ప్రెస్‌రివ్యూ: కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బాబు కుట్ర చేశారు.. మోత్కుపల్లి ఆరోపణ

  • 29 మే 2018
Image copyright facebook.com/TDP.Official
చిత్రం శీర్షిక పాత చిత్రం

ఓటుకు నోటు ద్వారా రేవంత్‌రెడ్డితో కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు కుట్ర చేశారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారని నమస్తే తెలంగాణ రాసింది.

ఎన్టీఆర్‌పై కూడా చంద్రబాబు ఆనాడు కుట్రచేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారని మోత్కుపల్లి అన్నారు. చివరకు పిల్లనిచ్చిన మామనే చంపేశారంటూ కంటనీరు పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌వద్ద ఆయన విగ్రహానికి మోత్కుపల్లి నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అధికారం కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి, విభజించి, పాలించు విధానాన్ని అవలంబిస్తున్నారని తెలిపారు.

మాల, మాదిగల మధ్య కులా ల చిచ్చుపెట్టి ఇరువురినీ తనవైపునకు తిప్పుకునేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసును ముందుగానే పసిగట్టిన సీఎం కేసీఆర్.. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డిని దొంగలుగా నిలబెట్టారని చెప్పారు.

అప్పటి నుంచే టీడీపీ నైతికంగా పతనమైందన్నారు. నిందితులైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి కూడా చంద్రబాబు తీరని ద్రోహం చేశాడని ఆవేదన వ్యక్తంచేశారు.

చంద్రబాబును విమర్శించిన మోత్కుపల్లి నర్సింహులును టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.

బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరుగా మోత్కుపల్లి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. పదవులు రాలేదనే అక్కసుతోనే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Image copyright facebook.com/TDP.Official

గుజరాత్‌కు ఎంతిచ్చారు? మాకెంత ఇచ్చారు?

కేంద్రం ఇచ్చిన నిధులకు ఏపీ ప్రభుత్వం వినియోగపత్రాలు (యూసీ) ఇవ్వలేదని అమిత్‌షా ఏ అధికారంతో చెబుతారని సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారని ఈనాడు రాసింది.

తాము యూసీలు పంపించలేదని ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రులు చెబితే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతే తప్ప ఎలాంటి అధికారిక హోదా లేని అమిత్‌ షా లాంటి వ్యక్తులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హెచ్చరించారు.

ఏపీలో బీజీపే ఒంటరిగా పోటీచేస్తే వారికి ఓట్లేసే వారు ఒక్క శాతం కూడా లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'గుజరాత్‌ సహా వేరే రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వలేదని అమిత్‌షా చెబుతున్నారు. ఆ రాష్ట్రాలకు ఎంత డబ్బిచ్చారు? ఏపీ, తెలంగాణలకు ఎంతిచ్చారో చెప్పండి. అదే అంశంపై ప్రభుత్వం తరఫున ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ప్రత్యేకహోదా ఇవ్వలేదు. అదే సమయంలో దిల్లీ మెట్రోకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. గుజరాత్‌లో దలోరే నగరాన్ని రూ.98వేల కోట్లతో నిర్మించాలనుకుంటున్నారు' అని చంద్రబాబు తెలిపారు.

Image copyright Getty Images

వ్యవసాయ కూలీలకూ రూ.5 లక్షల బీమా?

రైతు సాధారణ బీమా తరహాలోనే వ్యవసాయ కూలీలకూ రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

దీనిపై జూన్‌ 2న నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రైతులతో పాటే కూలీల పేరిట కూడా ఎల్‌ఐసీకి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.

దీనిపై కసరత్తు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలు చేయనున్నారు. అదే రోజున వ్యవసాయ కూలీల బీమా కూడా ప్రారంభమవుతుంది.

18-60 ఏళ్ల మధ్య వయస్కులకు ఇది వర్తిస్తుంది. ఏడాది ప్రీమియం రూ.2271ను ప్రభుత్వం చెల్లిస్తుంది.

రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఎంత మంది ఉన్నారు? ఏ ప్రాతిపదికన గుర్తించాలి? ఎంత ఆర్థిక భారం పడుతుంది? అనే అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇంజనీరింగ్ కాలేజీ Image copyright Getty Images

ఇంజనీరింగ్ కాలేజీల వసూళ్ల దందా..

తెలంగాణలోని పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీలో భారీ దందా నడుస్తోందంటూ 'సాక్షి' ఓ కథనం రాసింది.

నిబంధనలను తుంగలో తొక్కి కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసేందుకు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి.

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్టియం సొంతంగా భర్తీ చేసుకునే సీట్లుపోగా.. 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో కన్వీనర్‌ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,055 సీట్లు కాకుండా) సీట్ల (70 శాతం)ను భర్తీ చేయనుండగా... యాజమాన్య కోటా (15 శాతం), ఎన్నారై/ఎన్‌ఆర్‌ స్పాన్సర్డ్‌ (15 శాతం) కోటాల కింద 26,389 సీట్ల (30 శాతం)ను భర్తీ చేస్తారు.

అయితే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో చేరే విద్యార్థులు ఎక్కువగా పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు.

దీంతో పలు కాలేజీలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కోసం ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.10 లక్షల వరకు డొనేషన్‌ డిమాండ్‌ చేస్తుండగా.. టాప్‌ కాలేజీలు రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.

ఐటీ, ఈసీఈ కోర్సులకు కాలేజీని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. ఈఈఈ, సివిల్‌తోపాటు ఇతర బ్రాంచీలకు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోందని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)