ప్రెస్ రివ్యూ: "ఎన్టీఆర్‌కూ, నాకూ చెడ్డపేరు తేవొద్దని లోకేష్‌కు ముందే చెప్పా!"

  • 30 మే 2018
Image copyright facebook.com/tdp.ncbn.official

'రాజకీయాల్లోకి రావడమా? వ్యాపార రంగంలోకి వెళ్లడమా? నీ ఇష్టమేనని లోకేష్‌కు చెప్పా. రాజకీయాల్లోకే రావాలని నిర్ణయించుకున్నప్పుడు క్రమశిక్షణతో మెలగాలని సూచించా' అని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

మహానాడులో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ఆ పత్రిక ప్రచురించింది.

"ఎన్టీఆర్‌కు, నాకు చెడ్డపేరు తేవొద్దని చెప్పా. లోకేష్‌గానీ, మిగతా మంత్రులుగానీ ప్రజాసేవలో పోటీ పడాలి. సమర్థత ఉంటే రాజకీయమైనా, వ్యాపారమైన వారే రాణిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తే.. వారి రెండోతరం వారసులు వాటిని పోగొడతారు. నా తల్లిదండ్రులు నాకేమీ ఇవ్వలేదు. నేనే కష్టపడ్డా. ఈ స్థాయికి చేరుకున్నా. 40 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన నాయకులనూ చూస్తున్నారు. అలాంటివారు నాపై అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. వారు వాడే భాష చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. పరిటాల రవీంద్ర లాంటి నాయకుడ్ని హత్య చేసినప్పుడూ నేను నిబ్బరాన్ని కోల్పోలేదు" అని చంద్రబాబు అన్నారు.

Image copyright facebook.com/TelanganaCMO

ప్రవాస రైతులకూ చెక్కులు

ప్రవాస భారతీయులైన రైతుల పేరిట మంజూరైన రైతుబంధు పథకం చెక్కులను వారి కుటుంబాలకు అందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై త్వరలోనే ఒక విధానం రూపొందించి, అమలు చేస్తామని వెల్లడించారని 'ఈనాడు' తెలిపింది.

5 లక్షలమంది ప్రవాస రైతు కుటుంబాలకు చెక్కులు అందలేదన్న విషయాన్ని మంగళవారం రైతు సమన్వయ సమితులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా సీఎం ప్రస్తావించారు.

రైతులకు పెట్టుబడి సాయం అందాలన్నదే తమ సంకల్పమని, విదేశాల్లో ఉన్న రైతులు కూడా తెలంగాణ బిడ్డలేనని, వారి కుటుంబాలు ఇక్కడే ఉండి కష్టపడి వ్యవసాయం చేస్తున్నందున వారికి సాయం చేయడం మన ధర్మమని, పథకం ఉద్దేశం కూడా అదేనని చెప్పారు.

ప్రవాస రైతు కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, త్వరలోనే చెక్కులు వారికి అందుతాయని అన్నారు. చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ 20వ తేదీలోగా మరోసారి నిర్వహిస్తామని తెలిపారు. రికార్డులను మరోసారి క్షుణ్నంగా పరిశీలించి, మార్పులు చేర్పులు చేస్తామన్నారని ఈనాడు తెలిపింది.

Image copyright Getty Images

5 నోటిఫికేషన్లు..3000 కొలువులు!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినం సందర్భంగా పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోందని 'నమస్తే తెలంగాణ' పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఒకేరోజు నాలుగైదు నోటిఫికేషన్లు విడుదల చేసి సుమారు 3000 వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. 2000 పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను నోటిఫికేషన్లలో చేర్చనున్నట్టు తెలిసింది.

ఈ కొలువుల్లో ప్రధానంగా సాధారణ డిగ్రీ అర్హత కలిగినవే అధికంగా ఉన్నాయని సమాచారం. గ్రూప్- 4 పోస్టులు 1300-1500, వీఆర్వో -700, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 450, గ్రూప్-1లో 125 ఖాళీలు ఉండనున్నట్టు సమాచారం.

ఆర్టీసీలో 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసిందని నమస్తే తెలంగాణ వివరించింది.

వ్యవసాయ సంక్షోభం Image copyright AFP

చల్లని కబురు..

నిర్ణీత సమయం కన్నా మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని 'సాక్షి' ఓ కథనంలో తెలిపింది.

సాధారణంగా జూన్‌ ఒకటో తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గతేడాది మే నెల 30వ తేదీన ప్రవేశించగా, ఈసారి 29నే వచ్చాయి.

జూన్‌ ఏడో తేదీన తెలంగాణలోకి నైరుతి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారని సాక్షి పేర్కొంది.

రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని.. బుధ, గురువారాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వై.కె.రెడ్డి తెలిపారు.

మంగళవారం ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, రామగుండం, మెదక్, ఖమ్మంలలో 44 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్‌ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎం ఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది.

గతేడాది ఇదే సీజన్‌లో 87 శాతమే కురిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు