కథానాయకుడు ఎన్టీఆర్: ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ నుంచి ‘జన్మభూమి నా దేశం నమో నమామి’ వరకు

  • చిట్టత్తూరు హరికృష్ణ
  • బీబీసీ ప్రతినిధి
ఎన్టీఆర్

ఫొటో సోర్స్, jrntr/facebook

ఎన్టీఆర్ అంటే మొదట గుర్తొచ్చేది సినిమాలు.. ఆ తర్వాత రాజకీయాలు. ఈ రెండు రంగాల్లో ఆయన ప్రయాణంలో ఆసక్తికరమైన మలుపుల గురించి చాలా మందికి తెలిసిందే.

తన రాజకీయాలకు రహదారిగా మార్చుకున్న వెండితెరపై సంభాషణలతో ఆకట్టుకున్న ఎన్టీఆర్, తన సినిమాల్లో పాటలతో ఉపయోగకరమైన సందేశాలు, దేశభక్తి భావాలు అందించే ప్రయత్నం చేశారు.

కుటుంబ సంబంధాలు, ధర్మం, న్యాయం, చట్టం అన్నిటినీ తన సినిమా పాటల్లో స్పృశించారు.

ఏదైనా సినిమాలో ఎన్టీఆర్ సోలో సాంగ్ అందుకున్నారంటే థియేటర్లు ప్రేక్షకుల విజిల్స్‌తో దద్దరిల్లేవి. ఆ పాటలు చదువురాని సామాన్యుడిలో కూడా ఆలోచనలు రగిలించేవి.

ఆ పాటలు పాడేది తెర వెనుక గాయకులే అయినా వాటికి తెరపై ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు ఎన్టీఆరే. తన అభినయంతో ఆ పాటలను తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపారని ఆయన అభిమానులు భావిస్తారు.

ఫొటో సోర్స్, facebook.com/jrntr

కెరీర్‌లో అప్పటికి పది సినిమాలు అయ్యాయో లేదో.."పల్లెటూరు" సినిమాలో "చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా" అనే పాటతో ఉర్రూతలూగించారు ఎన్టీఆర్.

ఒకరకంగా ఆ సినిమా నుంచే ఆయన తన సందేశాత్మక గీతాల ప్రస్థానం ప్రారంభించారని చెప్పొచ్చు. ఆలపించినవే కాదు, "పిచ్చి పుల్లయ్య" లాంటి సినిమాలో "బస్తీకి పోయే పల్లెటూరివాడిని, బస్తీ మోసం చేస్తుంది జాగ్రత్త" అంటూ పారా హుషార్ అన్నారు.

"మిస్సమ్మ" సినిమాలో "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" అన్న పాటలో పూర్తిగా ఒదిగిపోయారు ఎన్టీఆర్.

ఆయనే "కన్యాశుల్కం"లో గిరీశం పాత్రలో ఒళ్లో పడని వనిత కోసం ‘‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా" అంటూ మదనపడిపోయారు. "వాటం చూసి వడుపు చేసి వంచనా కొమ్మను వంచనా" అంటూ పరిష్కారం కూడా వెతికేశారు.

ఇలా బ్లాక్ అండ్ వైట్ జమానాలో వచ్చిన చాలా సాంఘిక సినిమాల్లో అంతా తన సోలో పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్.

"శ్రీకృష్ణ పాండవీయం" లాంటి పౌరాణికాల్లో సైతం "మత్తు వదలరా, మత్తులో ఉంటే గమ్మత్తుగా చిత్తవుదువురా" అంటూ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, facebook.com/jrntr

బ్లాక్ అండ్ వైట్ తర్వాత "ఈస్ట్ మన్ కలర్" టైంలో కూడా తన ట్రెండ్ కొనసాగించారు.

"దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా, కనండి దేవుడి లీల, వినండి మనుషుల గోల" అంటూ దేవుడు చేసిన మనుషులులో ఇద్దరికీ అనుసంధాన కర్త అయ్యారు ఎన్టీఆర్.

ఆ తర్వాత "మనుషులంతా ఒక్కటే"లో "అనుభవించు రాజా" అంటూ విలాస పురుషుడుగా నాటి యువతలో జోష్ తీసుకొచ్చారు. కానీ ఆయనే మళ్లీ "నేరం నాది కాదు ఆకలిది"లో "మంచిని సమాధి చేస్తారా ఇది మనుషుల చేసే పనియేనా" అంటూ సమాజాన్ని ప్రశ్నించారు.

"బంగారు మనిషి"లో తన హీరోయిన్ తో కలిసి "ఎక్కడికెళ్తోంది, దేశం ఏమైపోతోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈస్ట్‌మన్ నుంచి తెలుగు సినిమా స్కోప్ కు మారాక "అడవిరాముడు"గా తెరనిండుగా కనిపించిన ఎన్టీఆర్, "మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ... కృషి ఉంటే మనుషులు రుషులవుతారు" అంటూ సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత "యమగోల" సినిమాలో యమ కింకరులను కూడగట్టి ఏకంగా యముడిపైనే "సమరానికి ఆరంభం" చేశారు.

ఫొటో సోర్స్, facebook.com/jrntr

ఫొటో క్యాప్షన్,

ఎన్టీఆర్, కృష్ణ

కొన్ని పాటలతో కుటుంబ సంబంధాలను హత్తుకునేలా చూపారు ఎన్టీఆర్.

"డ్రైవర్ రాముడు"లో కళ్లు కనిపించని చెల్లెలికి కాబోయే భర్త గురించి "ఏమని వర్ణించనూ" అని బాధపడినా, "రెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాలా ప్రేమా" అంటూ "గజదొంగ"లో భగ్న ప్రేమికుడుగా బాధపడినా, "కొండవీటి సింహం"లో "మా ఇంటిలోన మహలక్ష్మి నీవే" అంటూ చివరిదశలో ఉన్న భార్యను ఓదార్చినా ఆ అభినయం తనకే సాధ్యం అన్నట్టుగా నటించారు.

ఎన్టీఆర్ సినిమాల్లో మానసిక సంఘర్షణలు కూడా ఆయన పాటలతోనే ప్రేక్షకులకు అర్థమయ్యేవి.

యుగంధర్‌లో "ఒరబ్బా ఏసుకున్నా కిళ్లీ" అంటూ అందరితో స్టెప్పులేయిస్తూ, మాఫియా గుప్పిట్లో ఎలా ఇరుక్కుపోయానో చెప్పిన ఎన్టీఆర్, "జస్టిస్ చౌదరి"లో "చట్టానికి-న్యాయానికి జరిగిన సమరంలో" నలిగిపోయారు. అదే ఎన్టీఆర్ "బొబ్బిలిపులి"లో సైనికుడుగా "తల్లికంటే పుణ్యభూమి గొప్పదిరా" అని చాటారు.

1952లో "పల్లెటూరు"లో నూనూగు మీసాల యువకుడుగా "తెలుగోడి కీర్తికి జై" కొట్టిన ఎన్టీఆర్, 1993లో మనవళ్లతో కలిసి "జన్మభూమి నా దేశం నమోః నమామి, పుణ్య భూమి నా దేశం సదా స్మరామి" అనే "మేజర్ చంద్రకాంత్" వరకూ కొన్ని వందల సందేశాత్మక గీతాలకు నటుడిగా ప్రాణం పోశారు.

తెలుగు వారి మనసులో అమూల్యమైన మాటల పాటలను శాశ్వతంగా నిలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)