పేటీఎంకు బీజేపీతో ఉన్న అనుబంధం ఏమిటి?

  • దేవినా గుప్తా
  • బీబీసీ ప్రతినిధి
మోదీ, విజయ్ శేఖర్ శర్మ

ఫొటో సోర్స్, Twitter@vijayshekhar

భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 'పేటీఎం కరో' అనే పదబంధం బాగా ప్రచారంలోకి వచ్చింది.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ నినాదం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మదిలో నుంచి వచ్చినదే.

సెర్చ్ ఇంజిన్ అనగానే గూగుల్, ఫొటోకాపీ అనగానే జిరాక్స్ బ్రాండ్లు గుర్తుకొచ్చినట్లు ఈ- వ్యాలెట్ చెల్లింపులు అనగానే పేటీఎం బ్రాండ్ గుర్తుకురావాలని విజయ్ కోరిక. ఈ- నగదు చెల్లింపులకు పేటీఎం పర్యాయపదంగా నిలవాలనేది ఆయన లక్ష్యం.

అయితే, ఇటీవల వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో పేటీఎంపై ఆరోపణలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇంతకీ వివాదం ఏంటి?

ఓ మీడియా కంపెనీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మ( విజయ్ శేఖర్ శర్మ సోదరుడు).. బీజేపీ మేధోసంస్థ ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయమ్ సేవక్ సంఘ్)‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.

అలాగే, గతంలో కశ్మీర్‌లో రాళ్ల దాడి జరిగిన ఘటన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తమకు ఫోన్ వచ్చిందని, అక్కడి పేటీఎం వినియోగదారుల వివరాలు కావాలని పీఎంవో అడిగిందని స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పారు.

దీంతో పేటీఎం వినియోదారుల వ్యక్తిగత వివరాల గోప్యతపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విమర్శలను పేటీఎం ఒక ప్రకటనలో ఖండించింది. థర్డ్ పార్టీతో తాము ఎప్పుడూ డేటాను పంచుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై అజయ్ శేఖర్ శర్మను బీబీసీ పలుమార్లు సంప్రదించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

పేటీఎం వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం అశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images

పేటీఎం ఎందుకు విజయవంతమైంది

2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశమంతా ఆశ్చర్యపోయింది. అయితే, ఈ ప్రకటన పేటీఎంకు వరంగా మారింది. అది ఊహించనిస్థాయిలో అభివృద్ధి చెందింది. నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా 2010లో పేటీఎం ప్రారంభమైంది. అయితే, నగదు లావా దేవీలే ఎక్కువగా నడిచే దేశంకావడంతో పేటీఎం పెద్దగా వినియోగదారులకు చేరువ కాలేదు. ఆరేళ్లలో అంటే 2016 వరకు పేటీఎం వినియోగదారుల సంఖ్య 12.5 కోట్లు. ఈ- చెల్లింపులు చాలా తక్కువగా ఉండేవి.

కానీ, పెద్దనోట్ల రద్దు తర్వాత పేటీఎం దశ తిరిగింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత కంపెనీ ఒక్కసారిగా 50 శాతం వృద్ధి నమోదు చేసింది.

దేశమంతా నగదు కొరతను ఎదుర్కోవడంతో దాదాపు 19 కోట్ల మంది వినియోగదారులు వెంటనే పేటీఎంకు అనుసంధానమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

పేటీఎం ఎలా విస్తరించింది

నోట్ల రద్దు తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ ఏర్పాటుకు విజయ్ శేఖర్ శర్మ తన భాగస్వామ్య కంపెనీ వన్97లో ఉన్న ఒక శాతం వాటాను రూ.325 కోట్లకు అమ్ముకున్నారు.

ఆ తర్వాత కంపెనీకి వినియోగదారులు మరింత పెరగడంతో చైనాకు చెందిన అలీబాబా, ఎస్ఏఐఎప్‌లను తన భాగస్వామ్యులుగా చేర్చుకున్నారు.

చైనా పెట్టుబడిదారులు కలవడంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 6 నెలల్లోనే విజయ్ శేఖర్ శర్మ 200 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చగలిగారు.

ఇక అప్పటి నుంచి విజయ్ శేఖర్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు కూడా పేటీఎంలో పెట్టుబడులు పెట్టింది. గత ఏడాది మేలో 1.4 బిలియన్ డాలర్లతో కంపెనీని విస్తరించింది.

ఇక పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్లతో తన పోటీదారులను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. బ్యాంక్, ఈ-కామర్స్‌తో పాటు జనరల్ ఇన్సూరెన్స్‌లకు కూడా అనుమతి పొందింది.

2015లో రూ.334 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ 2017 మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అత్యంత వేగంగా రూ. 828 కోట్ల ఆదాయానికి ( ఈ కామర్స్‌ను మినహాయించగా) చేరడంలో ఇక ఆశ్చర్యమేముంది.

ప్రస్తుతం పేటీఎంకు 30 కోట్ల మంది వినియోగదారులున్నారు. రోజూ సగటున 70 లక్షల చెల్లింపులు జరుగుతున్నాయి. వీటి విలువ 940 కోట్ల డాలర్లు ఉంటుంది.

రాజకీయంగా విమర్శలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత విజయ్ శేఖర్ శర్మ బహిరంగంగానే మోదీ విధానాలకు మద్దతు తెలుపుతున్నారు.

ప్రధానమంత్రి పెద్ద సైజు ఫొటోలతో వివిధ పత్రికల్లో పేటీఎం వాణిజ్య ప్రకటనలను కూడా ఇచ్చింది. ''స్వతంత్ర్య భారత ఆర్థిక చరిత్రలో ఇదో సాహసోపేత నిర్ణయం''అని పెద్దనోట్ల రద్దును ప్రశంసించింది.

దీంతో పేటీఎంపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.

పేటీఎం అంటే 'పే టూ పీఎం' అని రాహుల్ గాంధీ ఎగతాళి చేయగా, అధికార పార్టీ పేటీఎంకు అనుకూలంగా ప్రవర్తిస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.

దీంతో ప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ముందస్తు అనుమతి లేకుండా ప్రధాని ఫొటోలను వాడటంపై జరిమానా విధిస్తామని పేటీఎంను హెచ్చిరించింది.

కానీ, 6 నెలల తర్వాతే పేటీఎం తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పింది.

వ్యక్తిగత వివరాల గోపత్యపై అనుమానాలు రావడంపై పేటీఎంలో పెట్టుబడులు పెట్టిన అలీబాబాను బీబీసీ సంప్రదించగా వారు స్పందించలేదు.

సాఫ్ట్ బ్యాంకు అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, తాము తమ పోర్ట్ పోలియో కంపెనీల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయమని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)