కోబ్రాపోస్ట్: ఇంత పెద్ద వార్తను మీడియా ఎందుకు ఇవ్వలేదు?

  • జస్టిన్ రౌలట్
  • బీబీసీ ప్రతినిధి

నిజానికి ఆ వార్త భారత పత్రికల విశ్వసనీయతకే గొడ్డలి పెట్టులాంటిది. కానీ మీడియాలో దానికి అతి తక్కువ ప్రాధాన్యత లభించింది.

దానికి కారణం మరేం లేదు - ఆ వార్త భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మీడియా సంస్థలకు సంబంధించింది కావడమే.

తాము చేసిన శూలశోధనలో - భారతదేశంలోని అనేక మీడియా సంస్థలతో పాటు, అనేక మంది సీనియర్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు, జర్నలిస్టులు సొమ్మును తీసుకుని, దానికి ప్రతిఫలంగా అధికార బీజేపీ అజెండాకు అనుకూలమైన వార్తలను ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నట్లు కోబ్రాపోస్ట్ అనే వార్తా సంస్థ వెల్లడించింది.

కోబ్రాపోస్ట్ ఇలాంటి అండర్ కవర్ ఆపరేషన్లకు చాలా ప్రసిద్ధి. తనను తాను లాభాపేక్షలేని సంస్థగా చెప్పుకునే కోబ్రాపోస్ట్, 2017లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం స్థానాన్ని సూచించే సంఖ్య పేరిట దీనికి 'ఆపరేషన్ 136' అని పేరు పెట్టింది.

కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్‌లోని వీడియోలలో కొన్ని ప్రధాన వార్తాసంస్థల ప్రతినిధులు- సొమ్ములకు ప్రతిఫలంగా 'ప్రజల మధ్య మతపరమైన విభేదాలను పెంచి, ఎన్నికల ఫలితాలు ఒక నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా వచ్చేలా చేస్తా'మని చెప్పడం కనిపించింది.

అయితే ఇలాంటి అండర్ కవర్ ఆపరేషన్లను ఖచ్చితంగా విశ్వసించలేము. వీడియో ఫుటేజ్‌ను ఎక్కడపడితే అక్కడ తీసుకుని, ఎడిటింగ్ చేసి, మాటలను వక్రీకరించి మనకు కావాల్సిన అర్థాలను రాబట్టవచ్చు.

కోబ్రాపోస్ట్‌కు చెందిన అండర్ కవర్ రిపోర్టర్ పుష్ప్ శర్మ, భారతదేశంలోని సుమారు 25 ప్రముఖ మీడియా సంస్థల ముందు తన ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు.

తానొక అతి సంపన్నవంతమైన హిందూ మఠం ప్రతినిధినని చెప్పుకుంటూ శర్మ, వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలో ఉండేలా వార్తాకథనాలను ప్రచురిస్తే, భారీగా నగదును ఇస్తామని వారికి చెప్పారు.

ఇందుకాయన మూడంచెల వ్యూహాన్ని సూచించారు.

మొదట మీడియా సంస్థలు హిందూ విశ్వాసాలను, విలువలను ప్రబోధించే 'సున్నితమైన హిందుత్వ' వార్తలను ప్రచురించాలి. కృష్ణ భగవానుని ప్రవచనాలు లేదా భగవద్గీతలోని కథనాల ద్వారా ఇలాంటి పని చేయొచ్చు.

రెండో దశలో, బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు, మరీ ప్రత్యేకించి రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలి.

చివరగా, కొందరు హిందుత్వవాదుల రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రచురించాలి. ఇలా ఓటర్లను చీల్చడం వల్ల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం కలుగుతుందని పుష్ప్ శర్మ మీడియా ప్రతినిధులకు వివరించారు.

కోబ్రాపోస్ట్ ప్రతినిధి సంప్రదించినట్లుగా చెబుతున్న మీడియా సంస్థలలో - కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి ఎక్కువగా అమ్ముడవుతున్న 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రచురణ సంస్థ బెనెట్ కోల్‌మన్ కూడా ఉంది.

కోబ్రాపోస్ట్ న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను, ఇండియా టుడే గ్రూప్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. హిందీ వార్తాపత్రికలతో పాటు ప్రాంతీయ మీడియా సంస్థలపై కూడా శూలశోధన చేశారు.

