయితే, తమ పార్టీ సొంత బలంతో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే రైతు రుణాలు మాఫీ చేస్తానన్న మాట నిజమేనని కుమారస్వామి తెలిపారు.

కానీ, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినందున, నిర్ణయం తీసుకునేముందు తమ భాగస్వామ్య పార్టీతోనూ చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.

గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)