‘అనుకున్న అవకాశాలు రాకే చంద్రబాబుపై నిందలు’: మోత్కుపల్లి విమర్శలపై టీడీపీ

మోత్కుపల్లి

‘‘ఎన్‌టీ రామారావు గొంతు కోసినట్టే చంద్రబాబు నిన్న నా గొంతు కోసేశాడు’’ అంటూ.. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగిన మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి తనను బహిష్కరించినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ప్రకటించటంపై ఆయన పై విధంగా స్పందించారు.

అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆశ్చర్యం లేదని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు, ఆరోపణల్లో ముఖ్యమైనవి ఇవీ...

  • ఎన్‌టీ రామారావు ఎన్నడో నిన్ను తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాడు. 1982లో మేమంతా టీడీపీ సభ్యత్వం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నన్ను సస్పెండ్ చేసే నైతిక హక్కు నీకు లేదు. టీడీపీలో చంద్రబాబు కన్నా నేనే సీనియర్‌ని.
  • జెండా నీది కాదు. ఎన్‌టీ రామారావును చంపి నువ్వు తీసుకున్నావు. చేతనైతే జగన్ లాగా, పవన్‌కల్యాణ్ లాగా, చంద్రశేఖర్‌రావు లాగా నీ జెండా నువ్వు పెట్టుకో. ఎన్‌టీ రామారావుకు అల్లుడు కావటమే చంద్రబాబు అదృష్టం.
  • నీ జీవితమే అవినీతిమయం. కుట్రలకు, మోసాలకు నిలయం. ఉమ్మడి రాష్ట్రముంటే నువ్వు నన్ను వదిలిపెట్టేవాడివేనా? నేను ఏనాడైనా పదవి అడిగానా? రాజ్యసభ సీటు ఇస్తానని నీ బంధువైన గరికపాటి మోహనరావుకు అమ్ముకున్నావు.
  • చంద్రబాబుకు అధికారం లేనపుడు.. తనను కాపాడమని వేడుకుంటే ఆనాడు నేనొక్కడ్నే ఆయనతో పాటు ఉన్నా. నేను లేకపోతే ఇంటి నుంచి బయటికి రాని వాడివి నువ్వు. ఏమైనా అంటే మా కులపోళ్లతోని తిట్టిస్తావు. కులాల మధ్య పంచాయతీ పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుంటావు.
  • తెలంగాణలో పదేళ్లు ఉండమంటే.. కేసీఆర్‌ దెబ్బకు నువ్వు గిలగిలలాడి రాత్రికి రాత్రి వెళ్లిపోయావు. కేసీఆర్ సర్కారును కూల్చాలని చూసి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయావు. ఆ ఫోన్ టేపులో గొంతు నాది కాదు అని చెప్పు చూద్దాం.
  • చంద్రబాబు మిత్ర ద్రోహి. మోదీకి అన్యాయం చేశావు. కాళ్లు, వేళ్లు పట్టుకుని కేసు మాఫీ చేసుకున్నావు. 29 సార్లు దిల్లీ వెళ్లింది హోదా కోసం కాదు. కేసు మాఫీ చేయాలని ప్రాధేయపడటానికి. అంతా కలిసి హోదా కోసం ఉద్యమిస్తే ఈయనకు చలనం వచ్చింది. బాబు ఎంత గోల పెట్టినా మోదీ హోదా ఇవ్వడు.
  • హోదా వద్దనేది నువ్వే.. ప్రత్యేక ప్యాకేజీ చాలా బాగుందని అసెంబ్లీలో తీర్మానం చేసేది నువ్వే. ప్రత్యేక హోదా బ్రహ్మపదార్థం కాదు.. పాశుపతాస్త్రం కాదట.. హోదా లేదని చెప్పిన నాడే మీ మంత్రులు, ఎంపీలు రాజీనామా చేసి ఉంటే.. కొంత క్రెడిబిలిటీ ఉండేది.
  • వాజపేయిని చేశానంటాడు. అబ్దుల్‌కలాంను చేశానంటాడు. మోదీని చేశానంటాడు. ఎన్‌టీ రామారావుకి భారతరత్న ఎందుకు తేలేదు? ఈర్ష్య. తనకంటే ఎన్‌టీరామారావుకు ఎక్కువ పేరు రావటం ఈయనకు ఇష్టం లేదు. బతికినప్పుడు చంపితివి.. చచ్చిన తర్వాతా చంపుతుంటివి.
  • మాట్లాడితే జగన్ దొంగ అంటావు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావో తెలీదు. సింగపూర్‌లో, దుబాయ్‌లో దాస్తున్నవు. హెరిటేజ్‌లో బ్లాక్ మనీ అంతా తీసుకెళ్లి పెట్టి లాభాలు వచ్చాయి అని షేర్ల రేట్లు పెంచుకుంటున్నావు.
  • ఎవరైనా దళితుడుగా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అడుగుతాడా? మా మీద ఎంత చిన్నచూపు ఉందో నీ మాటల్లోనే బయటపడ్డాయి. ఈ భ్రష్టుడి కొరకు నా జీవితమంతా ధారపోసిన.

పార్టీలో ఉన్నపుడు అంతా పచ్చగానే కనపడుతుంది: టీడీపీ

‘‘మోత్కుపల్లి నర్సింహులుకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఆయన ఇంకా ఏవేవో కావాలని కోరుకున్నారు. పార్టీకి అవి నెరవేర్చే అవకాశం రాలేదు. అయినా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. కానీ పార్టీని నష్టపరిచే విధంగా ప్రవర్తిస్తుండటంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుని ఆమోదించాం’’ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు.

మోత్కుపల్లి చేసిన విమర్శలపై స్పందన కోరగా.. ‘‘పార్టీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. పార్టీలో ఉన్నపుడు అంతా మంచిగానే ఉంటుంది. పచ్చగా కనపడుతుంది. కానీ బయటకు వెళ్లగానే అంతా చెత్తగా కనపడుతుంది. ఇంతకంటే ఏం అంటాం’’ అని రమణ వ్యాఖ్యానించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)