కోబ్రాపోస్ట్ ప్రతినిధి సుమారు రెండు డజన్లకు పైగా మీడియా సంస్థలను సంప్రదించగా, కేవలం రెండు తప్ప మిగతావన్నీ బీజేపీ అనుకూల వార్తలు రాసేందుకు అంగీకరించాయి.

కోబ్రాపోస్ట్ వీడియోలలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు పుష్ప్ శర్మ చెప్పిన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తామో వివరించడం కనిపించింది.

కొంత మందైతే ఏకంగా ఈ అజెండాను అమలు చేయడానికి 'ప్రత్యేక బృందాల'ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నిజానికి వేరే దేశాలలో ఇలాంటి శూలశోధన బయటపడితే, అది దేశవ్యాప్తంగా పతాకశీర్షిక వార్త అయి ఉండేది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యేది.

కానీ భారతదేశంలో కేవలం ద వైర్, స్క్రాల్, ద ప్రింట్ లాంటి కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఈ వార్తకు ప్రాధాన్యతను ఇచ్చాయి.

'రివర్స్ స్టింగ్'

కోబ్రాపోస్ట్ ఆరోపణలపై కొన్ని మీడియా సంస్థలు స్పందించాయి. వీడియో ఫుటేజ్‌ను ఎడిట్ చేశారని, విషయాన్ని వక్రీకరించారని తెలిపాయి.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికా సంస్థ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘‘జరిగిన విషయానికి మార్పులు చేర్పులు చేసి, తప్పుగా చూపించారు. కోబ్రాపోస్ట్ ఆరోపణలు చేసిన ఏ మీడియా సంస్థ కూడా తాము అనైతికంగా ప్రవర్తించినట్లు అంగీకరించలేదు'' అని తెలిపింది.

బీజేపీకి అనుకూలంగా వార్తలు రాయడానికి తమ సంస్థకు వెయ్యి కోట్లు ఇవ్వాలని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ సంస్థ ఎం.డి. వినీత్ జైన్ డిమాండ్ చేశారని, చివరికి అందులో సగం మొత్తం ఇచ్చేలా బేరం కుదిరినట్లు కోబ్రాపోస్ట్ వీడియోలో ఉంది.

ఆ వీడియోలో.. పన్ను తప్పించుకోవడానికి ఆ డబ్బును ఏవిధంగా ఇవ్వాలో కూడా చర్చ జరిగింది. అయితే ఈ ఆరోపణలను ఆ ప్రచురణ సంస్థ ఖండించింది. అంతటితో ఆగక.. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన రివర్స్ స్టింగ్ ఆపరేషన్‌లో కోబ్రాపోస్ట్ అడ్డంగా దొరికిపోయిందని వార్త ప్రచురించింది.

''కోబ్రాపోస్ట్ తరఫున స్టింగ్ ఆపరేషన్ చేసిన శర్మ ఓ మోసకాడని మా ప్రచురణ సంస్థకు ముందే తెలుసు. ఆయన నిజరూపం బట్టబయలు చేసేందుకే తాము ఆయనతో చర్చలు జరిపాం'' అని ఆ సంస్థ తెలిపింది.

ఇండియా టుడే సంస్థ కూడా ఈ ఆరోపణలను ఖండించింది. తాము ఏ తప్పు చేయలేదని, తమ ఉద్యోగులు అనైతికంగా నడుచుకోలేదని చెప్పింది. దేశాన్ని, మతాన్ని, కులాన్ని విభజించే ఏ వార్తలనూ తమ పత్రికల్లో ప్రచురించం అని, ఛానెళ్లలో ప్రసారం చేయం అని తెలిపింది.

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ విషయమై స్పందిస్తూ.. ‘‘ఒక అండర్ కవర్ రిపోర్టర్, అడ్వర్జైజింగ్ ఎగ్జిక్యూటివ్‌కు మధ్య సమావేశం జరిగింది. అందులో.. ఓ వర్గానికి అనుకూలంగా ప్రకటనలు చేసేందుకు గల అవకాశాలపై మాత్రమే చర్చ జరిగింది. కులాలకు, మతాలకు మధ్య చిచ్చు పెట్టే ఎలాంటి ప్రకటనలను మేం ప్రోత్సహించం. మా ఉద్యోగులు కూడా ఎలాంటి ప్రకటనలైనా చట్టబద్దంగా ఉండాలని, వాళ్లకు స్పష్టం చేశారు’ అని పేర్కొంది.

భారత్‌లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో కోబ్రాపోస్ట్ ఆరోపణలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)